టీడీపీ అంటే భయంతోనే కేసీఆర్ అలా చేశాడట

తెలంగాణలో రాజకీయం హాట్ హాట్‌గా సాగుతోంది. అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్.. ముందుస్తుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో అసెంబ్లీ రద్దు సమాచారం అందగానే కేంద్ర ఎన్నికల కమిషన్‌ చకచకా చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ పంపిన నివేదికపై శుక్రవారమే కమిషన్‌ చర్చించింది. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా మిగతా పార్టీల్లో అలజడి మొదలైంది. కేసీఆర్ ఇలా ప్రకటన చేశారో లేదో అన్ని పార్టీలు తమ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు ప్లాన్లు సిద్ధం చేసుకున్నాయి. అలాగే ఆ పార్టీల అధిష్టానాలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, ఎన్నికల్లో గెలిచే మార్గాలపై దృష్టి సారించాయి.

తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించబోతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ.. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని డిసైడ్ అయిన టీడీపీ.. అందుకోసం అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టాలని భావిస్తోంది. ఇదే జరిగితే తమకు కష్టాలు తప్పవని భావిస్తున్న టీఆర్ఎస్ నేతలు టీడీపీని టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అసెంబ్లీ రద్దు తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ సైతం తెలుగుదేశం పార్టీ ఆంధ్రోళ్ల పార్టీ అని, తెలంగాణను ఇక్కడి వాళ్లే పాలించాలని పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజాగా టీడీపీ మద్దతుదారులు మరో వాదనను తెరపైకి తీసుకువచ్చారు. రాష్ట్రంలో టీడీపీకి నాయకత్వ లేమి తప్ప క్యాడర్ పటిష్టంగానే ఉందని, సెటిలర్ల ఓట్లు కూడా ఆ పార్టీకే పడే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే కేసీఆర్‌కు టీడీపీ అంటే భయం పట్టుకుందని ఆ పార్టీ మద్దతుదారులు అంటున్నారు.

అందుకోసమే గతంలో టీడీపీలో గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన 12 మందికి ఈ సారి టికెట్లు కేటాయించారని వారు అంటున్నారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం టీడీపీ మద్దతుదారుల వాదనకు బలం చేకూర్చుతోంది. ఇటీవల కేసీఆర్ విడుదల చేసిన తొలి జాబితాలో వీరందరికీ చోటు కల్పించారు. వీరిలో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు- పాలకుర్తి, రాజేందర్‌రెడ్డికి- నారాయణపేట, ప్రకాష్ గౌడ్‌కు-రాజేంద్రనగర్‌, తీగల కృష్ణారెడ్డికి- మహేశ్వరం, మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి- ఇబ్రహీంపట్నం, అరికెపూడి గాంధీకి- శేరిలింగంపల్లి, కేపీ వివేకానందకు- కుత్బుల్లాపూర్‌, మాధవరం కృష్ణారావుకు- కూకట్‌పల్లి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు‌- సనత్‌నగర్‌, చల్లా ధర్మారెడ్డికి- పరకాల, మాగంటి గోపీనాథ్‌కు- జూబ్లిహిల్స్‌, జి.సాయన్నకు- కంటోన్మెంట్ స్థానాలను కేటాయించారు. టీడీపీ సానుకూల ఓట్లను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నంలోనే కేసీఆర్ వీరందిరకీ టికెట్లు కేటాయించారని ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.