ఆ నేతల విషయంలో సీఎం కఠిన నిర్ణయం

ఏపీలో వరుసగా రెండో సారి అధికారంలోకి రావాలని భావిస్తోంది తెలుగుదేశం పార్టీ. అందుకోసం అనేక వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. గత ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులున్నా ఎలాగోలా గట్టున పడ్డ ఆ పార్టీ.. ఈ సారి వార్ వన్‌సైడ్ అయ్యేలా చేయాలని చూస్తోంది. అయితే, ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ప్రభావం చూపగల అవకాశాలు ఉండడం.. జనసేన పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడం.. కాంగ్రెస్ అనూహ్యంగా రేసులోకి రావడం వంటి పరిణామాలతో ఏపీలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఇన్ని పార్టీలు ఎన్నికల బరిలో ఉండడంతో టీడీపీ అధికారమే మంత్రంగా బరిలోకి దూకాలని భావిస్తోంది. అంతేకంటే ముందే తమ పార్టీలో కొన్ని ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకుంది.

ఇందులో భాగంగా, ఎన్నికలకు ఏడాదిలోపే సమయం ఉండటంతో టీడీపీ ప్రజాప్రతినిధులు.. నేతల దందాలకు పాల్పడే వారికి చెక్‌పెట్టే యోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది ప్రజాప్రతినిధులు సంపాదనపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధి పనులపై పెట్టడం లేదంటూ సొంత పార్టీ కేడర్‌ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోందట. ఈ మేరకు ఇసుక, గ్రావెల్‌ మైనింగ్‌, ల్యాండ్‌ సెటిల్‌మెంట్లలో క్రియాశీలకంగా ఉంటున్న ప్రజాప్రతినిధులపై పార్టీ కార్యాలయ ప్రతినిధులు ఆరా తీస్తున్నారని సమాచారం. బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఎన్డీయే నుంచి విడిపోయిన తర్వాత టీడీపీకి మంచి ఊపు వచ్చిందని, అయినా కొందరు ప్రజాప్రతినిధులపై ఉన్న వ్యతిరేకత వల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

టీడీపీలో ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులైతే మరీ దారుణంగా ఉన్నాయట. నియోజకవర్గ స్థాయిలో వచ్చే అభివృద్ధి నిధులతో చేసే పనులలో పర్సెంటేజీలతోపాటు.. గ్రామ, మండల స్థాయిలలో జరిగే పనులలోనూ తమకే పర్సెంటేజీలు ఇవ్వాలంటూ కొంతమంది ఎమ్మెల్యేలు.. కాంట్రాక్టర్లు, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరించడం వల్లే చెడ్డ పేరొచ్చిందని పార్టీ సీనియర్లు గుర్తుచేస్తున్నారట. ఇదే కొనసాగితే ఆ పార్టీకి పట్టిన గతే టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీలోని కొందరు సీఎంపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. అందుకోసమే సీఎం అలాంటి నేతలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆయా నేతలను కనుక్కునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు.. వైసీపీ నేతలూ ఇలాంటి దందాలలో ఉన్నట్లు ఇంటిలిజెన్స్‌ వర్గాల నుంచీ ప్రభుత్వానికి నివేదిక వెళ్లినట్లు తెలుస్తోంది. వారిపై కొద్దిరోజుల్లోనే చర్చలు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.