కాంగ్రెస్‌లో పుట్టి… టీడీపీలో ఎదిగి… తిరిగి కాంగ్రెస్‌తో…

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుది యూత్ కాంగ్రెస్ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత టీడీపీలో చేరాక, కరుడుగట్టిన కాంగ్రెస్ వ్యతిరేకవాదిగా మారారు. అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కాబట్టి అలా ఉండక తప్పలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కాదు. పోటీ పడే పరిస్థితిలో కూడా ఎంతమాత్రం లేదు. పైగా ఇప్పుడు ఆ పార్టీ టీడీపీకి సహాయకారిగా ఉండాలనుకుంటోందని తెలుస్తోంది. అందుకే చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీపై ఎక్కడ లేని సానుభూతి కురిపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. పైగా ఆయన ఆ పార్టీపై విమర్శలు పూర్తిగా తగ్గించేయడమే కాకుండా ఈ మధ్య కాలంలో కాస్తంత పాజిటివ్ ధోరణిలో మాట్లాడటం విశేషం. అయితే దానిని చంద్రబాబు ఒక్క ప్రత్యేకహోదాకే పరిమితం చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ముస్లింమైనార్టీల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తప్పు దిద్దేసుకున్నదని ప్రకటించారు.

రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెబుతోందని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఏపీ ప్రజలకు నమ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు ప్రజల ముందు కాంగ్రెస్ ను తప్పు దిద్దుకున్న పార్టీగా నిలబెట్టే ప్రయత్నం చేయడమే చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే చంద్రబాబు ఇలా మాట్లాడటం వెనుక పక్కా వ్యూహం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రాంతీయ పార్టీల అధినేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు ఏర్పడేలా ఉన్నాయి. దీనికితోడు ప్రత్యేకహోదా సాధనకు కాంగ్రెస్ తప్ప మరో మార్గం లేదని ప్రజలకు తెలియచెప్పడానికి కూడా చంద్రబాబు ఈ వాదన అందుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఒంట‌రిగా పోటీ చేసిన చ‌రిత్ర లేని టీడీపీకి ఇప్పుడు ఒంట‌రిత‌నం తప్పనిసరి అవుతున్నట్లు తెలుస్తోంది. చంద్ర‌బాబు ఆశించిన దానికి భిన్నంగా పరిస్థితులు మారిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. బీజేపీని వ్య‌తిరేకించిన నేపధ్యంలో త‌న‌కు క‌మ్యూనిస్టులు తోడ‌వుతార‌ని చంద్ర‌బాబు ఆశించారు.  వామ‌ప‌క్ష పార్టీల‌తో క‌లిసి రాబోయే ఎన్నిక‌ల్లో రంగంలో దిగొచ్చ‌ని బాబు ఆశించారని తెలుస్తోంది. గత ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, బీజేపీతో జతక‌ట్టి గ‌ట్టెక్కిన చంద్రబాబు ఈసారి వామపక్షాల చేయూత క‌లిసి వ‌స్తుంద‌ని అంచ‌నా వేశారని అంటున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు తారుమారైనట్లు తెలుస్తోంది. క‌మ్యూనిస్టులు, జ‌న‌సేన మ‌ధ్య ఎన్నిక‌ల పొత్తు దాదాపు ఖాయం అయ్యిందని తెలుస్తోంది. ఫలితంగా చంద్రబాబు కాంగ్రెస్ తో జతకట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.