టీడీపీకి కష్టాలు ప్రారంభమయ్యాయా..?

అసెంబ్లీ రద్దు తర్వాత తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అన్ని పార్టీలూ ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నిస్తున్నాయి. అధికార పార్టీ ‘ముందస్తు’గా అభ్యర్థిని ప్రకటించడంతో టికెట్‌ ఆశించి భంగపడిన నాయకులు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. అధిష్ఠానం రంగంలోకి దిగినా ససేమిరా అంటున్నారు. మరోవైపు ప్రతిపక్షాలన్నీ కూటమిగా ఏర్పాడేందుకు ముందడుగు వేస్తున్నాయి. ఇప్పటికే దీనిపై పలుమార్లు భేటీలు కూడా జరిగాయి. ఇక రేపో మాపో అందులోని పార్టీలన్నీ అధికారికంగా ప్రకటించడమే తరవాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీలో అసమ్మతి నేతలు రెచ్చిపోతున్నారు. పెద్ద నాయకులు కనిపిస్తే చాలు.. తమ గోడును వెల్లదీసుకుంటున్నారు. కొంత మంది ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పగా.. మరికొందరు అదే దారిలో పయణించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకొంత మంది నాయకులైతే రెబెల్స్‌గా బరిలోకి దిగుతామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అభ్యర్ధులను ప్రకటించడం వల్లే ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఈ పరిస్థితి నెలకొంది. కొద్దిరోజుల్లో పొత్తులు ఖరారయ్యాక ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఇదే సీన్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వీటిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చిచ్చు రగిలే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలు చేస్తున్న హడావిడి మామూలుగా లేదు. మహా కూటమిలో ఆ పార్టీ చేరడం వల్ల కష్టాలు ప్రారంభమవుతాయంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే విభజన తర్వాత చాలా మంది నాయకులను కోల్పోయిన ఆ పార్టీకి కొంత మంది నేతలు ఆసరాగా ఉన్నారు. ఇప్పుడు వారంతా టికెట్లు ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగేందుకు పలువురు నాయకులు సిద్ధంగా ఉన్నారు. మహా కూటమిలో భాగంగా కొన్ని స్థానాలు తమకే దక్కుతాయన్న ఆశతో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. అయితే, పొత్తులో ఆయా స్థానాలు టీడీపీకి కేటాయించకపోతే వారంతా అధిష్టానంపై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు గ్రేటర్‌కు చెందిన పలువురు నేతలు చంద్రబాబును కలిశారు. వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్లు కావాలని కోరుతున్నారు. అలా తన దగ్గరకు వచ్చిన వారందరికీ సీట్ల విషయం టీటీడీపీనే చూసుకుంటుంది అని చెబుతున్నారట. దీంతో వారంతా నిరాశగా వెనుదిరుగుతున్నారని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.