ప‌సుపు గూటిలో వార‌సుల కోసం పాట్లు!

ఏపీ తెలుగుదేశంలో ర‌స‌వ‌త్త‌ర‌మైన సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. 2014 గెలుపుతో మాంచి ఊపుమీదున్న టీడీపీ 2019లో విజ‌యం త‌ధ్యం అనేది తెలుగుత‌మ్ముళ్ల వాద‌న‌. ప్ర‌త్య‌ర్థుల నుంచి గ‌ట్టిపోటీ వున్న చంద్ర‌బాబుపై న‌మ్మ‌క‌మే త‌మ‌కు శ్రీరామ‌ర‌క్ష అనేది నేత‌ల అంత‌రంగం. అవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే.. ఇప్పుడు సైకిల్ జోరు పెర‌గ‌టంతో పార్టీలోని సీనియ‌ర్ నేత‌లు.. త‌మ వారసుల‌ను రాజ‌కీయ‌రంగంలోకి దింపేందుకు ఇదే స‌రైన స‌మ‌యంగా భావిస్తున్నారు. ఆ జాబితాలో ఎక్కువ‌శాతం రాయ‌ల‌సీమ నేత‌లే ఉండ‌టం విశేషం.

క‌డ‌ప‌లో ఆదినారాయ‌ణ‌రెడ్డి, క‌ర్నూలులో సుబ్బారెడ్డి, అనంత‌పురంలో జేసీ దివాక‌ర్‌రెడ్డి, ప‌రిటాల సునీత వంటి వారు ముందు వ‌రుస‌లో ఉన్నారు. జేసీ అయితే.. ఈ సారి అనంత‌పురం ఎంపీసీటు.. కుమారుడు ప‌వ‌న్‌కుమార్‌రెడ్డికి ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాడ‌ట‌. అయితే మ‌రోవైపు సునీత కూడా.. ప‌రిటాల శ్రీరామ్‌ను రాజ‌కీయ‌ప్ర‌వేశం చేయించేందుకుపార్ల‌మెంట్ ఉత్త‌మం అనే ధోర‌ణిలో ఉన్నార‌ట‌. ఎందుకంటే.. ఎమ్మెల్యే అయితే.. లోక‌ల్ రాజ‌కీయాలు.. లేనిపోని ఫ్యాక్ష‌నిజం త‌గాదాల‌నే ఆందోళ‌న కార‌ణ‌మ‌ట‌. విజ‌య‌వాడ‌లో.. దేవినేని నెహ్రు త‌న‌యుడు అవినాష్ ను కూడా ఎంపీగానే నిల‌పాల‌ని దేవినేని అభిమానులు డిమాండ్ అట‌. మంత్రులు ఘంటా, చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు వంటి వారు.. కూడా త‌మ కుమారుల‌కు సీటు కోసం లోకేష్‌ను న‌మ్ముకుంటున్నార‌ట‌.

గుంటూరు, కృష్ణాజిల్లాల్లోనూ కొన్ని పేర్లు వినిపిస్తున్నా .. కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. అందుకే.. మ‌హానాడు వేదిక‌గా.. సీఎంచంద్ర‌బాబును ప్ర‌స‌న్నం చేసుకునేందుకు సీనియ‌ర్ లీడ‌ర్లంతా నానా పాట్లు ప‌డుతున్నారు. ఆయ‌న దృష్టిలో ప‌డేందుకు కూడా.. బాబు, లోకేష్‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారనే గుస‌గుస‌లుకూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. మ‌హానాడు వేదిక‌గా మాత్ర‌మే. తాము నిరూపించుకోగ‌ల‌మ‌నేది వారి న‌మ్మ‌కం. కానీ.. చంద్ర‌బాబు నాయుడు 2019 ఎన్నిక‌ల‌ను చాలా సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే పోల్ మేనేజ్‌మెంట్‌పై త‌న వ్యూహాల‌కు ప‌ద‌నుపెడుతున్నార‌ట‌. జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల ఓట్ల చీలిక ప్ర‌భావం ఏయే నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంటుంద‌నే విష‌యాన్ని కూడా ఎప్ప‌టిక‌ప్పుడు తెప్పించుకుని.. లెక్క‌లు క‌డుతున్నార‌ని స‌మాచారం. మ‌రి ఇటువంటి కీల‌క‌మైన స‌మ‌యంలో బాబు పొగ‌డ్త‌ల‌కు ప‌డిపోతారంటారా! వార‌సుల కోసం అప్లికేష‌న్ పెడితే.. ప‌చ్చ‌జెండా ఊపుతారా! ఇది కూడా తెలుగు త‌మ్ముళ్ల‌లో మ‌రో సందేహం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.