మ‌న్యంపై టీడీపీ నిర్ల‌క్ష్యం…

తూర్పు మన్యంలో పరిస్థితి విభిన్నంగా ఉంటుంది. పార్టీ ఏదైనా…నేతలు ఎవరైనా అందరి తీరు ఒక్కటే.. ఎన్నికల వేళ కూడా ఓటు అడిగేందుకు గిరిజన గ్రామాలకు వెళ్లని నేతలు ఎందరో! ప్రభుత్వాలు అన్ని సదుపాయాలు కలిగిస్తున్నా ఏజెన్సీ ప్రాంతాల్లోకి అడుగుపెట్టని అధికారులు కూడా ఎందరో..! ఇలాంటి పరిస్థితులే గిరిజనుల పాలిట శాపంగా మారాయి.. రంపచోడవరం నియోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామాల పరిస్థితి మరీ అధ్వాన్నం.. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో జ్వరంతోనే వారు మృత్యువాత పడుతుండటం విషాదం కాక మరేమిటి?  ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు గిరిజనుల బతుకులను మార్చలేకపోతున్నాయి. వైద్య సదుపాయాలు అసలు లేవు.. అంతుపట్టని రోగాలు గిరిజనులను వెంటాడుతూనే ఉన్నాయి. ఏటా పదుల సంఖ్యలో బాలింతలు.. శిశువులు మృత్యువాత పడుతున్నారు. గిరిజనుల సమస్యలు పరిష్కరించడంలో రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఘోరంగా వైఫల్యం చెందారు. నాలుగేళ్ల పదవీకాలంలో ఆమె పాలనపై  పట్టు సాధించలేకపోయారు. ప్రభుత్వ పథకాలపై ఆమెకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంవల్ల అధికారులను గట్టిగా నిలదీయలేని పరిస్థితి నెలకొంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశంపార్టీలో చేరినప్పటికీ ఎమ్మెల్యే మాట నేటికి చెల్లుబాటు కావడం లేదు. అభివృద్ధి పనుల విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఆమె ప్రశ్నించలేకపోతున్నారు.
మరోపక్క ఎంపీ కొత్తపల్లి గీత జాడే లేకుండా పోయారు. నాలుగేళ్ల కాలంలో కొత్తపల్లి గీత గిరిజనుల సమస్యల పట్ల స్పందించిన దాఖలాలు అసలే లేవు. ఏజెన్సీ ప్రాంతాలలో ఆమె పర్యటించకపోవడం గిరిజనులకు శాపంగా మారింది. ఎమ్మెల్యే…ఎంపీల పరిస్థితి ఇలా ఉంటే కనీసం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మంత్రులు  యనమల రామకృష్ణుడు.. నిమ్మకాయల చినరాజప్ప కూడా గిరిజనుల సమస్యలపై దృష్టి సారించడం లేదు.. గిరిజన శాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు కూడా మన్యం సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదన్న ఆవేదన గిరిపుత్రులలో గూడుకట్టుకుని ఉంది.. ప్రజాప్రతినిధుల తీరు ఇలా ఉంటే.. ఏళ్ల తరబడి ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశంపార్టీ నాయకులు కూడా గిరిజనుల సమస్యల పరిష్కారంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. టీడీపీ ఇన్‌ఛార్జ్‌ శీతంశెట్టి వెంకటేశ్వరరావు.. మాజీ ఎమ్మెల్యే చిన్నంబాబు రమేశ్‌లు కూడా ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయించడంలో విఫలం అవుతున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం టీడీపీ నాయకుల మాట చెల్లుబాటు కావడం లేదు. స్థానిక టీడీపీ నేతలను అధికారయంత్రాంగం పట్టించుకోవడం లేదు.. దీంతో వారు డీలా పడుతున్నారు. జన్మభూమి కమిటీలకు కూడా అధికారయంత్రాంగం ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల తెలుగుతమ్ముళ్లలో నైరాశ్యం అలుముకుంది. అధికారుల తీరుతో టీడీపీ క్యాడర్‌ బలోపేతం కావడం లేదు. సమస్యలపై పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ కూడా స్తబ్ధుగా ఉంది.. కాంగ్రెస్‌ పరిస్థితి కూడా డిటోడిటో! ఆదివాసీ సంఘాలు.. వామపక్షాలు ఉద్యమాలు చేసి చాన్నాళ్లయ్యింది.. ఏవో మొక్కుబడి కార్యక్రమాలు చేసి చేతులు దులుపుకుంటున్నాయి. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం తూర్పు మన్యం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.
చిత్తశుద్ధి లేని అధికారుల కారణంగా సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. నియోజకవర్గ కేంద్రమైన రంపచోడవరంలో కూడా ఉన్నతస్థాయి అధికారులు నివాసం ఉండటం లేదు.. కిందిస్థాయి అధికారులు… సిబ్బంది కూడా మైదాన ప్రాంతం నుంచే ఇక్కడికి వస్తున్నారు.. మారుమూల గ్రామాలకు అధికారులు వెళ్లడం లేదు. శాశ్వత చర్యలు చేపట్టడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. మరోపక్క గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అభివృద్ధి పనులలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురవుతున్నా.. అధికారయంత్రాంగం సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఐటీడీఎ పాలకవర్గ సమావేశాలు కూడా సక్రమంగా జరగడం లేదు. ఇప్పటికైనా నాయకులు..అధికారులు తీరు మార్చుకుని గిరిజనులకు అండగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గిరిజనుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాల్సిన అవసరం ఉంది.. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.