వైసీపీలోకి టీడీపీ ఎంపీ..!

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారట. ఈ మేరకు వైసీపీ ముఖ్య నేతలతో ఆయన సంప్రదింపులు కూడా జరిపారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అనకాపల్లి ఎంపీగా ఉన్న అవంతి.. ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ టీడీపీ ఎంపీలు చేసిన నిరసన కార్యక్రమాల్లో తనదైన పాత్రను పోషించారు. టీడీపీలో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, తన కోరికను తీర్చుకోవడం కోసం ఆయన పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్.. చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలో ప్రజారాజ్యంలో చేరి, 2009 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఆ పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేయడం, రాష్ట్ర విభజన జరగడం చకచక జరిగిపోయాయి. దీంతో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విభజనానంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పడు ఆయన కన్ను మరోసారి భీమిలి అసెంబ్లీ స్థానంపై పడింది. అయితే అక్కడ ప్రస్తుత కేబినెట్‌లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

తనకు రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా పని చేయాలని ఉందని, అందువల్ల భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అవంతి.. పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత కేబినెట్‌లో మినిష్టర్‌గా ఉన్న గంటా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడం వల్ల అధిష్టానం దానికి ఒప్పుకోలేదనే టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే అవంతి శ్రీనివాస్ వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన విజయసాయి రెడ్డితో రహస్య మంతనాలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. విశాఖ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైసీపీకి.. ఈ వ్యవహారంతో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు అయింది. దీంతో అవంతిని పార్టీలోకి చేర్చుకుని భీమిలి నుంచి పోటీ చేయించాలని నిర్ణయించుకున్నారట వైసీపీ నేతలు. మరి అవంతి అనుకున్నట్లుగానే పార్టీ మారుతారా..? లేక టీడీపీ అధిష్టానం ఆయనను బుజ్జగిస్తుందా..? వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.