
వయసులో చాలా చిన్నోడు.. కానీ పనిలో మాత్రం సీనియర్లతో పోటీ పడతాడు. అనుభవం తక్కువ ఉన్నోడు.. కానీ అందరి చేత శెభాష్ అనిపించుకుంటాడు. ఆ పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఓ దివంగత నేత ముద్దుల కొడుకు.. ఇప్పడు కీలక నేతగా ఎదిగిపోయాడు. పార్టీలో తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్న ఆ యంగ్ లీడర్ ఎవరో తెలుసా..? ఆయనే కింజారపు ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు. ఎంజాయ్ చేయాల్సిన వయసులో ఎంతో మంది బాధ్యతను భుజాలపై మోస్తున్నాడు. తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న రామ్మోహన్‌కు త్వరలో టీడీపీలో కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారట చంద్రబాబు.
టీడీపీలో చంద్రబాబు తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నాయకుల్లో ఎర్రన్నాయుడు ఒకరు. ఆయన పార్టీని తన భుజస్కందాలపై మోసేవారు. ఉత్తరాంధ్రలో టీడీపీ ఏకాఛత్రాధిపత్యం సాగించిందంటే అదీ ఆయన చలవే. అలాంటి నాయకుడు ఉన్నట్లుండి దివికేగితే.. ఆయన వారసుడిగా వచ్చాడు రామ్మోహన్ నాయుడు. బాబాయ్ అచ్చెన్నాయుడు పార్టీలో ఉన్నా కూడా ఆయన చాటున ఉండకుండా.. తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. టీడీపీ మీటింగ్ ఏది జరిగిన దానిని రామ్మోహన్ నాయుడే నడిపిస్తుంటాడు. ఇటీవల జరిగిన మహానాడులో కూడా ఇది నిరూపణ అయింది. అందుకే చంద్రబాబు అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇవన్నీ పక్కన పెడితే.. ఉత్తరాంధ్రలో టీడీపీకి బలమైన నాయకులు ఉన్నారు. కానీ, గత ఎన్నికల సమయానికి, ఇప్పటికి కొంత మార్పు వచ్చిందట. అప్పుడు వైసీపీకి డిపాజిట్లు దక్కని చోట కూడా ఇప్పుడు కొంచెం పుంజుకుదట. అందుకే ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక ఇన్‌ఛార్జిని నియమించాలని భావిస్తున్నారట చంద్రబాబు. దీనికి పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చినా.. రామ్మోహన్ నాయుడి పేరే బలంగా వినిపిస్తోందట. దీంతో చంద్రబాబు అతడికే ఆ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారట. ఈ విషయాన్ని పార్టీలోని సీనియర్ల వద్ద ప్రస్తావించారట. దీనికి అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారట. రామ్మోహన్‌కు బాధ్యతలు అప్పగించడం వరకు ఓకే కానీ తర్వాత జరిగే పరిణామాల సంగతేంటని ఓ నేత చంద్రబాబును ప్రశ్నించారట.
అప్పుడు.. వయసులో చాలా చిన్న వాడు కావడంతో అతడి మాటను సీనియర్లు వింటారా అనే సందేహం కూడా సీఎంకు వచ్చిందట. దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారట. అన్నీ ఆలోచించిన తర్వాత సీఎం ఓ నిర్ణయానికి వచ్చారట. రామ్మోహన్ మాట విన్నా వినకున్నా ఆ బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయిపోయారట చంద్రబాబు. ఎవరైనా తేడాగా అనిపిస్తే వాళ్ల సంగతి నేను చూసుకుంటా అంటూ భరోసా ఇచ్చే అతడిని నియమిద్దాం అని సన్నిహితుల దగ్గర అన్నారట ముఖ్యమంత్రి. మరి చంద్రబాబు ఇచ్చే బాధ్యతను రామ్మోహన్ సక్రమంగా నిర్వర్తించగలడా..? గ్రూపు తగాదాల నుంచి టీడీపీని బయటకు తేగలడా..? తనకంటే ఎంతో పెద్ద వాళ్లను డీల్ చేయగలడా..? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
Be the first to comment