టీడీపీ మేనిఫెస్టో.. సెంటిమెంట్‌పై కొట్టారు

తెలంగాణలో ఎలైగైనా పూర్వ వైభవం సాధించాలని భావిస్తోంది తెలుగుదేశం పార్టీ. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీతో సైతం జతకట్టింది. గతంలో తెలంగాణ ప్రాతంలో బలంగా ఉన్న టీడీపీ.. విభజనానంతరం జరిగిన ఎన్నికల్లో మాత్రం భారతీయ జనతా పార్టీతో కలిసి పని చేసి 15 స్థానాలను దక్కించుకుంది. ఇప్పుడు కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక ఫోషించింది. కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీకి 14 స్థానాలు దక్కినా.. ఒకదానిని కాంగ్రెస్ పార్టీకే వదలేసి 13 స్థానాల్లోనే పోటీకి దిగింది. ఇప్పుడు వారిని గెలిపించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన మేనిఫెస్టో విడుదలయింది.

ఇందులో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం కల్పించారు. అమరవీరుల కుటుంబంలో ఇంటికో ఉద్యోగం, ఇల్లు ఇస్తామని చెప్పారు. దీంతో పాటు అన్ని జిల్లాల్లో పూలే, అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్లు, ప్రొఫెసర్ జయశంకర్‌ పేరుతో విద్యాసంస్థల ఏర్పాటు, ప్రగతి భవన్‌ ప్రజా ఆస్పత్రిగా మార్పు చేయడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి ఏడాది లక్ష ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 3వేల భృతి ఇవ్వడంతో పాటు ప్రతి ఏటా ఉద్యోగ కాలెండర్‌ విడుదల వంటి అంశాలు తెలంగాణ ఓటర్లను ప్రభావితం చేసేవిగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీ ఆలోచించని విధంగా ఇందులో కొన్ని అంశాలు పొందపరిచారనే టాక్ వినిపిస్తోంది.

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
– అమరవీరుల కుటుంబంలో ఇంటికో ఉద్యోగం, ఇల్లు
– అన్ని జిల్లాల్లో పూలే, అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్లు
– ప్రొ. జయశంకర్‌ పేరుతో విద్యాసంస్థలు ఏర్పాటు
– విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి
– ప్రగతి భవన్‌ ప్రజా ఆస్పత్రిగా మార్పు
– రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, కౌలు రైతులకూ వర్తింపు
– కుటుంబంలో ఒక్కో సభ్యుడికి 7 కేజీల చొప్పున రేషన్‌ బియ్యం
– ప్రతి ఏటా ఉద్యోగ కాలెండర్‌ విడుదల
– తొలి ఏడాది లక్ష ఉద్యోగాల భర్తీ
– నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 3వేల భృతి
– లోకాయుక్త పరిధిలోకి ప్రజాప్రతినిధులు
– ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్‌
– బీసీలకు సబ్‌ప్లాన్‌
– ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు
– బెల్ట్‌షాపులు రద్దు
– బడ్జెట్‌లో విద్యారంగానికి రూ. 5వేల కోట్లు
– హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ ఏర్పాటు
– ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు
– ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల సంక్షేమానికి చర్యలు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.