టీడీపీలో ఇనుమడించిన ఉత్సాహం

టీడీపీ మహానాడు కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. 2019ఎన్నికలకు సిద్దంగా ఉండాలనే సంకేతాలిచ్చింది. విజయవాడలో నాలుగోసారి జరిగిన మహానాడు తీపి గుర్తును మిగిల్చింది. పలు సమస్యలపై సుదీర్ఘంగానే చర్చ జరిగింది. అదే సమయంలో విపక్ష పార్టీల పై మాటల దాడి చేసింది. పార్టీ స్టాండ్ ఏంటో కార్యకర్తలకు తెలిసేలా చేశారు చంద్రబాబు. సుదీర్ఘ ప్రసంగాలతో మూడు రోజుల మహానాడు వైభవంగా ముగియడం విశేషం. ఊహించని విధంగా క్యాడర్ ఈ సభలకు తరలి వచ్చింది. ఎన్నికల ముందు కావడమే ఇందుకు కారణం. అందులోను అధికార పార్టీ కావడంతో ఏర్పాట్లు ఘనంగానే జరిగాయి. పనిలో పనిగా చాలా మంది బెజవాడ కనకదురమ్మను దర్శించుకునేందుకు క్యూ కట్టడంతో కిటకిటలాడింది కొండ. 
చంద్రబాబు, లోకేష్ లను పొగిడేందుకే వక్తలు పోటీ పడినా అంతిమంగా తాము ఏం చేయదల్చుకుంది చెప్పారు. ప్రపంచంలో  చంద్రబాబు అంతటి గొప్ప వ్యక్తి లేరని చెప్పారు చాలా మంది నేతలు. జగన్, పవన్ కల్యాణ్, బీజేపీలోని మోడీ, అమిత్ షాల పైనే ఎక్కువగా టీడీపీ నేతలు గురి పెట్టారు. మిగతా అంశాల జోలికి పెద్దగా వెళ్లలేదు. తాము ఏం చేసింది బాగా వివరించారు. ఇక ఏం చేయబోతుందని తెలిపారు. ఫలితంగా తమ పార్టీ తీరు…అందరికీ అర్థమయ్యేలా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక  లోకేష్‌ కాబోయే సిఎం అనే సంకేతాలిచ్చారు జేసీ దివాకర్ రెడ్డి లాంటి నేత. ఇలాంటి వీరుడు మరొకరని చూడలేమనే రీతిలో నాయకులు పొగడ్తల వర్షం కురిపించారు. 
ఎంత సేపు మహనాడు జరిగిందంటే…
మూడు రోజుల్లో 37 గంటలపాటు సాగింది మహానాడు. ఇందులో 8 గంటల పాటు చంద్రబాబే మాట్లాడారు. మొత్తం 106 మంది నాయకులు సభా వేదిక పై నుంచి మాట్లాడారు. అది పార్టీ క్యాడర్ ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఎన్నికలకు ముందు పార్టీ రాజకీయ వైఖరిని స్పష్టంగా చెప్పింది మహానాడు. నాలుగేళ్ల పాటు కేంద్రంలో అధికారాన్ని పంచుకుని ఎందుకు బయట పడాల్సి వచ్చిందో వివరించారు చంద్రబాబు. కాకపోతే పనిలో పనిగా తానే సీనియర్ నాయకుడని గొప్పలు పోయారు. దేశంలో చంద్రబాబు కంటే సీనియర్ నేతలున్నారు. అసలు టీడీపీలోనే చంద్రబాబు జూనియర్. ఆయన కంటే సీనియర్లు చాలా మంది టీడీపీలో ఉన్నారు. ఆసంగతి తెలియకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. కేఈ కృష్ణమూర్తి ఆయన కంటే సీనియర్. పార్టీ నుంచి సస్పెండ్ అయిన మోత్కుపల్లి బాబు కంటే సీనియర్. కాంగ్రెస్ లో ఓడిపోయి… టీడీపీలోకి వచ్చారు చంద్రబాబు. కాబట్టి తాను సీనియర్ అని చెప్పేముందు చంద్రబాబు పునరాలోచన చేయాలంటున్నారు విశ్లేషకులు. 
ప్రత్యేక హోదా పై మాటలు మార్చిన చంద్రబాబు ఇప్పుడు అదే హోదా పై ఉద్యమానికి సిద్దం కావాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. ఎన్నికలకు సిద్దం కావాలని ఆదేశించారు. అదే సమయంలో మిగతా పార్టీలతో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. అప్రమత్తతను తెలిపారు. మహానాడు అంతా కేంద్రం, ప్రధాని మోదీ, అమిత్‌షా చుట్టూనే తిరిగింది. మోదీపై వ్యతిరేకత పెంచడం టీడీపీ లక్ష్యం అన్నట్లుగా సాగింది. పార్టీ యంత్రాంగమంతా అదే పనిలో ఉండాలని చంద్రబాబు కార్యకర్తలకు సూచించారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కొనసాగుతుందనే ప్రచారం చేయాలని సూచనలు చేయడం చర్చనీయాంశమైంది. మహానాడు ఏమోగానీ..అక్కడకు వచ్చిన కార్యకర్తలకు పెట్టిన భోజనం అద్భుతంగా ఉందని కితాబు వచ్చింది. అంత బాగా వారు ఏర్పాట్లు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.