ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు టీడీపీ నేతల విముఖత?

ఏపీలో మ‌రోసారి టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తెర‌తీసినట్లు తెలుస్తోంది! ఫలితంగా అధికార టీడీపీలో మ‌రోసారి చేరికల ప‌ర్వం ఉంటుంద‌నే వార్తలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే, వైకాపా నుంచి కొంత‌మంది వ‌చ్చి చేరిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇప్పుడు టీడీపీ దృష్టి కొంతమంది కాంగ్రెస్ నేత‌ల‌పై ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల ఓట‌మి త‌రువాత, పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా, త‌ట‌స్థంగా ఉంటున్న నేతలపై టీడీపీ కూడా దృష్టి సారించిన‌ట్టు సమాచారం! ఇదే క్ర‌మంలో మరో ఇద్ద‌రు నేత‌లు టీడీపీ అధినాయ‌క‌త్వంతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. సీఎం చంద్ర‌బాబు నాయుడుతో ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర న‌ర్సింహారెడ్డి భేటీ అయ్యారని తెలుస్తోంది. పార్టీలో చేరిక అంశంపైనే ఈ భేటీలో ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు అంటున్నారు. దాదాపు గంట సేపు జ‌రిగిన ఈ సమావేశంలో క‌నిగిరి టిక్కెట్ పై స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వాలంటూ న‌ర్సింహారెడ్డి కోరిన‌ట్టు తెలుస్తోంది. అయితే, ఈయ‌న చేరిక అంశ‌మై సిట్టింగ్ ఎమ్మెల్యే క‌దిరి బాబూరావుతో కూడా ఓసారి చ‌ర్చించాక చంద్ర‌బాబు తుది నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి కోండ్రు ముర‌ళీ కూడా టీడీపీలో చేరేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేస్తున్నారట. ఇందుకోసం ఆయన టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిమిడి క‌ళా వెంక‌ట్రావుతో ఇప్ప‌టికే భేటీ అయ్యార‌ని అంటున్నారు! శ్రీకాకుళం జిల్లా రాజాం టిక్కెట్ ఆయ‌న కోరుతున్నారని తెలుస్తోంది‌. దీనిపై స్ప‌ష్ట‌మైన హామీ ల‌భిస్తే, ఆయ‌న చేరిక వెంటనే జరగవచ్చంటున్నారు.
అయితే, రాజాంలో పార్టీ ఇన్ ఛార్జ్ గా ఉన్న ప్ర‌తిభా భార‌తి ఈయ‌న రాక‌ను వ్య‌తిరేకిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఆమెతో కూడా పార్టీ అధినాయ‌క‌త్వం సంప్ర‌దింపులు చేస్తోందని స‌మాచారం. వీరేకాకుండా ఉత్తరాంధ్రకు చెందిన స‌బ్బం హ‌రి, దాడి వీర‌భ‌ద్ర‌రావులు కూడా టీడీపీలోకి వ‌స్తార‌నే ఊహాగానాలు వస్తున్నాయి. కాగా ఇప్ప‌టికే టీడీపీలో వ‌ల‌స నేత‌లు చాలామందే ఉన్నప్పటికీ, కాంగ్రెస్ నేత‌ల‌పై ఇప్పుడు ఫోక‌స్ ఎందుకనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో ఏర్పడిందట. దీనికితోడు పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న నియోజ‌క వ‌ర్గాల్లో టీడీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నీ, ఆయా నియోజ‌క వ‌ర్గాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నేత‌ల్ని చేర్చుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌నే అభిప్రాయ‌ం వెల్లడవుతోంది. అయితే, వ‌ల‌స‌లతో స్థానిక కేడ‌ర్ లో వివాదాలు వ స్తాయన్న వాదన కూడా ఉంది! ఎన్నికల్లో గెలుపే ల‌క్ష్యంగా ఇత‌ర పార్టీల నేత‌ల్ని చేర్చుకుంటున్నామ‌ని రాష్ట్రస్థాయి నాయ‌క‌త్వం బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేసినా, ఆ పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతుందంటున్నారు. అయితే ఎన్నిక‌లు సమీపించే స‌మ‌యానికి దాన్ని టీడీపీ ఎలా ఎదుర్కుంటుదనేది చూడాల్సివుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.