బండారు సీటుపై ప‌లువురు నేత‌ల క‌ర్చీఫ్‌!

విశాఖప‌ట్నం జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి సొంత‌ పార్టీనుంచే ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అదే పార్టీలో ఉన్న వారే అత‌నికి పొగ పెడుతున్నారట. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాకుండా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది.. 2014లో గెలిచిన‌ప్ప‌టికీ బండారుకు మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయ‌న నిరాశ చెంది పార్టీ  హైకమాండ్ మీద  అలిగార‌నే వార్త‌లు వినిపించాయి. ఈ నేప‌ధ్యంలోనే బండారు ఆమ‌ధ్య చంద్ర‌బాబు విశాఖ వచ్చినా ఆయ‌న‌ను క‌ల‌వ‌నేలేద‌ట‌. ఇప్పుడు అటువంటి ఉదంతాల‌న్నీ తవ్వి, వెలికితీసీ బండారుకు చెక్ పెట్టాల‌నీ సొంత పార్టీ నేత‌లే ఎత్తుగ‌డ వేస్తున్నార‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. విశాఖ రూరల్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న పంచకర్ల రమేష్ ఈసారి పెందుర్తి నుంచి పోటీకి సిద్ద‌మ‌వుతున్నారు. ఆయన కాపు సామాజికవర్గానికి చెందిన‌వారు. ఈ ప్రాంతంలో కాపువ‌ర్గం వారు ఎక్కువగా ఉండడం ప్ల‌స్ పాయింట్‌గా భావిస్తున్నారు. దీనికితోడు ర‌మేష్‌కు.. చంద్ర‌బాబు వద్ధ  పలుకుబడి ఉండడం, కాపు కార్డ్ కూడా ప్లస్ పాయింట్ అవుతుందని విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రోవైపు గ‌త ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి, ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తరువాత టీడీపీలో చేరిపోయారు. ఆయన కూడా పెందుర్తి టికెట్ పై క‌న్నేశారు.. తన అర్ధ బలం, అంగ బలం చూపించి టికెట్ ద‌క్కించుకోవాల‌నుకుంటున్నారు. వీరితోపాటు మరో ముగ్గురు నేత‌లు కూడా  పెందుర్తి కుర్చీపై క‌ర్చీఫ్ వేశార‌ని తెలుస్తోంది. ఎవ‌రికివారు త‌మ‌దే టిక్కెట్ అనే ధీమాలో ఉన్నారు. అయితే త‌న పోటీ అభ్య‌ర్థుల వ్యూహాల‌కు చెక్ పెట్టేలా బండారు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని తెలుస్తోంది. తనకు టిక్కెట్ ఇవ్వ‌క‌పోతే త‌న‌ తనయుడు అప్పలనాయుడుకైనా టికెట్ ఇవ్వాలంటూ ఆయ‌న టీడీపీ ముందు కొత్త ప్రతిపాదన ఉంచారు. మ‌రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పెందుర్తి టిక్కెట్ ఎవ‌రికి కేటాయిస్తారో వేచి చూడాల్సిందే!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.