అధిష్ఠానానికి వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత

తెలంగాణలో ముందస్తు ఎన్నిక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఒకపక్క టీఆర్ఎస్.. మరోపక్క మహాకూటమి వేస్తున్న ప్లాన్లు ఈ ఎన్నికలపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీఆర్ఎస్‌ను గద్దెనెక్కకుండా చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కూటమి ఏర్పడి చాలా కాలమే అయినా సీట్ల పంపకాలపై ఇంకా గందరగోళమే నడుస్తోంది. ఏ స్థానం ఎవరికి దక్కుతుందో తేలకపోవడం, కుదిరిన పొత్తులంటూ లీక్‌లు వస్తుండడంతో మిత్రపక్షాల్లో లుకలుకలు మొదలవుతున్నాయి. మహాకూటమి తరుఫున పోటీ చేసేందుకు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌, టీడీపీ నుంచి అనేకమంది పోటీ పడుతున్నారు. కొన్ని స్థానాలను తమకంటే తమకు కేటాయించాలని ఆ రెండు పార్టీల నేతలు అధిష్ఠానాలను కోరుతున్నారు. అయితే, సీట్లు కోరడం విషయంలో టీడీపీ అవలంభిస్తున్న వైఖరి కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనిపై ఆ పార్టీకి చెందిన నేత అధిష్ఠానికి వార్నింగ్ ఇచ్చాడట.

టీడీపీ సీనియర్ నేత కూన వెంకటేష్ గౌడ్ టికెట్ కేటాయింపు విషయంలో అధిష్ఠానం పట్ల అసంతృప్తితో ఉన్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఆయన సనత్‌నగర్‌ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే, అక్కడి నుంచి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు టికెట్‌ ఇచ్చి, కూనను సికింద్రాబాద్‌కు పంపింది టీడీపీ అధిష్ఠానం. ఏ మాత్రం పరిచయం లేని సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసి ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి టి. పద్మారావు చేతిలో ఓడిపోయారు. తర్వాత తలసాని టీఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో, కూన మళ్లీ సనత్‌నగర్‌ను తన కార్యక్షేత్రంగా మార్చుకొని పని చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేస్తూ, కేడర్‌కు అండగా ఉన్నారు. ఇలాంటి సమయంలో టికెట్ తనకు దక్కుతుందా లేదా అనే ఆందోళనలో ఉన్నారు. ఒకవేళ ఈ సారి పొత్తులో భాగంగా సనత్‌నగర్‌ను టీడీపీ దక్కించుకోకపోయినా.. దక్కినా తనకు టికెట్ ఇవ్వకపోయినా ఊరుకునే ప్రసక్తే లేదని చెబుతున్నారట. ఈ మేరకు ఆయన టీటీడీపీ నేతలకు హెచ్చరిక కూడా చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.