తెరపైకి టీడీపీ నేత పేరు.. కాంగ్రెస్‌ నేతల్లో కలవరం

మహాకూటమిలో సీట్ల సర్ధుబాటు ఆయా పార్టీల నేతలను టెన్షన్‌కు గురి చేస్తోంది. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌కు సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక కొత్త తలనొప్పిని తీసుకొస్తున్నాయి. సీట్ల కేటాయింపులో ఆ పార్టీ ఓ అంచనాకు వచ్చేసినా.. దానిని తెలంగాణ జనసమితి, సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడిపోతున్నందున ఈ వ్యవహారాన్ని త్వరగా ముగించాలనుకుంటున్న కాంగ్రెస్‌కు ఆ రెండు పార్టీలు అడ్డుగా మారుతున్నాయి. ఆ పార్టీలు అడిగే సీట్లకు, కాంగ్రెస్ కేటాయించాలనుకునే వాటికి అసలు పొంతనే ఉండడంలేదు. ఈ తీరుపై టీజేఎస్, సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇదే భారంగా మారిన కాంగ్రెస్‌కు.. అభ్యర్థుల ఎంపిక ఇంకా సంక్లిష్టంగా తయారైంది. ఇప్పటికే దాదాపు మెజారిటీ స్థానాల్లో పోటీ చేసే వారిని ఫైనల్ చేసిన ఆ పార్టీ అధిష్ఠానం.. మరికొన్ని క్లిష్టమైన ప్రాంతాల్లో గెలుపు గుర్రాల కోసం అన్వేషణ జరుపుతోంది. అయితే, టీపీసీసీ చీఫ్ మాత్రం అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారు అయిపోయిందని, ఈ జాబితాను శుక్రవారం ప్రకటిస్తామని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వార్త కలకలం రేపుతోంది.

మహాకూటమి పొత్తులో భాగంగా వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం టీడీపీకి దక్కనుందనేదే ఆ వార్త సారాంశం. ఇక్కడి నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి బరిలో ఉంటారనే ప్రచారం జరగడంతో కాంగ్రెస్‌ శిబిరంలో కలవరం మొదలైందని తెలుస్తోంది. పశ్చిమ నియోజకవర్గం నుంచి వరంగల్‌ ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో కాంగ్రెస్‌ వర్గీయుల్లో అసంతృప్తులు రగులుకుంటున్నాయట. ఎంతో కాలంగా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, అలాగే నియోజకవర్గంలో తిరుగుతున్నామని, ఇలాంటి సమయంలో సీటు వేరే పార్టీకి ఇవ్వడమేంటని వారు ప్రశ్నిస్తున్నారట. మరోవైపు వరంగల్‌ తూర్పు నియోజకవర్గం తెలంగాణ జన సమితికి దక్కిందని, అభ్యర్థిగా ఇన్నయ్య నిలువనున్నట్లు ఆ పార్టీ సంకేతాలు ఇచ్చింది. ఈ అంశం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. అర్బన్‌ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో రెండూ కూడా పొత్తులో కేటాయిస్తే ఇక తామెందుకనే ఆవేదన, అలజడి కాంగ్రెస్‌ వర్గాల్లో చోటు చేసుకుంటోందనే టాక్ వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.