బీజేపీ పై ఎదురు దాడి వ్యూహంలో టీడీపీ

ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరుగుతుందని అంతా చెబుతున్నారు. ఒక్క బీజేపీ తప్ప. మనసులో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తుందని తెలిసినా.. బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది బీజేపీ. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై తొలిసారిగా విరుచుకుపడ్డారు. గతంలో ఏనాడు చంద్రబాబుపై ఈగ వాలనీయలేదు ఆయన. కానీ ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. నియోజకవర్గాల సంఖ్య పెంచకపోవడంతోనే కేంద్రంపై చంద్రబాబు వైఖరి మారిందని ఆయన అంటున్నారు. ఎప్పటిలానే సోము వీర్రాజు, విష్ణు కుమార్ రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి వంటి వారు విరుచుకుపడటం కొత్తేం కాదు. మొత్తంగా బీజేపీ ఇప్పుడు టీడీపీ పై మాటల దాడి చేస్తోంది. బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులు బాగానే చేస్తున్నా.. ఏం చేయడం లేదని చెబుతుందంటూ దాడి చేశారు. 
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ ఇవ్వకపోవడంతోనే అమరావతికి నిధులు ఇవ్వలేదని హరిబాబు చెప్పిన మాట. వచ్చే ఎన్నికల్లో తాము 175 స్థానాల్లో పోటీచేస్తామని తెలిపారు. టీడీపీ అవినీతిపై పోరాటం చేస్తామని హరిబాబు అనడం హాట్ టాపికైంది. సౌమ్యంగా ఉండే హరిబాబు ఇంతగా దాడి చేస్తున్నారంటే హైకమాండ్ కు ఎంతగా కోపం వచ్చిందో అర్థమవుతుందంటున్నారు. 
టీడీపీది అదే వ్యూహం…
రాష్ట్ర విభజనతో అన్ని రకాలుగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. అందుకే ఆదుకోవాలని టీడీపీ కోరుతోంది. అధికార పార్టీలో భాగస్వామ్యమైనా పార్లమెంటులో తమ నిరసన కొనసాగించింది. బీజేపీ మద్దతుతోనే ఏపీ విభజన జరిగిందన్న సంగతి టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. టీడీపీ నేతలు కళా వెంకట్రావు, గల్లా జయదేవ్, కింజారపు రామ్మోహన్నాయుడులు సి.ఎం చంద్రబాబుతో బేటీ అయ్యారు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఏపీకి ఇచ్చిన నిధులు, బీజేపీ నేతలు చెబుతున్న మాటలు, వాస్తవం ఏంటో తేల్చి చెప్పాలని కోరారు. జాతీయ రహదారుల అభివృద్ధికి మేము 10 వేల కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతోంది. కానీ ఇచ్చింది 5 వేల కోట్లు అని మరోవైపు కళా వెంకట్రావు లాంటి నేతలు ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు టీమ్ దూకుడుగానే బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాలతో ఏపీని పోల్చి చూడాలనే డిమాండ్ ను బీజేపీ ముందు ఉంచనుంది టీడీపీ. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తే సహించబోమని, రాష్ట్ర విభజనతో చాలా ఆస్తులు కోల్పోయామని మండి పడుతోంది టీడీపీ. 
ఏపీ తలసరి ఆదాయం చాలా తక్కువని, రాష్ట్రాన్ని అసంబద్ధంగా విడగొట్టారని ప్రజలకు చెప్పనుంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది బీజేపీ. ఆ హామీని ఎందుకు విస్మరించారని జయదేవ్ లాంటి యువ ఎంపీలు ప్రశ్నించారు. ఏపీ పరిస్థితి చక్కబడే వరకు కేంద్రం సాయం చేయాలని వారు డిమాండ్ చేయనున్నారు. పన్నుల్లో మినహాయింపు, ఇన్సెంటివ్స్‌ ఇస్తామని చెప్పినా కేంద్రం ఆ పని చేయలేదు. దేశంలోని అన్ని పార్టీలు ఏపీకి మద్దతిస్తున్నాయని ఒక్క బీజేపీ తప్ప. తెలంగాణ నేతలు సైతం ఏపీకి న్యాయం చేయాలని చెబుతున్నారంటే ఎంతగా సానుభూతి ఉందో అర్థమవుతోంది. విభజన హామీలను నెరవేర్చవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కానీ ఆ పని చేయక పోవడంతో బీజేపీ పై విరుచుకు పడేలా చంద్రబాబు వ్యూహం ఉండనుంది. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.