తుని… టీడీపీకి బంగారు గని…. కానీ నేడు?

ఆంధ్రప్రదేశ్‌లోని తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పేరొందింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వరుసగా ఆరు సార్లు పార్టీ అభ్యర్థే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు తెలుగుదేశం కష్టాలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది ఆరు సార్లు గెలిచిన చోట మరోమారు గెలుపుపై సందేహాలు నెలకొంటున్నాయట. పార్టీ సీనియర్‌ నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ సంస్థాగతంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నదనే విమర్శలు వస్తున్నాయి. పార్టీని అభిమానించే కార్యకర్తలు, నాయకులు ఉన్నా, నియోజకవర్గంలో వారిని సమన్వయపరిచేవారు లేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రత్యర్థులే బలపడుతున్నారని నియోజకవర్గంలోని నేతలు వాపోతున్నారట. తూర్పుగోదావరి జిల్లాలోని ‘తుని’ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ సీనియర్‌ నేత ‘యనమల రామకృష్ణుడు’ ఆరుసార్లు వరుసగా విజయం సాధించి రికార్డు సాధించారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న ఆయన 1983, 1985, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో గెలిచి డబుల్‌హ్యాట్రిక్‌ దక్కించుకున్నారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గాల్లో పలు కీలకశాఖలకు మంత్రిగా పనిచేసి వారి మన్ననలను అందుకున్నారు. యనమల కొన్నాళ్లు స్పీకర్‌గా కూడా పనిచేశారు. అటువంటి సీనియర్‌ నాయకుడున్న నియోజకవర్గంలో ప్రస్తుతం టిడిపి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
2009 ఎన్నికల్లో ‘యనమల’ ఓడిపోవడంతో పార్టీ కొంతమేర ఇక్కడ పట్టుకోల్పోయింది. దాంతో 2014 ఎన్నికల్లో ‘యనమల’ తమ్ముడు ‘కృష్ణుడు’ టిడిపి అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ‘తమ్ముడ్ని’ పోటీకి పెట్టి ‘యనమల’ దూరంగా ఉన్నా, టిడిపికి ఎదురుగాలే వీచింది. జిల్లా మొత్తంలో టిడిపి గాలి వీచినా ఇక్కడ మాత్రం పార్టీకి ఎదురుదెబ్బ తగలడం విశేషం. అయితే ఇక్కడ పార్టీ ఓడిపోయినా రాష్ట్రంలో పార్టీ గెలవడంతో ‘యనమల’ మళ్లీ ‘చంద్రబాబు’ క్యాబినెట్‌లో కీలకమైన ‘ఆర్థిక మంత్రి’ పదవిని దక్కించుకున్నారు. నాలుగున్నరేళ్ల నుంచి ఆయన మంత్రిగా కొనసాగుతున్నా నియోజకవర్గంపై పట్టుసాధించలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడ పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్నకు కార్యకర్తలు, నాయకుల నుంచి సంతృప్తికరమైన సమాధానం రావడం లేదని భోగట్టా. పైగా నియోజకవర్గంలో ‘యనమల’ కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ అమలు అవుతున్నా, చెప్పుకోదగిన స్థాయిలో అభివృద్ధి లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జి ‘కృష్ణుడు’పై స్థానికంగా వ్యతరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థిని మార్చాలని నాయకులు, కార్యకర్తలు చంద్రబాబును కోరుతున్నారని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.