టీడీపీ సంచలన నిర్ణయం.. పోటీ నుంచి ఆ పార్టీ అభ్యర్థి ఔట్

మహాకూటమి పొత్తుల్లో భాగంగా 13 స్థానాల్లోనే పోటీ చేసి, ఒక స్థానాన్ని వదులుకున్న టీడీపీ.. మరో స్థానాన్ని కూడా త్యాగం చేసేందుకు సిద్ధమైందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొదటి నుంచీ కూటమి ధర్మాన్ని పాటిస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ.. అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీట్ల కేటాయింపు సమయంలోనూ కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకురాలేదు. అలాగే కచ్చితంగా పలానా స్థానామే కేటాయించాలని కూడా ఇబ్బంది పెట్టలేదు. అంతేకాదు, తమకు ఇస్తామన్న 14 స్థానాల్లో ఒకదానిని కాంగ్రెస్ పార్టీకే వదిలేసింది కూడా. ఇప్పుడు అదే పార్టీ ఉన్న 13 స్థానాల్లో ఒకదానిని వదులుకోవాలని నిర్ణయించుకుందట. ఇప్పుడీ వార్త మహాకూటమిలో హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించిన వాటిలో ఒకటైన ఇబ్రహీంపట్నం స్థానాన్నే టీడీపీ వదులుకోబోతుందని సమాచారం. అక్కడ టీడీపీ అభ్యర్థిగా సామా రంగారెడ్డి పేరును ప్రకటించింది ఆ పార్టీ అధిష్ఠానం. అయితే, ఆయన ముందు నుంచీ ఎల్బీ నగర్‌ నుంచి పోటీ చేయాలని అనుకోవడంతో పాటు, ఇబ్రహీంపట్నంలో రెబెల్స్ బెడద అధికంగా ఉన్న కారణంగా సామా రంగారెడ్డి తప్పుకోవాలని భావిస్తున్నారని తెలిసింది.

ఈయన స్థానంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండి, ఆ పార్టీ టికెట్ రాకపోవడంతో ఎన్సీపీ నుంచి నామినేషన్ వేసిన రామిరెడ్డిని మహాకూటమి అభ్యర్థిగా ప్రకటించాలని కాంగ్రెస్, టీడీపీ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రామిరెడ్డి సోదరుడు మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో బీఎస్పీ తరపున నామినేషన్ వేశారు. అన్నాదమ్ములు ఇలా వేరు పార్టీల నుంచి నామినేషన్ వేయడం చర్చనీయాంశం అయింది. మరి ఇప్పుడు, అన్నను కాదని తమ్ముడు రామిరెడ్డికి టికెట్ కన్ఫార్మ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆలోచనలో కూడా అధిష్ఠానాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, టీడీపీ సిట్టింగ్ స్థానం కావడంతో వీరిని బుజ్జగించి ఆ పార్టీ అభ్యర్థినే కొనసాగించాలని కూడా ఇక్కడ మరోవాదన కూడా వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రామిరెడ్డి ప్రధాన పార్టీలకు టీఆర్ఎస్, టీడీపీలకు బాగా పోటీ ఇచ్చారు. తద్వారా రెండో స్థానంలో నిలిచారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి 48,397 ఓట్లు రాగా, స్వతంత్రుడిగా బరిలో దిగిన రామిరెడ్డికి 37,341 ఓట్లు లభించాయి. దీంతో సామా రంగారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తప్పుకుంటానని అంటే రామిరెడ్డికే టికెట్ కన్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.