పొత్తులపై టీడీపీలో క్లారిటీ?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. హస్తంతో దోస్తీకి సైకిల్ సిద్ధమైందంటూ వార్తలు వస్తున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఒకే వేదికను పంచుకున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీచేస్తాయన్న అభిప్రాయలు వ్యక్తమయ్యాయి. ఐతే తాజాగా పొత్తులపై ఏపీ మంత్రులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే ఉండదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తేల్చిచెప్పారు. అలాగే దీనిపై సీఎం తనను వివరణ కోరారంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని కేఈ కొట్టిపారేశారని తెలుస్తోంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి పొత్తులపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకుంటార చెబుతున్నారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు ప్రచారాలను ఖండించారు. ఎన్నికలకు ఇంకా 8 నెలల సమయం ఉన్నందున. ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడుకోవడం అనవసరమని అందరితో అంటున్నారట. అంతేకాదు మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు ఉండదని స్పష్టం చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చేయి-సైకిల్ ప్రచారానికి ప్రస్తుతానికి ఫుల్‌స్టాప్ పడినట్లే కనిపిస్తోంది. ఇదిలావుండగా మరోవైపు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
ఇరు పార్టీల్లో పలువురు నాయకులు ఈ కలియికపై పెదవి విరుస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా టీడీపీలో ఎన్టీఆర్ తరం నాయకులైతే కాంగ్రెస్‌తో పొత్తు ససేమిరా అంటున్నారట. ఏ పార్టీ పరిపాలనా విధానాలు నచ్చక టీడీపీ ఆవిర్భవించిందో, అదే పార్టీతో ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం తగినది కాదని పెదవి విరుస్తున్నారట. పార్టీ మూల సిద్దాంతాన్ని పక్కన పెట్టాలని చూస్తే ఊరుకోమని టీడీపీ పాతతరం నాయకులు కుండబద్దలుకొట్టి  మరీ చెబుతున్నారట. వాస్తవానికి నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్‌లో కూడా ఒక వర్గం నేతలు టీడీపీతో పొత్తు విషయమై అయిష్టతతో ఉన్నా, పార్టీ  ప్రయోజనాల దృష్ట్యా టీడీపీతో పొత్తు అనివార్యమనే భావనకు వచ్చేశారు. కానీ టీడీపీ పాత తరం నాయకులు మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు అంటే ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్‌లో కానీ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఇప్పటికీ కొనసాగుతున్న నాయకులు, కార్యకర్తలు దాదాపు 45 శాతం మంది ఇంకా పార్టీలో ఉన్నారు. వీరు కాంగ్రెస్‌తో పొత్తును కలలో కూడా అంగీకరించలేకపోతున్నారు. ఇంతకాలం ఎవరి విధానాలకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేశామో ఇప్పుడు అదే పార్టీతో కలసి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలు చెయ్యడం అంటే టీడీపీని రాజకీయంగా కోలుకోలేని దెబ్బతియ్యడమే అంటున్నారట. ఫైనల్‌గా చూస్తే టీడీపీ ప్రస్తుతానికి కాంగ్రెస్ తో మంతనాలు జరపబోదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.