దూకుడు పెంచ‌నున్న‌ టీడీపీ….

ప‌రాకాష్ట పోరుకు సిద్ధం
ఏపీ అంశంపై ఇటీవ‌ల సుప్రీంకోర్టుకు కేంద్రం స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ పై బాబు స‌ర్కార్ ఆగ్ర‌హంతో ఉంది. విభ‌జ‌న హామీల‌న‌న్నింటినీ అమ‌లు చేశామంటూ కేంద్రం సుప్రీంకోర్టుకు విన్నవించడంపై ఏపీ ప్ర‌భుత్వం అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతోంది. రాష్ట్ర హ‌క్కులు కాల‌రాసేలా కేంద్రం వ్యవహరిస్తోంద‌ని దుమ్మెత్తిపోస్తోంది. ఈ ఉదంతంతో కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఇప్ప‌టికే విభ‌జ‌న హామీలు, ప్ర‌త్యేక హాదా, రైల్వే జోన్ విష‌యంలో కేంద్రం తీరుపై రాష్ట్ర ప్ర‌భుత్వం గుర్రుగా ఉంది. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం… సుప్రీంకోర్టుకు స‌మర్పించిన అఫిడ‌విట్ మ‌రింత క‌ల‌క‌లం రేపుతోంది. విభ‌జ‌న హామీలపై తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుప్రీంకోర్టులో పిటీష‌న్ వేశారు. దీనికి ప్ర‌తిగా కేంద్ర ఆర్ధిక‌శాఖ గ‌త నెల 29న సుప్రీంకోర్టులో కౌంట‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. ఈ అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు తీవ్ర‌ వివాదానికి దారి తీస్తున్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హాదా ఇచ్చే అవ‌కాశ‌మే లేద‌ని  కేంద్రం తేల్చి చెప్పేసింది. ఈ నేప‌ధ్యంలో కేంద్రం అఫిడ‌విట్ పై సీరియస్ గా రియాక్ట్ అయ్యేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ద‌మైంది. దీనిపై కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక కోసం పలువురు మంత్రులతో చంద్రబాబు చర్చలు జరిపారు. న్యాయనిపుణులతో కూడా చర్చించార‌ని తెలుస్తోంది. కేంద్రం దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ అత్యంత శోచ‌నీయ‌మ‌ని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను కేంద్రం అవ‌మానిస్తోంద‌ని మంత్రి పితాని పేర్కొన్నారు. వైసీపీ, రాష్ట్ర బీజేపీ నాయ‌కులు కూడా అఫిడ‌విట్ పై స్పందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచించారు. రాజ‌ధాని నిర్మాణానికి ఇప్ప‌టివ‌ర‌కూ రెండున్న‌ర వేల కోట్లు ఇచ్చామ‌ని.. ఇంకా వెయ్యి కోట్లు ఇస్తామ‌ని అఫిడ‌విట్ లో పేర్కొంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చింద‌ని, ప‌రిపాల‌న న‌గ‌రానికి రూ.11 వేల కోట్లు అవ‌స‌రమని మంత్రి నారాయ‌ణ తెలిపారు. కాగా  కేంద్రం ఇచ్చిన అఫిడ‌విట్ పై శుక్ర‌వారం కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. దీనిలో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేబినెట్ సమావేశం తర్వాత హోదా పోరు కొత్త రూపం దాల్చే అవకాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.