హోదాను వాళ్లు కూడా వాడేసుకుంటున్నారుగా.!

ఏపీకి ప్రత్యేక హోదా అంశం టీడీపీ చేసిన పోరాటంతో ఇటు రాష్ట్రంలోనే కాకుండా అటు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తమకు అన్యాయం చేశారనే కారణంతో కేంద్ర ప్రభుత్వంతో విభేదించిన టీడీపీ.. పార్లమెంట్‌లో ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం.. దీనిపై చర్చ జరగడం.. అందులో ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలు, అందుకు గల కారణాలను ఆ పార్టీ ఎంపీలు తమ ప్రసంగం ద్వారా వివరించడంతో ప్రత్యేక హోదా అంశం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ప్రస్తుతం ఏపీలో ఉన్న పార్టీలన్నీ ఈ అంశాన్ని అడ్డు పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలతో పాటు జనసేన కూడా దీనినే ఎన్నికల బ్రహ్మాస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నాయి.

ఒక రాష్ట్రానికే పరిమితమైన అంశం కాస్తా, అవిశ్వాసం తర్వాత చాప కింద నీరులా పాకిపోయింది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ కూడా దీనిని వాడుకుని రాజకీయం చేయాలని, తెలుగు రాష్ట్రంలో పాగా వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా, ఇటీవల జరిగిన సీడబ్లూసీ సమావేశంలో తాము అధికారంలోకి వస్తే.. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న పది కీలక అంశాల్లో ఏపీకి ప్రత్యేక హోదాను చేర్చింది. ఇక అప్పటి నుంచి ఏపీలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ అంశాన్ని బాగా వాడుకుంటున్నారు. విభజన తర్వాత ఏపీలో జీవం కోల్పోయిన కాంగ్రెస్.. దీని ద్వారా అయినా కొంచెం ఊపిరిపోసుకోవాలని చూస్తోంది.

తాజాగా, ఇదే అంశం పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా కాక రేపుతోంది. అక్కడి కాంగ్రెస్ నాయకులు రెండు, మూడు రోజులుగా ఏపీ హోదా విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ మద్దతిస్తుందని తెలిపిన టీఆర్ఎస్.. మొన్న జరిగిన అవిశ్వాస చర్చలో ఓటింగ్‌కు దూరంగా ఉండడాన్ని, అలాగే ఏపీకి హోదా ఇస్తే.. తెలంగాణకు కూడా ఇవ్వాలన్న పలువురు టీఆర్ఎస్ ఎంపీల తీరును ఎండగడుతూ కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు, టీఆర్ఎస్ మోదీతో కుట్ర పన్ని ఏపీకి రావల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల తీరును చూసిన తెలంగాణ మంత్రి హరీశ్.. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే టీడీపీకి వేసినట్లే అని వ్యాఖ్యానించారు. దీని ద్వారా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఏమేర ప్రత్యేక హోదా అంశాన్ని వాడుకుంటుందో అర్థమైపోతుందని పలువురు అనుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.