‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ‌లు: జి.ఎ2 పిక్చ‌ర్స్‌, యు.వి.క్రియేషన్స్‌
నటీనటులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప్రియాంక జ‌వాల్క‌ర్‌, మాళ‌వికా నాయ‌ర్‌, మ‌ధునంద‌న్‌, సిజ్జు, ఉత్తేజ్‌, యమున‌, క‌ల్యాణి, ర‌విప్ర‌కాశ్, ర‌వివ‌ర్మ‌ త‌దిత‌రులు
మ్యూజిక్: జేక్స్ బిజాయ్‌
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్‌
ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్‌
స్క్రీన్‌ప్లే, మాట‌లు: సాయికుమార్ రెడ్డి
నిర్మాత‌: ఎస్‌.కె.ఎన్‌
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ సంక్రిత్యాన్‌

హీరోగా చేసింది ఐదు సినిమాలే అయినా యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ వస్తున్నాడు. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత అతడు ‘నోటా’తో పరాజయాన్ని మూటకట్టుకున్నాడు. వాస్తవానికి ఆ సినిమా కంటే ముందే షూటింగ్ పూర్తి చేసుకున్నా.. అనివార్య కారణాల వల్ల ఆలస్యమైన చిత్రమే ‘టాక్సీవాలా’. ఈ సినిమాతో సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో మరో ప్రయోగం చేశాడు. మరి ఇది తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా..? విజయ్ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడా..?

కథ
అందరిలాగే సరదాగా గడిపే కుర్రాడు శివ(విజయ్) నానా కష్టాలు పడి ఐదు సంవత్సరాల తర్వాత డిగ్రీ పూర్తి చేస్తాడు. తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ చేరుకుంటాడు. ఈ క్రమంలో ఎన్ని ప్రయత్నాలు చేసిన ఉద్యోగం మాత్రం దొరకదు. ఇక ఇలా కాదని క్యాబ్ డ్రైవర్ కావాలనుకుంటాడు. అప్పుడు అతడికి ఒకరు సాయం చేయడంతో ఓ సెకెండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటాడు. అదే సమయంలో శివకు హీరోయిన్(ప్రియాంక) పరిచయం అవుతుంది. క్యాబ్ డ్రైవర్‌గా బాగా డబ్బు సంపాదిస్తుంటాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో తాను నడిపే కారులో దెయ్యం ఉందనే విషయం తెలుస్తుంది. సరిగ్గా అప్పుడే కారు ఓ డాక్టర్‌ను చంపేస్తుంది. దీంతో శివ తనకు కారు అమ్మిన వ్యక్తి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ఓ వ్యక్తి కారు తాలూకు వివరాలు చెబుతాడు. ఇంతకీ కారులో నిజంగానే దెయ్యం ఉందా..? చనిపోయిన డాక్టర్‌కు కారుకు మధ్య సంబంధం ఏంటి..? శివకు కారు గురించి చెప్పిన వ్యక్తి ఎవరు..? అసలేం చెప్పాడు..? వంటివి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
ఆస్ట్ర‌ల్ ప్రొజెక్ష‌న్ అంటూ ఆత్మ‌ని శ‌రీరంతో వేరు చేయొచ్చనే విష‌యాన్ని జోడించిన, సైన్స్ ఫిక్ష‌న్ చిత్రమే ‘టాక్సీవాలా’. ఈ తరహా సినిమాలు గతంలో తెలుగు తెరపై చాలానే వచ్చాయి. అయితే, ఇందులో తీసుకున్న కొత్త పాయింట్‌తో పాటు దాన్ని తెరకెక్కించిన విధానం బాగుంది. దీనికి తోడు అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే, లాజిక్ లేని సీన్స్‌తో పాటు, హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అంత బాగా వర్కౌట్ కాలేదు. మొత్తంగా ఈ సినిమా విజయ్ అభిమానులతో పాటు, వైవిధ్యమైన చిత్రాలను ఇష్టపడేవారికి కచ్చితంగా నచ్చుతుంది.

నటీనటుల పనితీరు
యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాలోనూ అలరించాడు. ఓ క్యాబ్ డ్రైవర్‌గా చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఓ ఆర్డినరీ కుర్రాడిగా కొత్త లుక్‌తో కనిపించాడు. సినిమాలో అప్పుడప్పుడూ వచ్చే భయానక సన్నివేశాల్లో తన నటనతో అక్కడక్కడా నవ్విస్తూనే.. ఇటు ఆ హర్రర్ సీన్స్‌లో భయపడుతూ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ జూనియర్ డాక్టర్ అను పాత్రలో చాలా చక్కగా నటించింది. ఇంట్రడక్షన్ సీన్‌తో పాటు హీరోతో వచ్చే కొన్ని సన్నివేశాల్లోనూ తన నటనతోనూ బాగా ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించిన మాళవిక నాయర్‌ కి పెద్దగా స్క్రీన్ ప్రెజన్స్ లేకపోయినా.. తన నటనతో సినిమాలో హైలెట్‌గా నిలుచింది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. మిగిలిన వారిలో మధు, మధు పక్కన అసిస్టెంట్, అలాగే చమ్మక్ చంద్ర తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

టెక్నీషియన్ల పనితీరు
పాత కాన్సెప్టే అయినా కొత్త పాయింట్‌ను జోడించిన డైరెక్టర్.. దాన్ని తెరకెక్కించిన విధానం బాగుంది. లాజిక్‌లు గట్రా బేరీజు వేయకుండా ప్రేక్షకుడు సినిమాలో లీనమయ్యేలా నడిపించాడు. మంచి కామెడీ సీన్స్ యాడ్ చేసి ఆకట్టుకున్నాడు. అయితే, కొన్ని సీన్స్ మాత్రం సినిమాటిక్‌గా అనిపిస్తాయి. సుజిత్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. జేక్స్ బిజోయ్ అందించిన పాటలు బాగున్నాయి. ఆయన అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలోని యస్.కె.ఎన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

బలాలు
* విజయ్ దేవరకొండ
* కథ, కథనం
* కామెడీ సీన్స్

బలహీనతలు
* సెకెండాఫ్ ల్యాగ్
* లాజిక్ లేని సీన్స్

మొత్తంగా: ఈ టాక్సీవాలా రైడ్ థ్రిల్లింగ్ ఉంటుంది

రేటింగ్: 3.25/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.