టీటీడీపీ దారెటు

తెలంగాణలో విపక్ష నేతల పొత్తు రాజకీయంతో సీనియర్ నాయకుల తలరాతలు మారిపోతాయా? కరీంనగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న ఆ ఇద్దరు నేతలు ఈ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీచేస్తారు? ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆ ఇద్దరి దారెటు? వారు ఎన్నికల రంగంలోకి అడుగుపెడితే పరిస్థితి ఎలా ఉండబోతోంది? తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నేతలు వలస పోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బాగా డీలాపడింది. అయినప్పటికీ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు మాత్రం ఇంకా ఆ పార్టీ అస్థిత్వాన్ని కాపాడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల వ్యక్తులుగా కొనసాగుతున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఆ ఇద్దరు నేతల గురించి జిల్లాలో ఆసక్తికర చర్చ మొదలైంది. జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతున్న ఈ ఇద్దరు నేతల్లో ఒకరు ఎల్‌.రమణ. మరొకరు ఇనుగాల పెద్దిరెడ్డి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఎల్‌.రమణ, పెద్దిరెడ్డి ఓ వెలుగు వెలిగిన వారే. ఒకరు పాత కరీంనగర్ జిల్లా పరిధిలోని హుజురాబాద్ నియోజకవర్గంలో, మరొకరు జగిత్యాల నియోజకవర్గంలో శాసనసభ్యులుగా గెలుపొంది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రులుగా చక్రంతిప్పిన వారే. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో పలువురు ముఖ్యనేతలు టీడీపీని వీడి వెళ్లిపోయారు. ఇటీవల రేవంత్‌రెడ్డితో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో కలిశారు. దీనితో జిల్లాలో బలహీనపడిన పార్టీని కాపాడేందుకు ఈ ఇద్దరు నేతలు చేయని ప్రయత్నం లేదు. తమకు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని వీడేది లేదని చెబుతూ కార్యకర్తల్లో ఎప్పటికప్పుడు ఉత్సాహం నింపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీ-టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎల్‌.రమణ నియమితులు కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, టీటీడీ ట్రస్టుబోర్డు సభ్యునిగా పెద్దిరెడ్డి వ్యవహరిస్తున్నారు. పార్టీలో వీరిద్దరూ కీలక పదవులు నిర్వహిస్తున్నా.. మాతృ జిల్లా అయిన పాత కరీంనగర్‌లో టీడీపీ నామమాత్రంగా మిగిలిపోయింది. సహచరులు అందరూ పార్టీని వదిలినా వీరు మాత్రం అలాగే ఉంటున్నారు. ఇటీవలె జిల్లా కమిటీలను పునరుద్ధరించి టీడీపీ కార్యకలాపాలకి కొంత ఊపు తెచ్చారు కూడా!రాష్ట్ర అసెంబ్లీని కేసీఆర్‌ రద్దుచేశాక ముందస్తు ఎన్నికల వేడి పెరిగింది. త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించారు ఆ పార్టీ నేతలు. అంతేకాదు- ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎల్‌.రమణ, పెద్దిరెడ్డి ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీల పొత్తులో భాగంగా కోరుట్ల నియోజకవర్గం నుంచి ఎల్‌.రమణ, హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి బరిలోకి దిగే అవకాశముంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. ఈ ఇద్దరు టీ-టీడీపీ సీనియర్లు కాంగ్రెస్ మద్ధతుతో టీఆర్ఎస్ అభ్యర్థులకు ధీటైన పోటీ ఇస్తారనీ, ఆ రెండు చోట్ల గెలుపుకోసం అధికారపార్టీ సర్వశక్తులు ఒడ్డాల్సి వస్తుందనీ అనుకుంటున్నారు. ఎల్‌.రమణ సొంత నియోజకవర్గం జగిత్యాల. అయినా జగిత్యాలలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎల్పీ ఉపనేతగా కూడా ఉన్నారు. మళ్లీ ఎన్నికలు జరిగినా జీవన్‌రెడ్డి తప్పక గెలుపొందుతారని కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి జీవన్‌రెడ్డి ఆరుసార్లు అసెంబ్లీకి పోటీచేసి గెలిచిన వ్యక్తిగా తిరుగులేని రికార్డు సంపాదించుకున్నారు. ఆయనకు ఈ స్థానం పక్కా కావడంతో ఎల్‌.రమణ బరిలోకి దిగాలంటే పక్క నియోజకవర్గమైన కోరుట్లను ఎంచుకోవాల్సి వస్తుంది. కోరుట్ల నియోజకవర్గంలో కూడా రమణ సామాజికవర్గం బలంగా ఉంది. వారితో ఆయనకు విస్తృత పరిచయాలు కూడా ఉన్నాయి. జగిత్యాల నియోజకవర్గం నుంచి 1994లో రమణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1995లో కరీంనగర్ ఎంపీగా పోటీచేసి పార్లమెంట్‌కు వెళ్లారు. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. కోరుట్లలో టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు పోటీలో ఉన్నారు. 2009 ఎన్నికల్లో, 2010 ఉపఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి శాసనసభ్యుడిగా ఆయన గెలుపొందారు. విద్యాసాగర్‌రావుపై పోటీచేసేందుకు ఎల్‌.రమణ అయితేనే ధీటైన అభ్యర్థి అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
హుజురాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్ తిరుగులేని శక్తిగా ఉన్నారు. కమలాపూర్ నుంచి, ఆ తర్వాత హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు ఆయన శాసనసభ్యుడిగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థికశాఖ మంత్రిగా వ్యవహరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం వేలకోట్ల రూపాయలు విడుదలచేశారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఈటల గెలుపు నల్లేరుపై బండి నడకేనని అందరూ అనుకుంటున్న తరుణంలోనే ఇనుగాల పెద్దిరెడ్డి ఇక్కడినుంచి పోటీచేస్తారని ప్రచారం మొదలుకావడం గమనార్హం!ఇనుగాల పెద్దిరెడ్డి ఈ నియోజకవర్గం నుంచి 1994, 1999 ఎన్నికల్లో గెలుపొంది చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. హుస్నాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అనంతరకాలంలో టీడీపీ గూటికి వచ్చేశారు. ఇప్పుడు మళ్లీ హుజురాబాద్ నుంచి పోటీకి సిద్ధమౌతున్నారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీచేస్తారని టాక్‌ వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి ఈ స్థానం కోసం టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీప బంధువు పాడి కౌశిక్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, పరిపాటి రవీందర్‌రెడ్డి, ప్యాట రమేశ్ పోటీపడుతున్నారు. అయితే వీరెవరు ఈటల రాజేందర్‌కు సమఉజ్జీ కారనే అభిప్రాయం పరిశీలకుల్లో ఉంది. పెద్దిరెడ్డి అయితేనే ఈటలకు గట్టి పోటీ ఇవ్వగలరన్న మాట వినిపిస్తోంది. టీడీపీ బలాబలాల సంగతి ఎలా ఉన్నా ఈ ఇద్దరు నేతలు మాత్రం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. చూద్దాం ఈ ప్రచారం ఏ మేరకు నిజమవుతుందో! ఇదిలా ఉంటే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కూకట్‌పల్లి నియోజకవర్గం అయితే బెటర్‌గా ఉంటుందని పెద్దిరెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశంపార్టీకి బలమైన క్యాడర్‌ ఉంది. పైగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీనే విజయం సాధించింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టకున్న పెద్దిరెడ్డి కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారట! మరోవైపు రమణ కూడా జగిత్యాల బరిలో దిగాలా వద్దా అన్నది తేల్చుకోలేకపోతున్నారట! మహకూటమి ఏర్పాటయ్యాక… సీట్ల సర్దుబాటు జరిగిన తర్వాత కానీ ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది తేలదు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.