టి కాంగ్రెస్‌ను ధ‌డ‌పుట్టిస్తున్న సోష‌ల్‌మీడియా…

టీ- కాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతోంది? కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న అభ్యర్థుల జాబితాల వెనుక ఎవ‌రున్నారు? ఇదంతా అధికార టీఆర్ఎస్ కుట్రేన‌ని కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌లు నిజ‌మేనా? మొద‌టి లిస్టుకు కౌంట‌ర్‌గా రెండో లిస్టుకు రావ‌డానికి కార‌ణం ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అభ్యర్థుల విష‌యంలో ఎలాంటి ప్రచారం సాగుతోంది? టీ- కాంగ్రెస్ అభ్యర్థులు వీరే అంటూ కొంద‌రి పేర్లతో కూడిన జాబితాలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తొలుత 60 స్థానాల‌కు గాను 66 మంది అభ్యర్థుల‌తో కూడిన జాబితా సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చింది. ఇందులో సిట్టింగ్‌లు, సీనియ‌ర్లు, జూనియ‌ర్ లీడ‌ర్ల పేర్లున్నాయి. వీరి పేర్లు అధిష్టానం ప‌రిశీల‌న‌లో ఉన్నట్లు ప్రచారం సాగింది. ఈ క్రమంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ నాయ‌కుడికే పార్టీ టిక్కెట్ ఖాయం అవుతుందనీ.. కావాలంటే ఈ లిస్టు చూడండి అంటూ జాబితాలో పేర్లున్న నేత‌ల‌ అనుచ‌రులు అందరికీ షేర్లు చేశారు. కొంద‌రైతే సంబ‌రాలు చేసుకున్నారు. వారి ఆనందం కొన‌సాగుతున్న తరుణంలోనే మ‌రో జాబితా వెలుగులోకి వ‌చ్చింది. తొలి జాబితాలో ఉన్న చాలామంది పేర్లు.. మ‌లి జాబితాలో కనిపించలేదు. దీంతో రెండు లిస్టుల్లోని పేర్లను చూసి నివ్వెరపోవ‌డం కార్యకర్తల వంతయ్యింది. ఈ వ్యవ‌హారం పార్టీలో వ‌ర్గవిభేదాలకు ఆజ్యం పోసేలా ఉండ‌టంతో టీపీసీసీ చీఫ్‌ ఆ ప్రచారమంతా ఉత్తిదేన‌ని ప్రక‌టించాల్సి వ‌చ్చింది. అయినా ప్రచారం మాత్రం ఆగ‌డం లేదు. కొన్ని పేర్లు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా షేర్ కావ‌డంతో టిక్కెట్‌ను ఆశిస్తున్న ఇత‌ర నేత‌ల‌కు చిర్రెత్తుకొచ్చిందట‌. ఎవ‌రు సూచించారో తెలియ‌దుకానీ.. ఈ ప్రచారాన్ని అడ్డుకోవ‌డానికి మ‌రో మాస్టర్‌ప్లాన్ అమ‌లులోకి తెచ్చారు. తొలి లిస్టుకు భిన్నంగా మ‌రో  లిస్టు త‌యారైంది. అది కూడా సోషల్‌మీడియాలో ప్రత్యక్షమై చక్కర్లు కొడుతోంది. తొలి జాబితాలో లేని అనేకమంది పేర్లు ఈ జాబితాలో క‌నిపించాయి.  నిజానికి సెకండ్ లిస్టులో ఉన్న అభ్యర్థుల విష‌యంలోనూ కొన్ని అభ్యంత‌రాలున్నాయి. ఈ  జాబితాల్లోని పేర్లను చూస్తే ఫేక్ జాబితాలేన‌ని అనిపిస్తున్నా.. ప్రచారం మాత్రం ఆగ‌డం లేదు. పైగా ఈ వ్యవ‌హారం కాంగ్రెస్‌లోని వ‌ర్గపోరును.. టిక్కెట్‌ కోసం జ‌రిగే పోట్లాట‌ల‌ను ముందే బ‌ట్టబ‌య‌లు చేస్తోంది. కాంగ్రెస్ నేతలు మాత్రం ఇదంతా టీఆర్ఎస్ కుట్రేన‌ని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ బ‌లోపేతం అవుతుండ‌టాన్ని జీర్ణంచేసుకోలేని టీఆర్ఎస్ నేత‌లు.. త‌ప్పుడు ప్రచారాల‌కు పాల్పడుతున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవ‌హారం ఇంకెన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.