రికార్డులు బద్దలు కొడుతున్న ‘సైరా’

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే మామూలు క్రేజ్ ఉండదు. అదీ ఆయన 151వ చిత్రం.. అందునా చిరు కుమారుడు చరణ్ నిర్మిస్తున్న సినిమా.. అదీకాక అమితాబ్ లాంటి సూపర్ స్టార్ తెలుగులో నటించే దృశ్యకావ్యం.. ఇంక దీనిపై అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఖైదీ నెం 150’తో తన పునరాగమనాన్ని ప్రత్యేకంగా చాటుకున్న చిరు.. తన కుమారుడి సొంత బ్యానర్‌లో నటిస్తున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. గత సంవత్సరం ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ నిరంతరాయంగా జరుగుతోంది. రేపు(ఆగస్టు 22) చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో దీనిని విడుదల చేశారు. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో రూపుదిద్దకుంటున్న ఈ సినిమా టీజర్‌తో అంచనాలను భారీగా పెంచేసింది. ఈ టీజర్‌లో మెగాస్టార్‌ని పోరాట యోధునిలా చూపించిన తీరు ఆకట్టుకుంటోంది.

అంతేకాదు బ్రిటీష్ కోటపై గంభీరంగా కనిపిస్తూ నిలబడి ఉన్నాడు నరసింహారెడ్డి. దీనితో పాటు ‘ఈ యుద్ధం ఎవరిది?’ అంటూ తన సైన్యంలో అత్మస్థైర్యాన్ని నింపుతున్న నరసింహారెడ్డి ‘సైరా’ అంటున్నాడు. అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ ఈ సినిమాను ఓ మెట్టు ఎక్కించిందనే చెప్పాలి. విజువల్ వండర్‌లా టీజర్ కనిపిస్తోంది. దీంతో టీజర్ అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకుంటోంది. ఇది ఒక ప్రముఖ స్వాతంత్ర్యయోధుడి కథ కావడం.. ఆయన ఉద్యమాన్ని ఎలా నడిపించారో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉండటం కూడా ఈ సినిమాకు బలాన్నిస్తోంది. చిరుకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ ఈ సినిమా టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో నిరూపించిందనే చెప్పవచ్చు. టీజర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఇది విడుదలైన గంట లోపే ఒక మిలియన్ వ్యూస్‌ను సాధించింది. అంతేకాదు అత్యధిక లైక్స్ సాధించే దిశగా పయణిస్తోంది. మెగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా దీనిని తెగ షేర్ చేస్తూ, తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.