చంద్రుడి ఇలాఖాలో ఇదో స‌స్పెన్స్!

ప‌డిపోయిన చోట‌నే వెత‌కాలనేది మామూలు సామెత‌. ఓడిన చోట‌నే నెగ్గితీరాల‌నేది రాజ‌కీయ నేత‌ల ఎత్తుగ‌డ‌. దీనికి ఏపీలో తొలిబీజం వేసి విప‌క్షాల‌కు ఓ విధంగా స‌వాల్ విసిరాడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు. కొన్నేళ్లుగా ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు స‌వాల్ విసురుతున్న వేళ చంద్ర‌బాబు ముందుగా సొంత‌జిల్లాలోని చంద్ర‌గిరి, పీలేరు శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి స‌స్పెన్స్‌కు తెర‌లేపారు. ఎందుకింత ధైర్యం… పైగా ఏపీలో టీడీపీ అనుకున్నంత బ‌లంగా లేదు. అలాగ‌నీ బ‌ల‌హీనంగానూ లేదు. కానీ స‌ర్వేలు మాత్రం వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నాయి. చికాకు పుట్టించేలా నేత‌ల తీరు పార్టీను ఇరుకున పెడుతుంది. ఇటువంటి విప‌త్క‌ర వేళ సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం వెనుక క‌థాక‌మామీషు ఎలావున్నా.. ఇప్ప‌టికి ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఇది. చంద్రగిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు  తెదేపా జిల్లా అధ్యక్షుడు నాని, పీలేరు బ‌రిలో ఉమ్మ‌డి ఏపీ ఆఖ‌రి సీఎం న‌ల్లారి వారి త‌మ్ముడు కిశోర్‌కుమార్‌రెడ్డి పోటీకు రెడీ అంటూ చంద్ర‌న్న ప్ర‌క‌టించేశారు. అధికారికంగా ఇదంతా బ‌య‌ట‌కు రాక‌పోయినా.. మీ ప‌ని మీరు చేసుకోమంటూ అధినేత ఆదేశాలిచ్చిన‌ట్లు వారిద్ద‌రి అనుచ‌రగ‌ణం చెబుతున్నారు. రాజకీయంగా ఎంతో ముఖ్య‌మైన ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు ద‌శాబ్దాలుగా టీడీపీ అభ్య‌ర్థులు చ‌తికిల‌ప‌డుతూనే ఉన్నారు. చంద్ర‌బాబు రాజ‌కీయంగా ఓన‌మాలు దిద్దిన‌.. మొద‌టిసారి ఎమ్మెల్యేగా గెలిచింది చంద్ర‌గిరి నుంచే.. 1994 త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కూ అక్క‌డ త‌మ్ముళ్ల‌కు చుక్కెదుర‌వుతుంది.
గ‌త ఎన్నిక‌ల్లో సైకిల్ ఎక్కిన గ‌ల్లా అరుణ‌కుమారి పాపం.. వైసీపీ చేతిలో కొద్దిమెజార్టీతో ఓట‌మి చ‌విచూశారు.  త‌న‌యుడు గ‌ల్లా జ‌య‌దేవ్ టీడీపీలో యాక్టివ్‌గానే ఉన్నా.. త‌ల్లి అరుణ మాత్రం పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. పైగా ఈ ద‌ఫా తాను చంద్ర‌గిరి నుంచి బ‌రిలోకి నిలిచేదిలేదంటూ తేల్చిచెప్పార‌ట‌. దీంతో అభ్య‌ర్ధిత్వాన్ని ముందుగానే మార్చి ప్ర‌క‌టంచార‌న్న‌మాట‌. సీఎం ఇలాఖాలో మ‌రో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. పీలేరు. న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, చింతల సురేంద‌ర్‌రెడ్డి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, అమ‌ర్నాథ్‌రెడ్డి వంటి ఘ‌టికులు ఇక్క‌డ నుంచే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడుక్క‌డ న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి సోద‌రుడు కిషోర్‌కుమార్‌రెడ్డిని ఖ‌రారు చేశారు. త‌ద్వారా రేప‌టి గెలుపున‌కు నాందీప‌లికిన‌ట్టుగా పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. వాస్త‌వానికి ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వ‌ర్గ‌పోరు జాస్తీ. స్థానికంగా ఎన్నోఏళ్లుగా సీటుపై ఆశ‌పెంచుకున్న నేత‌ల‌ను బుజ్జ‌గించి.. అక్క‌డ విజ‌య‌కేతం ఎలా ఎగుర‌వేస్తార‌నేది స‌స్పెన్స్‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.