గులాబీ గూటిలో సురేఖ చిచ్చు!

ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో త‌ల‌నెత్తిన గంపెడ‌బారం పెట్టుకున్న కేసీఆర్ గూటిలో టికెట్ల చిచ్చు బాగానే పెట్టిన‌ట్టుంది. పాపం నాలుగున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలో ఎప్పుడూ చూడ‌నిది కేవ‌లం రెండురోజుల్లో ఎన్నో చూడాల్సి వ‌చ్చింది. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో మాత్ర‌మే త‌గుల‌బెట్టిన కేసీఆర్ దిష్టిబొమ్మ‌ను స్వ‌యంగా గులాబీ నేత‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌న్నెత్తిచూసేందుకు వెనుకాడిన నేత‌లు.. మాకే సీటు లేదంటారా.. చూస్తాం అన్నంత‌గా చెల‌రేగిపోతున్నారు. ఈ జాబితాలో.. వ‌రంగ‌ల్ నేత కొండా సురేఖ‌..  మ‌రో అడుగు ముందుకేసింది. కేసీఆర్ కుటుంబంలో చిచ్చుపెట్టినంత ప‌నిచేసింది. అయితే దీని వెనుక కీల‌క సూత్ర‌దారి కేటీఆర్ అంటూ.. బాంబు పేల్చింది. అయితే.. దీనివెనుక వ‌రంగ‌ల్‌లో ఓ స్థ‌లంపై కొండా దంప‌తులు క‌న్నేయ‌ట‌మే కార‌ణ‌మ‌నే ఆరోప‌ణ‌లున్నాయి. కొండా సురేఖ అంటేనే ఫైర్‌బ్రాండ్‌.. న‌క్స‌లిజం నేప‌థ్యం నుంచి రావ‌టంతో ఎవ‌రూ ఆమెతో పెట్టుకునేవారు కాదు. చంద్ర‌బాబు, జ‌గ‌న్ వంటి నేత‌ల‌కే చెమ‌ట్లు ప‌ట్టించినంత పేరు తెచ్చుకుంది. అటువంటిది కేసీఆర్ త‌న‌యడు కేటీఆర్ వారి పెత్త‌నంపై నీరుచ‌ల్లాడు. పైగా.. కొండా కుటుంబానికి స‌రిజోడుగా మ‌రో నేత‌ను బ‌లోపేతం చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు.
ఇవ‌న్నీ న‌చ్చ‌ని సురేఖ త‌న సీటు విష‌యంలో వెన‌క్కిత‌గ్గ‌లేదు. ఎక్కువ చేస్తున్నారు.. మేం చెప్పిన‌ట్టు వినాలంటూ కేటీఆర్ ఆదేశంతో వ‌ళ్లుమండిన సురేఖ తిరుగుబావుటా ఎగుర‌వేసింది. ఇదంతా త‌న‌పై క‌క్ష‌తో కేటీఆర్ అధినేత కేసీఆర్ మ‌న‌సులో విష‌బీజం నాటాడంటూ సురేఖ తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. పైగా కేటీఆర్‌తో పోల్సితే హ‌రీష్ మంచివాడంటూ కితాబునిచ్చింది. ఇప్ప‌టికే గులాబీ గూటిలో కేసీఆర్ వార‌సులు ఎవ‌ర‌నే అంశంపై చ‌ర్చ సాగుతుంది. హ‌రీష్‌రావును ప‌క్క‌న‌బెట్టిన‌ట్టుగా మొన్న ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌తో బట్ట‌బ‌య‌లైంది. స‌భ ఫెయిల్యూర్‌కు హ‌రీష్‌ను బ‌య‌ట పెట్ట‌డ‌మే కార‌ణ‌మ‌నే విష‌యం కూడా మీడియాకు పొక్కింది. దీంతో హరీష్‌కు బాధ్య‌త‌ల అప్ప‌గించి హుస్నాబాద్ స‌భ‌ను నిర్వ‌హించారు. అది కూడా అట్ట‌ర్‌ప్లాప్ అంటూ.. హ‌స్తం నేత ప్ర‌భాక‌ర్ విమ‌ర్శించాడు. మొద‌టిస‌భ‌తోనే కేసీఆర్ ఇంత‌టి అబాండం మోయాల్సి వ‌చ్చింది. పైగా  సొంత‌గూటిలో కూడా వ్య‌తిరేక‌త‌ను పెంచుకుంటున్నారు. డీఎస్‌తో స‌హా.. ఇంకెంత‌మంది నేత‌లు హ‌స్తం పార్టీ వైపు జంప్‌చేస్తార‌నేది ప్ర‌శ్నార్ధ‌కం. వీట‌న్నింటిని అధిగ‌మించ‌ట‌మే త‌ల‌నొప్పిగా భావిస్తుంటే.. ఇప్పుడు సురేఖ రాజేసిన నిప్పు ఇంకెంత వ‌ర‌కూ చేరుతుందో!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.