తెలంగాణ‌లో ఊహించ‌ని ప‌రిణామాలు!

తెలంగాణ‌లో తాజాగా చోటుచేసుకుంటున్న కొన్ని ప‌రిణామాలు.. రాజ‌కీయంగా ముడిప‌డ్డాయి. ఇది స‌ర్కారు ప్రోద్బ‌ల‌మా.. గులాబీ పార్టీ అధినేత ఆత్మ‌విశ్వాస‌మా అనేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. వాటిలో ఒక‌టి.. క‌త్తి మ‌హేష్ ను హైద‌రాబాద్ నుంచి బ‌హిష్క‌రిస్తూ పోలీసులు ఆదేశాలు జారీచేశారు. మ‌రోసారి ఇక్క‌డ కాలుమోపాల‌న్నా.. పోలీసుల‌కు ముంద‌స్తు స‌మాచారం ఇచ్చి రావాల్సిందే. ఈ లెక్క‌న క‌త్తిని ఏపీ పోలీసుల‌కు అప్ప‌గించిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతుంది. ఇది ఎంత‌వ‌ర‌కూ నిజ‌మ‌నేది కాస్త సందిగ్ధంలో ఉన్నా.. మీడియాను అడ్డుపెట్టుకుని చెల‌రేగే వారికి ఇదో హెచ్చ‌రిక అనేది త‌ట‌స్తుల ఆలోచ‌న‌. పైగా  హిందువుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి నుంచి ప్ర‌భుత్వానికి కాస్త ఊర‌ట అనే చెప్పాలేము. ఎందుకంటే స్వామి ప‌రిపూర్ణానంద ధర్మాగ్ర‌హం పేరిట త‌ల‌పెట్టిన యాత్ర‌కు ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. స్వామిజీను కూడా గృహ‌నిర్బంధంలోనే ఉంచారు. మ‌రో ప‌రిణామం.. రామ‌గుండం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో చోటుచేసుకున్న ఘ‌ట‌న‌లు.. చివ‌ర‌కు మేయ‌ర్‌పై అవిశ్వాసం వ‌ర‌కూ చేరాయి. దీనంత‌టికీ కార‌ణం.. స్థానిక ఎమ్మెల్యే సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ అనే అప‌వాదు కూడా ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. 
దీనిపై కేటీఆర్ స్వ‌యంగా జోక్యం చేసుకున్నారు. మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ల‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం అమ‌లు చేయ‌మంటూ ఎమ్మెల్యేను ఆదేశించారు. దీంతో మ‌న‌స్తాపానికి గురైన సోమార‌పు.. ఎమ్మెల్యే ప‌ద‌వితో సహా.. ఆర్టీసీ చైర్మ‌న్ గిరి కూడా రాజీనామా చేస్తున్న‌ట్లు ప్రక‌టించారు. త‌న‌కు పార్టీ గొప్ప గౌర‌వం ఇచ్చిందంటూ రాజ‌కీయ స‌న్యాసం ప్ర‌క‌టించారు. ముచ్చ‌ట‌గా మూడోది.. కేసీఆర్‌కు ఉన్న ఆత్మ‌విశ్వాస‌మో.. జాత‌క‌బ‌ల ప్ర‌భావ‌మో కానీ.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మంటూ ఏనాడో ప్ర‌క‌టించారు. ఇప్పుడు జ‌మిలి ఎన్నిక‌ల‌కు రెడీ అంటూ లా క‌మిష‌న్ కు సానుకూలంగా లేఖ‌రాశారు. పైగా ఇది దేశానికి మంచిదంటూ కేసీఆర్ ద‌ళం కితాబునిస్తోంది. మ‌రోవైపు ఏపీలో మాత్రం  అధికార టీడీపీ స‌ర్కారు జ‌మిలీపై నో అంటూ తేల్చేసింది. ఇది ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ప‌నిచేస్తుంద‌నా! లేక‌పోతే.. బీజేపీకు వంత‌పాడిన‌ట్టుగా ఏపీజనాల్లోకి సంకేతాలు వెళ్తాయ‌నేది మాత్రం ర‌హ‌స్యం. వాస్త‌వానికి 2004లోనూ చంద్ర‌బాబుకు ముంద‌స్తు క‌ల‌సిరాలేదు. మూడువైపులా చూసినా.. బాబు నిర్ణ‌యం రాజ‌కీయంగా.. ఏపీ రాజ‌కీయ ప‌రిస్థితుల రీత్యా స‌రైన‌దే అనేది పార్టీ శ్రేణుల అభిప్రాయం. ఏమైనా.. తెలంగాణాలో చోటుచేసుకున్న ప‌రిణామాలు.. ఏపీలో ఎంత‌వ‌ర‌కూ చూపుతాయ‌నేది వేచిచూడాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.