‘సుబ్రహ్మణ్యపురం’ మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ‌: సుధాక‌ర్ ఇంపెక్స్ ఐపీఎల్‌
న‌టీన‌టులు: సుమంత్, ఈషా రెబ్బా, సాయికుమార్‌, సురేష్‌, భద్ర‌మ్‌, జోష్ ర‌వి, గిరిధ‌ర్ త‌దిత‌రులు
సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌
ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్‌
కెమెరా: ఆర్‌.కె.ప్ర‌తాప్‌
నిర్మాత‌: బీరం సుధాక‌ర రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: స‌ంతోష్ జాగ‌ర్ల‌పూడి

అప్పుడెప్పుడో వచ్చిన ‘గౌరి’, ‘సత్యం’ వంటి హిట్ చిత్రాల తర్వాత సుమంత్‌కు ఆ స్థాయి సినిమా రాలేదు. అందుకే ఈ మధ్య ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్న విజయం మాత్రం అతడిని వరించడంలేదు. అందుకే ఇప్పుడు తన కెరీర్‌లో ఇప్పటి వరకూ టచ్ చేయని జోనర్‌ను ట్రై చేశాడు. అదే ‘సుబ్రహ్మణ్యపురం’. దేవుడు ఉన్నాడా..? లేదా..? అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా తెరకెక్కింది. గతంలో ఈ తరహా చిత్రాలు ఎన్నో వచ్చాయి. వాటిలో చాలా వరకు సక్సెస్ అయ్యాయి. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి ఈ సినిమా అయినా సుమంత్‌ కెరీర్‌ను మలుపు తిప్పుతుందా..?

కథ
దేవుడంటే నమ్మకం ఉండని కార్తీక్ (సుమంత్) దేవాలయాలపై పరిశోధనలు చేస్తుంటాడు. అదే సమయంలో దేవుడిని బాగా నమ్మే ప్రియ (ఇషా రెబ్బ)తో పరిచయం అవడం, ఇద్దరూ ప్రేమలో పడడం జరిగిపోతాయి. వీళ్లిద్దరి మధ్య దేవుడు ఉన్నాడా..? లేడా..? అనే దానిపై తరచూ వాదనలు జరుగుతూ ఉంటాయి. మరోపక్క, సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో వరుసగా ఆత్మహత్యలు చోటుచేసుకోవడం సంచలనం సృష్టిస్తుంది. ఈ ఆత్మహత్యలకు దేవుడి శాపమేనని అక్కడి జనం నమ్ముతుంటారు. ఇది కార్తీక్ దృష్టికి రావడంతో ఆ ఊరిలోని గుడిపై పరిశోధనలు చేయడానికి అక్కడకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో కార్తీక్‌కు అనేక అనుభవాలు ఎదురవుతాయి. అసలు కార్తీక్‌కు సుబ్రహ్మణ్యపురంలో ఎదురైన అనుభవాలేంటి..? అసలు అక్కడి గుడిలో ఏం జరుగుతుంది..? వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలకు కారణం ఏమిటి..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘సుబ్రహ్మణ్యపురం’ మంచి కథతో వచ్చిన చిత్రం. అయితే, దానిని థ్రిల్లింగ్‌గా చూపించడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. ఉన్నంతలో మాత్రం సినిమా ఆకట్టుకుంటుంది. కానీ, సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు రియలిస్టిక్‌గా అనిపించవు. సినిమాలో మెయిన్ పాయింట్ అయిన ఆత్మహత్యలకు బలమైన కారణాలను చూపించలేదు. అయితే, సినిమా అంచనాలు లేకుండా వెళ్లే వారికి మాత్రం బాగా నచ్చుతుంది.

నటీనటుల పనితీరు
ఈ సినిమాలో నాస్తికుడిగా మరియు దేవాలయాల పరిశోధకుడిగా కనిపించిన సుమంత్ చక్కని నటనను కనబరిచాడు. హీరోయిన్‌తో సాగే ప్రేమ సన్నివేశాల్లో కూడా సుమంత్ తన నటనతో ఆకట్టుకుంటాడు. అలాగే సుబ్రహ్మణ్యపురంలో జరుగుతున్న ఆత్మహత్యల రహస్యాన్ని చేధించే సన్నివేశాల్లో కూడా సుమంత్ తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ అయితే ఎప్పటిలాగే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. కానీ, ఆమె పాత్ర సహాయ నటిలా మిగిలిపోతుంది. అలాగే ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించిన సాయి కుమార్ తన గాంభీరమైన నటనతో మెప్పించారు. మరో కీలక పాత్ర అయిన హీరోయిన్ ఫాదర్‌గా నటించిన సురేష్ కూడా చాలా బాగా నటించాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లోనూ సురేష్ నటన చాలా బాగుంది. ఇక కమెడియన్ భద్రమ్ తన కామెడీ టైమింగ్‌తో నవ్వించే ప్రయత్నం చేయగా.. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

టెక్నీషియన్ల పనితీరు
దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. అయితే, దానిని తీసుకెళ్లే విధానంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఆర్ కె ప్రతాప్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన పాటలు పర్వాలేదనిపస్తాయి. సెకండాఫ్‌లో కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం మాత్రం కొంతమేరకు ఆకట్టుకుంటుంది. కార్తికేయ శ్రీనివాస్ ఎడిటింగ్ సినిమాకి తగ్గట్లే ఉంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదనిపిస్తాయి.

బలాలు
* కథ
* సెకెండాఫ్
* సుమంత్ నటన

బలహీనతలు
* థ్రిల్ మిస్ అయింది
* ఫస్టాఫ్
* సినిమాటిక్ సీన్స్

మొత్తంగా: అంచనాలు లేకుండా వెళ్లే వారికి నచ్చుతుంది

రేటింగ్: 2.5/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.