శ్రీనివాస కల్యాణం మూవీ రివ్యూ

బ్యాన‌ర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
న‌టీన‌టులు: నితిన్, రాశీ ఖన్నా, నందితా శ్వేత‌, పూన‌మ్‌కౌర్‌, జ‌య‌సుధ‌, ఆమ‌ని, సితార‌, సీనియ‌ర్ న‌రేశ్‌, ప్ర‌కాష్‌రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌దిత‌రులు
సంగీతం: మిక్కీ జె మేయర్
కెమెరా: స‌మీర్ రెడ్డి
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి అనిత
ఎడిటింగ్: మధు
నిర్మాత‌లు: దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్
ద‌ర్శ‌క‌త్వం: సతీష్ వేగేశ్న‌

ఒకే పంథాలో సినిమాలు చేసుకుంటూ వెళ్లిన యంగ్ హీరో నితిన్ వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అలాంటి సమయంలో ‘ఇష్క్’ ఇచ్చిన టర్నింగ్‌తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. తర్వాత కొన్ని సినిమాలు నిరాశ పరిచినా.. ‘అఆ’తో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. దాని తర్వాత రెండు వైవిధ్యమైన సినిమాలు చేసినా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇలాంటి తరుణంలో నితిన్.. తెలుగు ఇండస్ట్రీలోని బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు, ‘శతమానం భవతి’ వంటి సూపర్ హిట్ సినిమాతో ఆకట్టుకున్న సతీష్ వేగేశ్నతో కలిసి చేసిన చిత్రమే ‘శ్రీనివాస కల్యాణం’. పక్కా పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో మంచి కుటుంబ కథతో వస్తున్న ఈ శ్రీనివాసులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా..? లేదా..?

కథ
పక్కా పల్లెటూరుకి చెందిన శ్రీనివాస్(నితిన్) ఉద్యోగ రిత్యా చంఢీఘర్‌లో ఉంటాడు. ఒకనొక సమయంలో అక్కడే ఒక చిన్న ఉద్యోగం చేస్తున్న శ్రీదేవి(రాశీఖన్నా)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. పెళ్లన్నా, పల్లెటూరి సంప్రదాయాలన్నా ఇష్టమున్న శ్రీనివాస్, శ్రీదేవిలు పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలనుకుంటారు. తన నాయనమ్మ(జయసుధ) అంటే ఇష్టమున్న శ్రీనివాస్, తన పెళ్లి గురించి మాట్లాడడానికి శ్రీదేవి తండ్రి ఆర్కే(ప్రకాశ్‌రాజ్) దగ్గరకు వెళ్తాడు. ఈ క్రమంలో తన కూతురి ఇష్టానికి ప్రధాన్యమిచ్చి ఆర్కే వీరిద్దరి పెళ్లికి అంగీకరిస్తాడు. అప్పుడు శ్రీనివాస్ పెళ్లి తన ఊరిలోనే జరపాలని కండీషన్ పెడతాడు. దీనికి ఒప్పుకున్న ఆర్కే ప్రతిగా శ్రీనివాస్‌తో ఓ విషయమై అగ్రిమెంట్ రాయించుకుంటాడు. ఇంతకీ ఆర్కే రాయించుకున్న అగ్రిమెంట్ దేనికి సంబంధించినది…? శ్రీనివాస్ అనుకున్నట్లుగానే పెళ్లి వాళ్ల ఊరిలోనే జరుగుతుందా..? అసలు శ్రీనివాస కల్యాణం జరిగిందా..? లేదా..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
గతంలో పెళ్లిళ్లు ఎలా జరిగాయో ఇప్పుడు పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయో నేటి తరం తెలుసుకోడానికి అద్దం పట్టే సినిమా ఇది. పెళ్లంటే రెండు మూడు రోజులు జరుపుకునే కార్యక్రమం కాదని, అదో మధురమైన జ్ఞాపకం అని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోతారు. పల్లెటూరి నేపథ్యంలో, పెళ్లి కాన్సెప్ట్‌తో చాలా సినిమాలే వచ్చాయి. కాకపోతే అవి అప్పటి తరాన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటి తరం వారికి ఈ సినిమా సాగుతున్న విధానం నచ్చుతుందో లేదో కథ రాసుకునేప్పుడు డైరెక్టర్ ఆలోచించి ఉండడు అనిపిస్తోంది. ఎందుకంటే ఈ తరహా సినిమా యూత్‌కు క‌నెక్ట్ కావ‌డం క‌ష్టమే. అయితే, ఫ్యామీలీ ఆడియెన్స్‌ను మాత్రం ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నాయి. ఇక పాత్ర‌లు, వాటిని మ‌లిచిన తీరు, వాటి మ‌ధ్య భావోద్వేగాలు ఎఫెక్టివ్‌గా అనిపించ‌వు. మొత్తంగా ఈ శ్రీనివాసుని కల్యాణాన్ని కుటుంబ సమేతంగా ఒక్కసారి చూడవచ్చు.

నటీనటులు, టెక్నీషియన్ల పనితీరు
ఇందులో హీరో నితిన్ సాధారణ యువకుడిలా కనిపిస్తాడు. ఈ క్రమంలో తనలోని ఎనర్జీని బలవంతంగా లాక్ చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఎమోషన్స్ పండించడంలో మాత్రం నితిన్ సక్సెస్ అయ్యాడు. హీరోయిన్ విషయానికొస్తే, రాశీఖన్నా తన పాత్రకు న్యాయం చేసింది. ఆమెలోని నటిని వాడుకోవడంలో డైరెక్టర్ విఫలమయ్యాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాశీఖన్నా గత చిత్రాల్లో ఇంతకంటే మంచి నటనను కనబరిచింది. ఇందులో మరో ముఖ్య పాత్ర అంటే ప్రకాశ్ రాజ్‌దే. ఒకపక్క బాధ్యతాయుతమైన తండ్రిగా సీరియస్‌గా కనిపిస్తూనే, కామెడీ పండించాడు. రెండు వేరియేషన్లు ఉన్న షేడ్స్ చూపించాడు. ఇక, జయసుధ, నరేష్, రాజేంద్ర ప్రసాద్ తదితర నటులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

టెక్నికల్ విభాగంలో మొదట డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. ‘శతమానం భవితి’తో కుటుంబం మధ్య ఆప్యాయతల్ని చూపించిన డైరెక్టర్ ఇప్పుడు జీవితంలో ముఖ్యమైన వివాహం గురించి వివరించే ప్రయత్నం చేశాడు. ఇందులో అదే కుటుంబ నేపథ్యాన్ని ఎంచుకుని పెళ్లి విశిష్టతను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే, ఎమోషన్స్ సీన్స్ విషయంలో, క్లైమాక్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ అందించిన పాటలు ఎక్కడో విన్నట్లు ఉంటాయి కానీ, నేప‌థ్య సంగీతం బాగుంది. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఆయన కెమెరా పనితనం సినిమాకు ఫ్రెష్‌నెస్‌ను తీసుకొచ్చింది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. దిల్ రాజు ఎక్కడా రాజీపడకుండా సినిమా పూర్తి చేసినట్లు అనిపిస్తుంది.

బలాలు
* నటీ నటులు
* పెళ్లి జరిపే తీరు
* డైలాగ్స్
* సినిమాటోగ్రఫీ

బలహీనతలు
* బలహీనంగా సాగే ఎమోషన్ సీన్స్
* నేటి యువతకు నచ్చకపోవచ్చు

మొత్తంగా: తెలుగు సంప్రదాయాలను గౌరవించే వారికి శ్రీనివాస కల్యాణం నచ్చుతుంది.

రేటింగ్: 2.75/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.