గాజుల‌మేడ‌లో ఇంద్ర‌జ జీవితం

ఆమె శ్రీదేవి.  అమ్మ‌కు.. బంగారు కొండ‌. నాన్న‌కు మురిపేల కూతురు. బ‌డిలో నేస్తాల‌తో ఆట‌ల్లేవు. బాల్యాన్ని ఆస్వాదించిన ఆన‌వాళ్లు క‌న‌ప‌డ‌వు. వెండితెర వెలుగుల్లోనే చంద‌మామ‌లు అనుకుని మురిసిపోయింది. విరామం వ‌స్తే.. చుట్టూ చూసి.. అమ్మ‌లేద‌నుకుంటే.. హాయిగా మ‌ట్టిలో ఆడుకునేది. ఇంటికి రాగానే.. నాన్న ఒడిలో బాల్యాన్ని చ‌విచూసేది. అంద‌రి దృష్టిలో శ్రీ ఓ మ‌ర‌మ‌నిషి. అందాల‌బొమ్మ‌. అమ్మ మ‌ర ఇస్తే ఆడేది. ద‌ర్శ‌కులు.. అందాన్ని.. అభిన‌యాన్ని కురిపించ‌మంటే కురిపించేది. ఒళ్లు అల‌సినా.. పంటిబిగువున భ‌రించింది. మ‌న‌సు విశ్రాంతి కోరినా.. ఓపిక ప‌ట్టింది. బాధ‌ను ఎవ‌రితో పంచుకోవాలో తెలియ‌ని వ‌య‌సులో చిట్టిచెల్లి శ్రీల‌త త‌న ప్రాణం అనుకుంది. కాల‌చ‌క్రంతోపాటు.. పేరు ప్ర‌ఖ్యాతులు వ‌స్తే.. ఏముంది ఇందులో అనుకుంది. ఏం జ‌రిగినా.. ఎంత పేరొచ్చినా.. అందం త‌గ్గొద్దు. ముక్కు.. క‌ళ్లు.. ఒళ్లు.. అన్నీ కొల‌మానంగా ఉండాలి. వ‌య‌సు రీత్యా వ‌చ్చే స‌మ‌స్య‌ల‌కు చెక్ చెప్పాలంటూ చేసిన ఒత్తిళ్ల‌తో.. ఎన్నిసార్లు.. క‌త్తిగాట్లు  ఒంటిని తూట్లు పొడిచినా భ‌రించింది. వ‌య‌సు వ‌చ్చాక‌.. ప్రేమిస్తున్నానంటూ మిధున్ ప‌లుక‌రిస్తే ప‌రువం పంచింది. ప‌ద‌హారేళ్ల వ‌య‌సులో మాదిరిగానే.. అత‌డు త‌న మ‌న‌సు గాకుండా.. ఇంకేదో కోరుకంటున్న‌ట్లు అర్ధ‌మైంది. చెల్లి అంటూ.. ఓదార్చేందుకు చేరువైన బోనితో ఏకాంతంగా ఉండేందుకు అంగీక‌రించింది. అమ్మానాన్న‌లు దూర‌మై.. ఒంట‌రిగా ఉన్న‌వేళ‌.. భుజం మీద చేయివేస్తే.. ఆత్మీయుడు అనుకుంది. కానీ.. తానే చెలికాడు.. త‌రువాత మ‌గ‌డిగా మార‌తాడ‌ని ఊహించ‌లేక‌పోయింది. గ‌ర్భంలో పిండం క‌ద‌లాడుతుంటే.. సంప్ర‌దాయానికి త‌లొగ్గి.. తాళిక‌ట్టించుకుని ఆలిగా మారింది. అమ్మ‌గా.. ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌ల‌కు త‌ల్ల‌యింది. ఆంక్ష‌లు.. అడ్డంకులు.. క‌ట్టుబాట్లు.. క‌నిపించ‌ని ఎన్నో మ‌నోవేద‌న‌కు కార‌ణ‌మ‌య్యే ఘ‌ట‌న‌లు మ‌న‌సును మెలిపెడుతుంటే.. భ‌రించ‌లేక‌పోయింది. ఈడొచ్చిన ఆడ‌పిల్ల‌ల‌కు కెరీర్ కోసం త‌ల్లిగా ప‌రిత‌పించింది. త‌న త‌ల్లి పెంచిన క్ర‌మ‌శిక్ష‌ణ‌ను గుర్తు చేసుకుని. జాహ్న‌వి, ఖుషీల‌కు భ‌విష్య‌త్ ఇవ్వాల‌నుకుంది. కానీ.. కాలం మ‌రోలా భావించింది. యాభై ఐదేళ్ల వ‌య‌సులో.. మ‌న‌సు.. భ‌రించ‌లేన‌ని మొర‌పెట్టుకుందేమో.. ఆ గుండె.. ఇక నా వ‌ల్ల కాదు.. క‌న్నీటి సావాసం అంటూ కోరుకుందేమో.. సిరి లేని దేవిగా ఉండ‌లేక‌పోయిందేమో.. హాయిగా.. శాశ్వ‌తంగా.. మ‌ర‌ణం ఒడిలో నిద్ర‌లోకి జారుకుంది. ఎవ‌రేమ‌నుకున్నా.. అవేమీ ఆమెకు వినిపించ‌వు. పొగ‌డ్త‌లు.. విమ‌ర్శ‌ల‌కు.. అతీతంగా ఆమె దివికేగింది. అక్క‌డ‌.. అంద‌చందాల‌తో ప‌నిలేదు. ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు చేయించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఆస్తుల కోసం మోసం చేసే చెల్లెళ్లు ఉండ‌రు. ఒంటిని చూసి వ‌ల‌పు వ‌ల విసిరే మ‌గాళ్లు క‌నిపించ‌రు. ఇప్పుడు ఆంక్ష‌ల్లేవు. ఐస్ క్రీమ్ తినొద్దంటూ ఒత్తిడి పెట్టే డ్రైవ‌ర్లు ఉండ‌రు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.