మానవా.. ఇక సెలవు అంటూ వెళ్లిపోయిన శ్రీదేవి

అతిలోక సుందరి. దేవకన్య. అందాల తార. శ్రీదేవి అంతిమ యాత్ర అధికారిక లాంఛనాలతో జరిగాయి. ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ ప్రముఖులు ముంబైకి చేరారు. కడసారి శ్రీదేవి పార్థీవ కాయాన్ని చూసి కన్నీటి చుక్కలు రాల్చారు. కాంచీవరం చీరలంటే శ్రీదేవికి చాలా ఇష్టమట. అందుకే ఆమె భౌతికకాయానికి బంగారు వర్ణంతో కూడిన కాంజీవరం చీరను కప్పారు. పెద్ద బొట్టును పెట్టారు. కంటికి కాటుక రాశారు. అంతే కాదు.. ఏడువారాల నగలు వేశారు. ఆమెకు ఇష్టమైన వస్తువులను భౌతిక కాయంపై ఉంచారు. అభిమానుల మనసుల్లో నుంచి ఆ మనోహర రూపం చెదిరిపోకుండా ఉండేలా ఆమె కుటుంబసభ్యులు చర్యలు తీసుకున్నారు. శ్రీదేవి భౌతికకాయాన్ని ఉంచిన వాహనాన్ని మల్లెపూలు, లిల్లీపూలతో అలంకరించారు. మల్లెపూలు అంటే శ్రీదేవి ఎంతో ఇష్టమట. అందుకే ఆమె పార్దీవదేహాన్ని తరలించే వాహనాన్ని ఆ పూలతోనే తీర్చిదిద్దారు. అందాల తారకు ఇష్టమైన చీర పైనే అంతిమయాత్ర నిర్వహించారు. ఆమె భౌతికకాయానికి జాతీయ జెండాను కప్పారు. ఆమె భౌతికకాయాన్ని తరలిస్తున్న వాహనాన్ని పూర్తిగా తెలుపురంగు పూలతో అలంకరించారు. శ్రీదేవికి తెలుపు రంగంటే చాలా ఇష్టమట. అందుకే అంతా తెలుపు రంగు పూలతో చాలా అందంగా అలంకరించారు. 
దివి నుంచి భువికి దిగి వచ్చి, దశాబ్దాలపాటు వెండితెరను ఏలిన రాణి అతిలోక సుందరి మళ్లీ దివికి వెళ్లిపోయింది. మరపురాని పాత్రలతో అర్థ శతాబ్దం పాటు అశేష అభిమానగణాన్ని అలరించి, కోట్లాది హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకుంది. మానవా ఇక సెలవ్ అంటూ స్వర్గానికి సాగిపోయింది.
అశేష సంఖ్యలో అభిమానులు..
అశ్రునయనాల మధ్య ఆమెకు తుది వీడ్కోలు పలికారు. అభిమాన నటిని కడసారి చూపు కోసం అభిమానులు శ్మశానవాటిక వద్దకు పోటెత్తారు. అంతకు ముందు సెలబ్రేషన్స్ క్లబ్ నుంచి విల్లేపార్లే వరకు  సాగిన శ్రీదేవి అంతిమయాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. అభిమాన నటిని చివరిసారి చూసుకునేందుకు కడసారి వీడ్కోలు పలికి, నివాళి అర్పించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అశేష జనవాహినితో ముంబై పరిసరాలు కిక్కిరిసిపోయాయి. 
ఒకరా…ఇద్దరా…
తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన అందాల తార కోసం స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు హేమామాలిని, రేఖ, ఐశ్వర్యారాయ్, జయాబచ్చన్, సుస్మితాసేన్, మాధురీ దీక్షిత్, అక్షయ్‌ కుమార్, షారూక్ ఖాన్, టబు, అజయ్ దేవగన్, కాజోల్, దీపికా పదుకునే, అర్జున్ కపూర్, సంజయ్‌ లీలా బన్సాలి, సారా అలీఖాన్, జాక్వలైన్ ఫెర్నాండెజ్, రీతేష్ దేశ్‌ముఖ్, అర్భాజ్ ఖాన్, ఇషా డియోల్, కరణ్‌ జోహార్, ఫరా ఖాన్, సుభాయ్ ఘాయ్ తదితరులు భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. వారే కాదు.. రజనీకాంత్, కమల్‌ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అర్జున్, ఎన్టీఆర్ సహా పలువురు దక్షిణాది నటులు శ్రీదేవి భౌతికకాయాన్ని వద్ద అశ్రునివాళి అర్పించారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ సినిమా రంగాలకు చెందిన ప్రముఖ నటీనటులంతా శ్రీదేవి ఇంటికి తరలివచ్చారు. తమతో కలసి నటించి, మెప్పించిన సహనటిని కడసారి సందర్శించి కన్నీటి నివాళి అర్పించారు. సినీ రంగంతో పాటు రాజకీయ, పారిశ్రామికరంగాలకు చెందిన ప్రముఖులు శ్రీదేవి ఇంటికి వచ్చి ఆమెకు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. అంత్యక్రియల కార్యక్రమంలో సినీ నటులు విద్యాబాలన్‌, ఆమె భర్త సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌, ఫర్హాన్‌ అక్తర్‌, దియా మిర్జా, ఆమె భర్త సాహిల్‌, అనిల్‌ అంబానీ, అనుపమ్‌ ఖేర్‌, అర్జున్‌ రాంపాల్‌  తదితరులు చాలా మంది హాజరయ్యారు.
కుటుంబ సభ్యులంతా తోడుగా…
అతిలోక సుందరి భౌతికకాయం వెంట భర్త బోనీకపూర్ ఆయన సోదరులు అర్జున్ కపూర్, సంజయ్ కపూర్ ముందు ఉండగా…అదే వాహనం పై శ్రీదేవి తల వద్ద రవీనాటాండన్, సోనమ కపూర్, రాణీ ముఖర్జీ, మనీష్ మల్హోత్రా ఉండగా… ఇక ఎడమవైపు ఆమె కుమార్తెలు జాన్వీ, ఖుషీ లు ఉన్నారు. అభిమాన నటి శ్రీదేవి కడసారి చూపుకోసం సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు బారులు తీరారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఆమె చివరి చూపుల కోసం పరిగెత్తి మరీ అక్కడకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఆమెకు నివాళులు అర్పించలేకపోయారు షారుక్. అందుకే నేరుగా విలే పార్లేలోని శ్మశాన వాటికకు వచ్చారు. 
అతిలోక సుందరి శ్రీదేవి అంతిమ యాత్ర ఘటన కలచి వేస్తోందని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిచ్చోడిలా చనిపోయాక లేఖ రాశారు. ‘‘థియేటర్స్‌లో శ్రీదేవి అద్భుతమైన ఎనర్జీతో చేసే డ్యాన్స్‌ను, యాక్టింగ్‌ను చూసేందుకు జనం అలా కూర్చుండిపోయేవారు. అలాగే ఇప్పుడు కూడా ఆమె చుట్టూ జనం ఉన్నారు. కానీ కన్నీళ్లతో పగిలిన హృదయాలతో’’ అని వర్మ చేసిన ట్వీట్ కంటతడి పెట్టించింది. 
నాలుగు తరాల సినీ ప్రేక్షకుల్ని తన అందం, అభినయంతో మంత్రముగ్దులయ్యేలా చేసిన లెజండరీ నటి శ్రీదేవికి భారతావని కన్నీటి వీడ్కోలు పలికింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.