తెలంగాణ అమ్మ… కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం

తెలంగాణ ఇచ్చినా గత ఎన్నికల్లో ఆ క్రెడిట్‌ను దక్కించుకోలేక ఎన్నికల బరిలో చతికిల పడింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చిన మరుక్షణం తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆ తర్వాత కొట్టిన దెబ్బ నుంచి తేరుకోవడానికి నాలుగేళ్లు పట్టింది. ఈ లోగా తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో బలపడింది. తెలంగాణను కొట్టేందుకు ఏం చేయాలనే స్పష్టమైన వ్యూహం లేక తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు చేతులెత్తేసాయి. తెలుగుదేశం పార్టీ అయితే తన ఉనికినే లేకుండా చేసుకుంది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీలో  అనైక్యత… తెలుగుదేశం పార్టీలో నాయకత్వ లోపమే అని రాజకీయ పండితులు అంటున్నారు.  మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితిని దీటుగా ఎదుర్కొనేందుకు అవకాశాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావే ఇచ్చారు. అలా వచ్చిన అవకాశమే ముందస్తు ఎన్నికలు. ఈ లోగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయకుండా అధికారాన్ని కైవసం చేసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 
ఇందులో భాగంగా ఇతర ప్రతిపక్షాలతో కలిసి మహాకూటమి ఏర్పాటు దిశగా అడుగులూ వేస్తోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు ముందు నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని కాంగ్రెస్ పార్టీ  భావిస్తోంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, అది కూడా సోనియాగాంధీయే అని పెద్దగా ప్రచారం చేయాలని భావిస్తోంది. అభ్యర్ధులను ప్రకటించడానికి ముందే తెలంగాణ తల్లి  సోనియా గాంధీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని ఎత్తుగడ వేస్తోంది. ఈ మేరకు వ్యూహ రచన కమటీలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ సభల్లో  సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొనేలా చూడాలని భావిస్తున్నారు. సోనియా గాంధీని ముందుంచి ఎన్నికల్లో లబ్ది పొందాలన్నది 
కాంగ్రెస్ వ్యూహం. దీనికి తెలంగాణ ప్రజల నుంచి సానుభూతి కూడా వస్తుందని, తద్వారా మహాకూటమి విజయానికి చేరువవుతుందన్నది కాంగ్రెస్ వ్యూహ కమిటీ భావిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో అధిష్టానంతో ఈ విషయంపై చర్చించి అక్టోబర్ మొదటి వారంలో సోనియా గాంధీ తెలంగాణలో పర్యటించేలా చేయాలని భావిస్తున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.