సోషల్‌ వార్‌… టీడీపీ, వైసీపీకి భిన్నంగా బీజేపీ!

నిజమో.. అబద్దమో.. క్షణాల్లో అది జనానికి చేరిపోవాలి. అంతటా రచ్చరచ్చ కావాలి. వీలైతే ఎదుట పార్టీ మీద నాలుగు రాళ్లు వేసేందుకే ఉపయోగపడాలి. దీనికి సులువైన మార్గం.. సోషల్‌ మీడియా. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని రాజకీయ పక్షాలు ఇప్పుడు దీనిపైనే పడ్డాయి. ఖర్చు లేకుండా.. బోలెడు ప్రచారం పొంది.. ప్రజల్లోకి దూసుకుపోవాలనేది వ్యూహం రచించాయి. ఇందుకు క్షణం వృథా చేయడం లేదు. గతంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించి, ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో, ఎత్తుగడలతో సహా రోజుల తరబడి నూరిపోసేవారు. ఇప్పుడు సీను రివర్స్‌ అయ్యింది. తమ కార్యకర్తల ను సోషల్‌ మీడియాలో చొచ్చుకుపోయేలా అన్ని పార్టీలు ‘శిక్షణ’ ప్రారంభించాయి. అది కూడా ఏవేమి చేయాలో చెబుతున్నారు. అవతలి పార్టీ ఇచ్చే మెసేజ్‌లను తిప్పికొట్టడం, తమ పార్టీకి మెరుగైన వాతావరణం కల్పించేలా చేస్తున్నారు.

ప్రచారం ఎలా చేస్తారు?
గతంలో ఒక అంశంపై ప్రచారం చేసి.. ప్రజలను ఆక ర్షించేందుకు నానా తిప్పలు పడేవారు. వాల్‌ పోస్టర్లు వేసే కాలం నుంచి కరపత్రాల వరకు నడిచింది. రానురాను ఇది కనుమరుగై దాని స్థానంలో సోషల్‌ మీడియా పుట్టుకొచ్చిం ది. ఇందులో ఎలా చేయాలి, ఏవేమి చేయాలనే అంశా లను క్షణాల్లో అన్ని వర్గాలకు చేరవేయడం, పార్టీ స్థూల నిర్ణయాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియచేసేలా చూసేందుకు సోషల్‌ మీడియాను ప్రధాన అస్త్రంగా ఎంచుకు న్నారు. పార్టీకి సంబంధించిన అనుకూల కథనాలను ఎక్కువగా నమోదు చేస్తున్నారు. దీనిని వీక్షించే సబ్‌స్కైబర్స్‌ సంఖ్యను ఎక్కువగా ఉండేలా చూసుకుని స్పందనలను బట్టి తిరిగి స్పందిస్తున్నారు. ప్రతీ కార్యకర్త నిత్యం ఒక యజ్ఞంలా వాట్సప్‌ ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ వాట్సప్‌, యూట్యూబ్‌లపై దృష్టి పెట్టింది. కొంతమంది ‘ఫేక్‌’ మెసేజ్‌లు ఇస్తున్న వైనాన్ని గమనించి దానిపై ఫిర్యాదు ఎలా చేయాలో శిక్షణ ఇస్తు న్నారు. మెసేజ్‌ ఫేక్‌ అని తేలిన తరువాత వెంటనే ఆ అకౌంట్‌ను నిలిపివేసేలా జాగ్రత్త పడుతున్నారు. ఎదుట వైరిపక్షాన్ని నేరుగా దెబ్బ తీయడం, ప్రజలకు ఎప్పటి కప్పుడు ఉదాహరణలతో సహా వివరించేలా తదుపరి నిజమే కదా అనిపించేలా చేయడమే దీనికి వెనుక ఉన్న పరమార్ధం. భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో అనే క జాగ్రత్తలను పాటిస్తోంది. కొద్ది రోజులుగా శిక్షణ కొన సాగుతూనే ఉంది. విజయవాడ కేంద్రంగా చేసుకుని శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

బీజేపీ దూకుడు
వామపక్షాలు, బీజేపీ, జనసేన పార్టీలు కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాపై దృష్టి పెట్టాయి. ఒకటికి రెండుసార్లు కార్యకర్తలను రప్పించి తగిన శిక్షణ ఇస్తున్నాయి. ఈ విష యంలో బీజేపీ ఒక అడుగు ముందుకువేసింది.తమ కార్య కర్తలందరికీ సోషల్‌ మీడియాలో ఎలాంటి పద్ధతులు పా టించాలి, పార్టీకి అనుకూలత ఎలా సృష్టించాలి, మిగతా పార్టీల దూకుడును ఎలా అడ్డుకోవాలనే దానిపై శిక్షణ ఇస్తున్నారు.

జనసేన హల్‌చల్‌
ఈ మధ్యనే జనసేన పార్టీ సోషల్‌ మీడియా వైపు దృష్టి పెట్టింది. ఆ పార్టీకి చెందిన నేతలు కొందరు ఈ రంగంలో నేర్పరితనం ప్రదర్శించడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు జిల్లాకు ఒక సమన్వయకర్తను సోషల్‌ మీడియా నిర్వహణకు ఏర్పాటు చేశారు. ఒకవైపు తమ పార్టీ సమాచారాన్ని సోషల్‌ మీడియాలో కనిపించేలా తక్షణ నిర్ణయాలు తీసు కుంటుంది. పవన్‌ పర్యటనను ఎప్పటికప్పుడు పోస్టులను సోషల్‌ మీడియాలో ఉంచడం, తెలుగుదేశంపై పవన్‌ చేసే వ్యాఖ్యలను హైలెట్‌ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

వామపక్షాలు వదల్లేదు
ఇంకోవైపు వామపక్షాలు ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేశాయి. మారుతున్న పరిస్థితులను బట్టే తామూ మారాలన్న ధోరణిలో ఉన్నాయి. తదనుగుణం గానే సోషల్‌ మీడియాలో ‘కత్తి’ తిప్పేందుకు వామపక్షాలు తమ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాయి. గడచిన రెండు రోజులుగా ఇలాంటి శిక్షణా శిబిరాలను కొనసాగిస్తున్నారు.

ముందు నుంచే టీడీపీ, వైసీపీ
ఈ విషయంలో తెలుగుదేశం, వైసీపీ పక్షాలు ఇప్పటికే ముందు వరుసలో ఉన్నందున వాటికంటే భిన్నంగా ఉండాలన్నదే బీజేపీ తాపత్రయంగా కనిపిస్తోంది. రాబోయేది ఎన్నికల కాలం కావడంతో ఇప్పటి నుంచే ‘వాట్సప్‌ యుద్ధం’ ఆరంభమైంది. ఒక దశలో దీనిపై కన్నెత్తి చూడని పార్టీలు నేరుగా రంగంలోకి దూకేశాయి. పరిస్థితిని తమకు అను కూలంగా మార్చుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. పాత కాలం నాటి రాజకీయ శిక్షణా శిబిరాలకు స్వస్తి పలికి.. సోషల్‌ మీడియా శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. వీటికి ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధపడుతున్నారు.

వందల సెటైర్లు..
‘సహజంగా చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటుంది. నెట్‌ ఫ్రీ వచ్చిన తరువాత హద్దులులేవు. సోషల్‌ మీడియాలో నా అంతట నేనుగా నాకు తోచిన ఫొటోలను, మెసేజ్‌లను ఇట్టే పంపడానికి అనువుగా ఉంది. పైసా ఖర్చు కాదు. ఇక పార్టీల విషయానికి వస్తే.. అవి కూడా వీటి మీదే పడ్డాయి. రోజుకి వందల సెటైర్లు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి’ సామాజిక కార్యకర్త వెంకట్రావు చెప్పిన మాట ఇది. రాజకీయ పక్షాల్లోనూ ఈ ధోరణి రానున్న రోజుల్లో మరింత ఎగబాకే అవకాశం లేకపోలేదు. ‘సోషల్‌ మీడియా అందరిదీ. మాకు ఇష్టమైన పార్టీ వ్యవహారాలను,నాయకుల తీరుపై మేం కామెంట్‌ చేస్తాం. ఇష్టమైన వారు చూస్తారు, లేదంటే లేనేలేదు’ సత్యనారాయణ అనే ఒక పార్టీ కార్యకర్త అభిప్రాయమిది. అసలు సోషల్‌ మీడియా భవిష్యత్‌లో రాజకీయాలకు అతి పెద్ద వేదిక కానున్నదనే విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్నది ‘సోషల్‌ వార్‌’గా చెప్పవచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.