క‌న్నాకు.. ముస‌ళ్ల పండుగ ముందుందా!

న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ జీవితంలో కింగ్‌గా ఎదిగిన నేత క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌. గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ ఉంద‌నే చెప్పాలి. అటువంటి నేత‌.. కోరి కొరివితో త‌ల‌గోక్కున్న‌ట్టుగా మారింది. గత ఎన్నిక‌ల్లో ఓట‌మిని జీర్ణించుకోలేని క‌న్నా బీజేపీ వైపు మొగ్గుచూపారు. నిన్న‌టి వ‌ర‌కూ టీడీపీతో దోస్తీ ఉండ‌టంతో.. క‌న్నా కూడా.. మౌనంగా ఉన్నారు. అధికారంలో ఉన్న విప‌క్ష నేత‌గా మెలిగారు. దేశంతో క‌మ‌లం క‌టీఫ్ కొట్ట‌గానే.. కాపు వ‌ర్గం నేత‌గా క‌న్నాకు అధ్య‌క్ష ప‌గ్గాలు క‌ట్ట‌బెట్టారు. ఇప్పుడు జిల్లా నుంచి రాష్ట్ర నేత‌గా ఎదిగిన క‌న్నా.. రాష్ట్ర వ్యాప్త ప‌ర్య‌ట‌న‌ల‌కు శ్రీకారం చుట్టారు. అయితే.. హ‌స్తం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న‌కు.. బీజేపీ శ్రేణుల నుంచి అనుకున్నంత మ‌ద్ద‌తు వ‌స్తున్న‌ట్లు లేదు. పైగా టీడీపీ మాట‌ల దాడి.. మీడియా ప్రోత్సాహంతో టీడీపీ త‌ప్పిదాల‌ను మించి బీజేపీ ఏపీకు చేసిన ద్రోహ‌మే  హైలెట్ అవుతూ వ‌స్తుంది. ఓ విధంగా క‌న్నా పై జ‌రుగుతున్న దాడులు.. టీడీపీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయ‌నే బ‌య‌ట‌ప‌డుతుంది. దీనివ‌ల్ల టీడీపీ నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో నెర‌వేర్చ‌లేక‌పోయిన హామీల‌కు బీజేపీ కార‌ణ‌మ‌నే విష‌యం జ‌నాల్లోకి చేరింద‌నేది బ‌య‌ట‌ప‌డుతుంది.
అయితే. అదే స‌మ‌యంలో బీజేపీ రాష్ట్ర నేత క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ మాత్రం స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌టంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  అనంత‌పురం, క‌ర్నూలు, నెల్లూరు, నిన్న తిరుప‌తి లో క‌న్నాకు ఎదురైన చేదు అనుభ‌వాలే ప్ర‌త్యక్ష‌సాక్ష్యం.  క‌మలం కాస్తో.. కూస్తో.. బ‌లంగా ఉంద‌ని భావించే హైద‌రాబాద్ న‌గ‌రంలో కూడా జీహెచ్ఎంసీ లో ఒక్క కార్పొరేట్ సీటు కూడా గెల‌వ‌లేక‌పోయింది. అటువంటిది ఏపీ వంటి రాజ‌కీయ చైత‌న్యం ఉన్న చోట‌.. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల‌కు బీజేపీ పోటీకి దిగితే.. డిపాజిట్లు వ‌స్తాయా అనే అనుమానం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. క‌నీసం.. మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు గెలుస్తారా అనేది కూడా క‌మ‌లం పార్టీకు ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌. అదే స‌మ‌యంలో క‌నీసం క‌న్నా అయినా గెలుస్తారా! బీజేపీ ప‌రువు నిలుపుతారా అనే అనుమానాలు కూడా పార్టీ శ్రేణుల్లో వ్య‌క్త‌మ‌వుతుంది. ఓవ‌రాల్‌గా చెప్పాలంటే.. క‌న్నా ప‌రిస్థితి పెనం నుంచి పొయ్యిలో ప‌డిన‌ట్టుంద‌నే చెప్పాలి.అటు కేంద్రంలోనూ బీజేపీకు అనుకూల వాతావ‌ర‌ణం లేదు. ఎన్‌డీఏ కూట‌మి నుంచి కొంద‌రు మిత్రులు బ‌య‌ట‌ప‌డుతూ ఉన్నారు. ఇటువంటిది ఏపీలో ప‌రిస్థితి ఎన్నిక‌ల నాటికి మ‌రింత దిగ‌జారితే.. వ్య‌క్తిగ‌తంగా కూడా క‌న్నాకు ఊహించ‌ని దెబ్బ అనే ఆందోళ‌న కూడా ఆయ‌న అభిమానుల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.