చంద్రబాబుకు మద్దతిచ్చి బీజేపీకి షాకిచ్చిన మిత్ర పక్షం

భారతీయ జనతా పార్టీ 2014లో కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. అప్పుడు మోదీ ప్రభ ఎన్డీయేకు ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత భారీగా పెరిగిపోతోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న పలు నిర్ణయాలకు దేశ ప్రజలు ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారు. దీనికితోడు ప్రతిపక్షలు బలపడడం.. మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా మద్దతు ఉపసంహరించుకోవడం కమలనాథులను టెన్షన్ పెడుతోంది. దీంతో భారతీయ జనతా పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఒకవైపు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతకు తోడు బీజేపీయేతర పార్టీలన్నీ కలసికట్టుగా ఉండడం కమలనాథులను నిద్రపోనీయడం లేదు. మూలిగే నక్క మీద తాటి కాయ పడిన చందంగా మారింది బీజేపీ పరిస్థితి. ఇప్పటికే ఓటమి భయంతో ఆత్మరక్షణలో పడిపోయిన బీజేపీకి మిత్ర పక్షం శివసేన మరోసారి షాక్ ఇచ్చింది. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న శివసేన.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన దీక్షకు మద్దతు తెలిపింది. ఇది బీజేపీ నేతలను షాక్‌కు గురి చేసింది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్వయంగా చంద్రబాబును కలిసి సంఘీభావం ప్రకటించారు.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆయన మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో కలిసి దీక్షాస్థలికి రావడం బీజేపీ నేతలతో పాటు దీక్షా వేదిక వద్ద ఉన్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. సంజయ్ వేదికపైనా వారితో కలిసివిడిగా ఉండడం.. తర్వాత కూడా వాళ్లతోనే వెళ్లడం వంటివి దేశ రాజధానిలో చర్చనీయాంశం అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలని ఆలోచనలో పడిపోయిన బీజేపీకి శివసేన కూడా హ్యాండిచ్చేలానే కనిపిస్తోంది. ఇదిలాఉండగా, ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ సహా మిత్రపక్షాలు ఒక్కోటి దూరమవుతున్న నేపథ్యంలో.. శివసేన పార్టీతో బంధాన్ని నిలుపుకునేందుకు బీజేపీ ఆపసోపాలు పడుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందట ఆ పార్టీ చీఫ్ అమిత్ షా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో సమావేశమై చర్చలు జరిపారు. అప్పటి వరకూ బాగానే ఉంటున్న ఆ పార్టీ అధిష్ఠానం.. తర్వాత మాత్రం బీజేపీకి ఝలక్‌లు ఇస్తోంది. శివసేన పార్టీ పత్రిక ‘‘సామ్నా’’లో తరచూ కేంద్ర ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేయడం.. బీజేపీ పాలనపై పలు వ్యాంగ్యాస్త్రాలు సంధించడం వంటివి ప్రచురణ చేస్తుంటారు. అసలే గట్టి మిత్ర పక్షమని భావించే శివసేన.. ఇప్పుడు బీజేపీయేతర పార్టీలతో కలిసే అవకాశాలు ఉండడంతో భారతీయ జనతా పార్టీలో అలజడి మొదలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.