అమెరికా వ్యాప్తంగా  ఘనంగా మనబడి స్నాతకోత్సవాలు !

అమెరికా వ్యాప్తంగా  ఈ వారాంతంలో వర్జీనియా, న్యూజెర్సీ, అట్లాంటా, చికాగో నగరాలలో,  మనబడి స్నాతకోత్సవాలు కన్నులపండుగ గా జరిగాయి.  ఈ సంవత్సరం సిలికానాంధ్ర మనబడి – తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహణలో జరిగిన పరీక్షలలో 98.5% మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. వారందరికీ ప్రాంతాల వారీగా జరిగిన స్నాతకోత్సవాల్లో ధృవీకరణ పత్రాలను అందజేయడం జరిగింది.  

వర్జీనియా : స్నాతకోత్సవ  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి, ఉత్తీర్ణులైన విద్యార్ధులకు తెలుగు విశ్వవిద్యాలయం పట్టాలను బహూకరించిన వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణ మాట్లాడుతూ, వేల మైళ్ళ దూరంలో పుట్టి పెరుగుతున్న ఈ చిన్నారులు, తెలుగు భాష నేర్చుకుని ఇంత చక్కగా మాట్లాడుతూ, పరీక్షలు వ్రాసి 98.5% పైగా ఉత్తీర్ణులవడం, వారికి పట్టాలు ప్రదానం చేసే అవకాశం తనకు లభించడం ఎంతో ఆనందదాయకం గా ఉందని, ఈ చిన్నారులకు పట్టాలు అందించిన నా చేతులు పునీతమయ్యాయని అన్నారు. విశిష్ట అతిథి గా విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత,సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి డా. దీర్ఘాసి విజయభాస్కర్ మాట్లాడుతూ, మనబడి విద్యార్ధులు స్నాతకోత్సవ దుస్తుల్లో వేదిక దగ్గరకు వస్తుంటే, తెలుగు అక్షరాలు కవాతు చేస్తున్నట్టుగా ఉందని హర్షం వ్యక్తం చేసారు. ఆత్మీయ అతిధిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఉపసభాపతి డా. మండలి బుద్ధ ప్రసాద్ గారు సిలికానాంధ్ర తో తన అనుబంధాన్ని వివరించగా, సిలికానాంధ్ర మనబడి కుటుంబ సభ్యులంతా, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండలి దంపతులచే కేక్ కోయించి, పుట్టినరోజు సంబరాలను జరిపించారు. 

న్యూజెర్సీ,NJ, NY, CT, PA & DE  ప్రాంతాలలోని మనబడి కేంద్రాల విద్యార్ధులు పాల్గొన్న  స్నాతకోత్సవం న్యూజెర్సీలో లో జరిగింది. ఈ కార్యక్రమానికి  విచ్చేసిన  విశిష్ట అతిధి న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమీషనర్, మన తెలుగు తేజం చివుకుల ఉపేంద్ర మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ళకు ముందు అమెరికాకి వచ్చిన తెలుగువారి పిల్లలకి మన మాతృభాష తెలుగుని అందిస్తున్న మనబడి కృషిని,అందుకు సహకరిస్తున్న తల్లితండ్రులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమ ప్రత్యేక అతిధి టీవీ9 అధినేత రవిప్రకాష్, మాట్లాడుతూ, సిలికానాంధ్ర ను దాదాపుగా 10 యేళ్ళనుంచి చూస్తున్నానని, తెలుగు భాష, సంస్కృతి, కళలు, సంప్రదాయల గురించి వారు చేపట్టే కార్యక్రమాలు ప్రపంచం విస్తుపోయేలా ఉంటాయని, లక్షమందిని ఒక చోట చేర్చి అన్నమయ్య కీర్తనలు పాడించడం చూసి వారి పట్టుదలకు ముగ్ధుడినయ్యానని, అప్పటినుంచి ఇప్పటిదాకా ఏకార్యక్రమం చేపట్టినా విజయం సాధిస్తోందని, అందుకు ఇన్ని వేలమైళ్ళ దూరంలో ఉన్నా, తెలుగుని ఇంత చక్కగా నేర్చుకుంటున్న ఈ విద్యార్ధులే సాక్ష్యమని అన్నారు. అందుకే సిలికానాంధ్ర కూచిపూడి గ్రామంలో చేపట్టిన ‘సంజీవని ‘ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానానికి తనవంతుగా 4 కోట్ల విరాళం అందించానని, సిలికానాంధ్ర చేపట్టిన ఏ కార్యక్రమమైనా వ్యక్తిగతంగానూ, చానెల్ TV9 తరఫున తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ప్రకటించారు. సిలికానాంధ్ర సంస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ, మాతృభాష నేర్చుకోవడంతోనే మన సంస్కృతిని తెలుసుకునే అవకాశం కలుగుతుందనీ, అందుకే మనబడి ద్వారా తెలుగు నేర్పించడానికి 11 సంవత్సరాల క్రితం 150 మందితో ప్రారంభించామని, ఇప్పటికి 35000 మందికి పైగా విద్యార్ధులు మనబడి ద్వారా తెలుగు నేర్చుకున్నారని, ఇంకా ఎన్నో వేలమంది రేపటి తరం తెలుగు భాషా సారధులను తయారుచేయడమే మనబడి ధ్యేయమని అన్నారు. 

అట్లాంట : విజయ్ రావిళ్ళ నేతృత్వంలో జరిగిన మనబడి స్నాతకోత్సవం అట్లాంటాలో అత్యంత వైభవంగా జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణ గారి చేతులమీదుగా విద్యార్ధులు పట్టాలు అందుకున్నారు. ఈసందర్భంగా, సిలికానాంధ్ర మనబడి అధ్యక్షులు రాజు చమర్తి మాట్లాడుతూ, ఈ సంవత్సరం అమెరికా వ్యాప్తంగా దాదాపు 1300 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరు కాగా 98% పైగా విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారని అందుకు సహకరించిన మనబడి ప్రాంతీయ సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు,మనబడి కీలక బృంద సభ్యులు, మాతృభాషా ప్రేమికులందరికీ ధన్యవాదాలు తెలిపారు. మనబడి 2018-19 విద్యా సంవత్సరపు నమోదు కార్యక్రమం ప్రారంభమైందని, సెప్టెంబర్ 8 నుండి తరగతులు ప్రారంభమౌతాయని, http://manabadi.siliconandhra.orgద్వారా ఆగస్ట్ 31 లోగా మనబడిలో చేరవచ్చని మనబడి ఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు. 

చికాగో : చికాగోలో జరిగిన మనబడి స్నాతకోత్సవానికి ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణతో పాటు మరో అతిధిగా విచ్చేసిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ, తాను ఎన్నో సంవత్సరాలుగా మనబడిని దగ్గరనుంచి చూస్తున్నానని, ఈ భాషాసేవ చేస్తున్న వారందరిలో మాతృభాష పట్ల నిబద్ధత చూసానని, అందుకే మనబడి ఇంత విజయవంతంగా ఎంతోమంది ప్రవాస బాలలకు తెలుగు నేర్పగలుగుతోందని, ఇటీవల హైదరబాద్ లో జరిగిన ప్రపంచతెలుగు మహాసభల్లో పాల్గొన్న భారత రాష్ట్రపతి సైతం ‘మనబడి ‘ గురించి తన ప్రసంగంలో పేర్కొనడం అందుకు నిదర్శనమని అన్నారు.

స్నాతకోత్సవ కార్యక్రమాలను సిలికానాంధ్ర మనబడి ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల పర్యవేక్షించగా,మనబడి ప్రాచుర్యం ఉపాధ్యక్షులు శరత్ వేట, రామాపురం గౌడ్, కిరణ్ దుడ్డగి, పవన్ బొర్ర, మాధురి దాసరి, శ్రీనివాస్ చివులూరి, సుజాత అప్పలనేని, విజయ్ రావిళ్ళ, వెంకట్ గంగవరపు, మరియు  ఖమ్మం జిల్లానుంచి వచ్చిన తెలుగు భాషోద్యమ నాయకులు పారుపల్లి కోదండ రామయ్య గారు, మనబడి విద్యార్ధుల కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, ప్రాంతీయ సమన్వయ కర్తలు, భాషా ప్రేమికులు పాల్గొన్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.