టీడీపీకి షాకింగ్ న్యూస్.. అక్కడ ఒక్క సీటూ రాదట

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ.. తెలంగాణలో మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లోకి జంప్ అవడంతో తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్ర విభజన సమయంలో టీడీపీలో ఉన్న సీనియర్ నేతలు ఇప్పుడు పార్టీకి దూరమైపోయారు. అటు పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు కూడా ఏపీ వ్యవహారాలు చూసుకోవడంతోనే సరిపెట్టుకుంటున్నారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన టీడీపీ.. ఇప్పుడు తెలంగాణలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఇతర పార్టీలు బలంగా ఉండడంతో పాటు, టీడీపీలో బలమైన నాయకులు లేకపోవడంతో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది.

రాష్ట్ర విభజన తర్వాత అంటే 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌తో వచ్చిన టీఆర్ఎస్ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ సృష్టించిన ప్రభజనానికి టీడీపీ, కాంగ్రెస్ తక్కువ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పరిస్థితి కొంత బాగున్నా.. టీడీపీ మాత్రం కేవలం 15 సీట్లు మాత్రమే సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. అప్పుడు గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలలో 12 మంది టీఆర్ఎస్ పార్టీలోకి చేరగా, ఒకరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీకి మిగిలింది ఇద్దరు మాత్రమే. వారిలో ఒకరు సండ్ర వెంకట వీరయ్య కాగా, మరొకరు ఆర్ కృష్ణయ్య. తాజాగా టీడీపీని షాక్‌కు గురిచేసే ఓ వార్త బయటికొచ్చింది.

ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థ తెలంగాణ వ్యాప్తంగా సర్వే నిర్వహించిందట. ఈ సర్వేలో టీడీపీని షాక్‌కు గురి చేసే ఫలితాలు వచ్చాయట. ఇది చూసిన టీటీడీపీ నేతల్లో అప్పుడే కలవరం మొదలైందట. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వడంతో.. టీఆర్ఎస్ చాలా తక్కువ మెజారిటీతో అధికారంలోకి వస్తుందట. హైదరాబాద్ సిటీలో పట్టు ఉన్న ఎంఐఎం, బీజేపీ గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే కొన్నింటిని కోల్పోతున్నాయట. అయితే టీడీపీకి మాత్రం ఒక్క సీటు కూడా రాదని సర్వేలో తేలినట్లు చూపిస్తున్నారు. మొత్తంగా టీఆర్ఎస్ 63, కాంగ్రెస్ 45, ఎంఐఎం 6, బీజేపీ 3, ఇతరులు 2 స్థానాలను కైవశం చేసుకుంటాయట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.