కేసీఆర్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేతలు

తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఆ జిల్లానే అభివృద్ధి పధంలో దూసుకుపోతుంది. అక్కడ పాలన ఎలాగున్నా.. రాజకీయం మాత్రం బాగుంటుంది. ప్రత్యర్ధులుగా ఉన్న నేతలు బద్ద శత్రువులుగా వ్యవహరిస్తుంటారు. అంతేనా.. సొంత పార్టీలో కూడా వర్గ విభేదాలతో సతమతమవుతుంటారు. ఇప్పుడు అదే జిల్లాలో రాజకీయ క్రీడ రసకందాయంగా ఉంది. ఇప్పుడు పలానా పార్టీలో ఉన్న వారు తర్వాత ఏ పార్టీలోకి మారతారో.. జిల్లాలో కీలకంగా వ్యవహరించే నేతలు ఎప్పుడు ఏ స్టెప్ వేస్తారో చెప్పడం చాలా కష్టంగా మారింది. అలాంటి జిల్లాలో ఎన్నికలకు ఏడాది ఉండగానే అధికార టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగలబోతుందట. పార్టీలో కీలకంగా వ్యవహరించే ఇద్దరు నేతలు పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారట. అక్కడ ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న అధికార టీఆర్ఎస్‌కు కొండ మురళి దంపతులు షాక్ ఇవ్వబోతున్నారట. ప్రస్తుతం వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్నారు కొండా సురేఖ. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు కొండా మురళి. వీళ్లిద్దరూ టీఆర్ఎస్‌లో చక్రం తిప్పగల సమర్ధతున్న నాయకులే. అయితే వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.! ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్న కొండా సురేఖ.. ఆ పార్టీలో మంత్రిగా కూడా పని చేశారు. వైయస్ మరణానంతరం వైసీపీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత గులాబీ గూటికి చేరారు. తాజాగా వారు మరోసారి పార్టీ మారబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

కొద్దిరోజుల కిందట రెండు సీట్లు ఇస్తే కాంగ్రెస్‌లోకి చేరతామంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో రాయబారం నడిపినట్లు, దానికి వారు అంగీకరించకపోవడంతో కొండా దంపతులు టీఆర్ఎస్‌లో కొనసాగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇది జరిగింది నిజమో కాదో తెలియదు కానీ, ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఆధిపత్య పోరు పడలేక వారు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరంగల్ నగర మేయర్‌గా ఉన్న నన్నపనేని నరేంద్రకు కొండా దంపతులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు తలెత్తాయట. దీంతో వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా, పట్టించుకోకపోగా, వీళ్ల తప్పే ఉన్నట్లు మందలించారట. దీంతో వీళ్లిద్దరికీ చిర్రెత్తుకొచ్చిందట. ఈ కారణంగానే పార్టీ మారాలని డిసైడ్ అయిపోయారట.

వారు ఏ పార్టీకి వెళ్తారో అన్న విషయంపై క్లారిటీ అయితే లేదు గానీ, కచ్చితంగా కాంగ్రెస్‌లోకే వెళ్తారనే ప్రచారం మాత్రం జరుగుతోంది. కొండా సురేఖకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే టికెట్‌తో పాటు, కొండా మురళికి ఎమ్మెల్సీ లేదా కొండా దంపతుల కుమార్తెకు పరకాల అసెంబ్లీ టికెట్ కావాలని అడుగుతున్నారట. కొండా దంపతుల డిమాండ్‌పై వరంగల్ నేతలతో పీసీసీ చర్చిస్తోంది. అయితే కొండా సురేఖ రాకను పలువురు నేతలు వ్యతిరేకించగా.. మరికొందరు నేతలు సాదారంగా ఆహ్వానించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే వర్గపోరు కారణంగా టీఆర్ఎస్ ఇద్దరు బలమైన నేతలను కోల్పోయినట్లే అవుతుంది. మరి, ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.