టీఆర్ఎస్‌కు రోజుకో షాక్.. ఈ సారి ఎవరంటే…

విభజనానంతరం తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. ఆ పార్టీ గెలిచి, అధికారాన్ని చేపట్టిన తర్వాత.. అప్పటి ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆపరేషన్‌ ఆకర్ష్‌ను ప్రయోగించారు. దీంతో తెలుగుదేశం, కాంగ్రెస్, సీపీఐ సహా పలు పార్టీలలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు.. ఇతర ముఖ్య నేతలను టీఆర్ఎస్‌లోకి తీసుకున్నారు. ఆ దెబ్బకి టీడీపీ రాష్ట్రంలో ఉనికి కోల్పోయే స్థితికి చేరుకోగా, కాంగ్రెస్ పార్టీ కూడా కొంత నిరుత్సాహానికి గురైంది. అప్పటి నుంచి టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాలుగు సంవత్సరాల మూడు నెలల పాటు ఆ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పచ్చ జెండా ఊపడం.. అదే రోజు 105 మంది అభ్యర్థులను ప్రకటించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ పార్టీలో టికెట్ దక్కని ఆశావాహ నేతలు అసంతృప్తికి లోనయ్యారు. అధిష్ఠానం బుజ్జగింపులు జరుపుతున్నా వారిలో ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి ఎవరో ఒకరు జంప్ అవుతూ వస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడిన తర్వాత జంపింగులు రెట్టింపయ్యాయి.

మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండడం.. టీఆర్ఎస్ ప్రాధాన్యత కల్పించకపోవడం.. అదే సమయంలో ప్రజాకూటమి రాష్ట్రంలో బలపడడం వంటి కారణాలతో ఆ పార్టీ నుంచి వలసలు జోరుందుకున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది టీఆర్ఎస్‌‌కు రోజుకో షాక్‌ తగులుతోంది. అధిష్ఠానం వారిని నిలువరించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికే పలువురు కీలకనేతలు పార్టీని వీడి కాంగ్రెస్, టీడీపీ గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, ఆయన సతీమణి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సాయిలీల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం అనుచరులు, కార్యకర్తలతో చర్చించిన సమ్మయ్య కాంగ్రెస్‌‌ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించారు. ఇదిలాఉండగా, ఆ పార్టీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి నుంచి మొదలుకొని గురువారం వరకు ఎవరో ఒకరు ఆ పార్టీని వీడుతూనే ఉన్నారు. కీలక స్థానంగా భావించే కూకట్‌పల్లిలో పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకోగా, ఖమ్మం జిల్లాలోనూ ఆ పార్టీ ముఖ్య నేతలు సైకిల్ ఎక్కేశారు. అలాగే కొందరు టీఆర్ఎస్ నేతలు హస్తం గూటికి చేరిపోయారు. అయితే ఎన్నికల ముందు రాజీనామాలు టీఆర్ఎస్‌‌కు పెద్ద ఎదురుదెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.