జనసేనకు గట్టి షాక్ తగలబోతుందా..?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం కూడా ఆసక్తికరంగా మారింది. అక్కడ కూడా ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అధికార, ప్రతిపక్షాలు స్పీడు పెంచాయి. గత ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల మధ్యే పోటీ జరగగా, ఈ సారి జనసేన ఎంట్రీతో త్రికోణ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల కోసం పలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాడు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన జనసేన.. రూటు మార్చి ప్రభుత్వంపైనే పోరాటం చేస్తోంది. పవన్ కల్యాణ్ కూడా ప్రభుత్వాన్నే టార్గెట్ చేసి విమర్శలు చేయడం పరిపాటి అయిపోయింది. ఒకవైపు ఈ వ్యవహారాలు చూసుకుంటూనే మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేనాని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా పవన్ కొద్దిరోజులుగా యాత్రను కూడా చేస్తున్నాడు. అయితే, యాత్రల సమయంలో హైలైట్ అవుతున్న పవన్.. ఎక్కువగా బ్రేక్ తీసుకోవడం జనసేనకు పెద్ద ప్రతికూలంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఆయన ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టలో చేరుతారని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో జనసేన పార్టీలో కలవరం మొదలైందట. మాజీ ఐఏఎస్ అధికారి, పారిశ్రామికవేత్త అయిన చంద్రశేఖర్.. గతంలో వైసీపీలోనే పని చేశారు. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఆయన వ్యాపార రంగంలోకి ప్రవేశించి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. తర్వాత వైసీపీలో చేరి 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే తెలుగుదేశం అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) చేతిలో ఓడిపోయారు. అంతకు ముందు కూడా ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తరవాత చంద్రశేఖర్ వైసీపీని వీడి జనసైనికుడిగా మారారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల లెక్కల తేల్చేందుకు పవన్ ఏర్పాటుచేసిన జాయింట్ ఫ్యాక్ట్స్ కమిటీ (జేఎఫ్‌సీ)లో సభ్యుడిగా కూడా ఉన్నారు. మరి ఈయన గురించి వస్తున్న ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజుల వేచి చూడాల్సిందే.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.