‘శైలజారెడ్డి అల్లుడు’ మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
నటీనటులు: నాగ‌చైత‌న్య‌, అను ఇమ్మాన్యుయేల్‌, ర‌మ్య‌కృష్ణ‌, ముర‌ళీశర్మ‌, న‌రేశ్‌, వెన్నెల కిశోర్‌, ర‌ఘుబాబు, పృథ్వీ, శ‌ర‌ణ్య ప్ర‌దీప్ త‌దిత‌రులు
సంగీతం: గోపీ సుంద‌ర్‌
ఛాయాగ్ర‌హ‌ణం: నిజార్ ష‌ఫీ
కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
క‌ళ‌: ర‌వీంద‌ర్‌
నిర్మాత‌లు: నాగ‌వంశీ.ఎస్‌, పిడివి.ప్ర‌సాద్‌
ద‌ర్శ‌క‌త్వం: మారుతి

అక్కినేని వారి వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసినా హీరోగా తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య. ఎప్పుడో వచ్చిన కొత్తలో ‘ఏమాయ చేశావే’, ‘100% లవ్’ వంటి సక్సెస్‌లు అందుకున్న చైతూ.. అప్పటి నుంచి ఆ రేంజ్ హిట్ పడక ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు చేయని ప్రయత్నం లేదు. ఈ ప్రయత్నాల్లోనే ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ వంటి వరుస హిట్ చిత్రాల దర్శకుడు మారుతితో జతకట్టాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘శైలజారెడ్డి అల్లుడు’. ఇందులో మరో హైలైట్ శైలజారెడ్డి పాత్రలో నటించిన రమ్యకృష్ణ. ఇక, ఇలాంటి ముగ్గురు కాంబినేషన్‌లో వినాయకచవితి కానుకగా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి సినిమా అంచనాలను అందుకుందా..? నాగ చైతన్యకు ఈ సారైనా హిట్ పడిందా..?

కథ
సున్నితమైన మనస్థత్వం కలిగిన యువకుడు చైత‌న్య‌(అక్కినేని నాగ‌చైత‌న్య‌). అతడి తండ్రి రావ్‌(ముర‌ళీశర్మ‌)కు చాలా ఇగో ఉంటుంది. ఆయన ఇగో కారణంగా ఎన్నో సార్లు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అచ్చు అలాంటి మనస్థత్వమే కలిగిన అమ్మాయి అను (అను ఇమ్మాన్యుయేల్‌)ను చైతన్య ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడిని ఇష్టపడుతుంది కానీ, ఇగో కారణంగా బయటకు చెప్పలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసి చైతన్య సక్సెస్ అవుతాడు. ఈ క్రమంలోనే వీళ్ల ప్రేమ విషయం రావ్‌కు తెలిసిపోతుంది. అయితే, అనుది తనలాంటి వ్యక్తత్వమే అని గ్రహించిన రావ్ వీళ్ల పెళ్లికి ఓకే చెప్పేస్తాడు. అంతేకాదు, అనివార్య కారణాల వల్ల వాళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా జరిపిస్తాడు. అంతా సవ్యంగా జరుగుతుందనుకున్న సమయంలో అను.. శైలజారెడ్డి(రమ్యకృష్ణ) కూతురని, ఆమెకు కూడా అనులాగే ఇగో ఎక్కువని, వీళ్లిద్దరూ మాట్లాడుకోరనే విషయం చైతన్యకు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వరంగల్ వెళ్లిన అతడు.. శైలజారెడ్డిని పెళ్లికి ఒప్పించాడా..? తల్లీ కూతుళ్లను కలిపాడా..? దీని కోసం ఎన్ని పాట్లు పడ్డాడు..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
ఇగో ఫుల్‌గా ఉన్న ముగ్గురిని హీరో తన తెలివితేటలతో ఎలా మార్చాడనేదే ఈ సినిమా కథ. అయితే, సినిమా టైటిల్‌కు తగ్గట్లు కేవలం అత్తా అల్లుడి మధ్యే కథ సాగదు. కథ, కథనం కంటే కామెడీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా అది అనుకున్నంత మేర ఆకట్టుకోలేదు. రొటీన్‌గా సాగే సన్నివేశాలు, బోరింగ్ ట్రీట్మెంట్‌తో సాగే కథనం సినిమాకు మైనస్‌గా నిలిస్తాయి. మొత్తంగా చూస్తే క‌థ‌లో కొత్త‌ద‌నం ఏమీ క‌నిపించ‌క‌పోయిన‌ప్ప‌టికీ పాత్ర‌ల్ని తీర్చిదిద్దుకున్న విధానం మాత్రం కొత్త‌గా అనిపిస్తుంది. సినిమా ఫస్టాఫ్ అంతా ఎక్కువ శాతం పాత్రల పరిచయం.. చైత‌న్య‌, అనుల మ‌ధ్య ప్రేమ నేప‌థ్యంలోనే సాగుతాయి. ఇక సెకెండాఫ్‌ విషయానికొస్తే వెన్నెల కిషోర్‌, పృథ్వీ ఎపిసోడ్ మిన‌హా కామెడీ కోసం ద‌ర్శ‌కుడు చేసిన ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా ఫ‌లించలేదు. ర‌మ్య‌కృష్ణ పాత్ర బాగానే ఉన్నా.. అది ఈ క‌థ‌కి స‌రిగ్గా అత‌క‌లేదు. తల్లి, కూతురు మధ్య మితిమీరిన అహం ద్వితీయార్థంలో ప్రేక్ష‌కుల‌కు బోర్ కొట్టిస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గా సాగుతుంది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకుడికి కొత్తదనం కనిపించదు.

నటీనటుల పనితీరు
నాగ‌చైత‌న్య చ‌లాకీ కుర్రాడిగా క‌నిపిస్తాడు. ఆయ‌న పాత్ర‌, న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. అయితే భావోద్వేగాల్ని పండించే సంభాష‌ణ‌ల‌పై ఆయ‌న మ‌రింత క‌స‌ర‌త్తు చేయాల్సింద‌నిపిస్తుంది. అను ఇమ్మాన్యుయేల్ అందంతో ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో ప్రాధాన్య‌మున్న పాత్ర‌లో కనిపిస్తుందామె. శైల‌జారెడ్డి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ ఒదిగిపోయే ప్ర‌య‌త్నం చేశారు. మురళీశర్మ కూడా గత సినిమాల్లోలాగానే మెప్పిస్తాడు. ఇక వెన్నెల కిషోర్‌, పృథ్వీలు క‌లిసి చేసిన కామెడీ అల‌రిస్తుంది. ముర‌ళీశ‌ర్మ, శ‌ర‌ణ్య ప్ర‌దీప్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

టెక్నీషియన్ల పనితీరు
దర్శకుడు మారుతీ రాసుకున్న కామెడీ పెద్దగా ఆసక్తిగా లేకపోయినా కథనంతో ఆ ఫీల్‌ను పోగొట్టే ప్రయత్నం చేశాడు. దాంట్లో చాల వరకు విజయం సాధించాడు. అత్తా అల్లుడు మధ్య పెట్టిన సీన్స్ అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు. అక్కడ దర్శకుడు కొంత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఇక నిజార్ షఫీ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ప్రతి ఫ్రేమ్‌ను చాల రిచ్‌గా చూపెట్టారు. గోపిసుందర్ అందించిన సంగీతం పర్వాలేదు. కానీ గత సినిమాలతో పోల్చుకుంటే ఏమాత్రం ఆకట్టుకోదు. సిట్యువేషనల్ సాంగ్ శైలజారెడ్డి అల్లుడు చూడే సాంగ్ వినడానికి బాగుంది. కోటగిరి వెంకటేశ్వరరావు అందించిన ఎడిటింగ్ బాగుంది కానీ ఆయన తన కత్తెరకు ఇంకొంత పని చెప్పుంటే బాగుండేదనిపిస్తుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు
* నటీ నటులు
* క్యారెక్టరైజేషన్
* సెకెండాఫ్‌లో వచ్చే కామెడీ

బలహీనతలు
* కథ, కథనం
* రొటీన్ సన్నివేశాలు
* సెకెండాఫ్ బోరింగ్‌గా అనిపించడం
* మ్యూజిక్

మొత్తంగా: ఈ అల్లుడు అక్కినేని అభిమానులకే నచ్చుతాడు

రేటింగ్: 2/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.