సెటైర్ : జై నాలుకాయ నమః

‘‘అరేయ్ నరం లేని నాలుక అని పెద్దలంటారు కదా ఎందుకంటావ్’’
‘‘ఎందుకేముంది బావా.. మెత్తంగా ఉంటుంది.. ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటుందీ.. ఎలాంటి రుచులు తన మీదకు వచ్చినా.. మనతో లొట్టలు వేయిస్తుంటుంది…’’
‘‘సాల్లే ఊరుకోవో.. ఈ మాట చెప్పేది.. దాని రుచుల గురించి కాదెహె.. ఆ నాలుక చెప్పే మాటల గురించేమో.. అని ఒక డౌటురా..’’
‘‘అయ్యుండొచ్చు బావా.. మరి మాట అనే పదార్థం ప్రవహించి వొచ్చేది నాలుక మీంచే కదా..’’
‘‘కాబట్టి అలాంటి విలువైన నరం లేని నాలుకను పెట్టుబడిగా పెట్టుకోని.. అర్జంటుగా స్టేట్లోనే పెద్ద సెలబ్రిటీ అయిపోవాలని నాకు కోరిగ్గా ఉందిరా..’’
‘‘దాన్దేముంది బావా.. ఏ రామాయణమో భారతమో.. ఎట్లీస్టు భగవద్గీతో కంఠతా పట్టేసి.. దానికి నీకు తోచిన రకాలుగా అర్థాలు చెప్పేసి జనాన్ని ఇంప్రెస్సింగు జేసేసినావనకో.. ఆటోమేటిగ్గా సెలబ్రిటీ అయిపోతావ్ బావా..’’
‘‘సీస్సీ.. మళ్లీ ఆ పురాణాల్లో పద్దేలూ గట్రా సదవడం, కంఠోపాటం చెయ్యడం ఇయ్యన్నీ మనకి కిట్టవమ్మా.. ఉత్తుత్తిగా నాలుక తోనే అయిపోవాల’’
‘‘దాన్దేముంది బావా.. అయిపోవచ్చు.. ఏం చదవకపోయినా పర్లే.. ఏదో నాలుగు మంచి మాటలు చెబుతూ ఉన్నావనుకో.. శాస్త్రం తెలవకపోయినా నీతులు జెప్పే సాములోరు కొత్తగా వచ్చారని జనం జేజేలు కొడతారు బావా…’’
‘‘నీతులు కూడా మన బతుకుల వల్ల కాదు గానీ ఇంకో దారుంటే సెప్పరా..’’
‘‘ఎందుకు లేదు బావా.. నీతులకు దోవ లేనప్పుడు బూతున్నాయ్.. నడిరోడ్లో నిల్చుకోని బూతులు తిడుతూ కూసున్నావనుకో.. అందరూ నీ కేసి చూసి మగానుబావుడనుకుంటారు బావా..’’
‘‘ ఏడిసినట్టుంది… నడిరోడ్లో నిల్చోని బూతులు తిడతా ఉంటే పిచ్చి నాకొడుకనుకుంటారంతే… సెలబ్రిటీ ఎట్టాగవుతాం రా…’’
‘‘బూతులంటే ఉత్తుత్తి బూతులు కాదు బావా.. మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే పెద్దోళ్లను ఎతుక్కోవాల.. ఆళ్ల మీద బూతుల్లాంటి పెశ్నలు సంధించాల.. పెశ్నల్లాంటి బూతుల్ని లంకించుకోవాల…’’
‘‘అయితే ఏటవుద్దంటావ్?.’’
‘‘ఒక్కపాలిగా సెలబ్రిటీ అయిపోతావ్.. టీవీ ఛానెలోళ్లంతా నీ కాడికి లగెట్టుకుంటా వొచ్చేసి.. నిన్ను అమాంతం ఎత్తుకోని పొయ్యి చానెల్ స్టుడియోలో కూసోబెట్టుకోని.. లైవ్ డిస్కషన్లు పెట్టించేస్తారు… ఆడ గూసోని ఇంకాసిని తిట్లు తిట్టావనుకో… దెబ్బకి సెలబ్రిటీ అయిపోతావు మరి…’’
‘‘మరి స్టుడియో నుంచి బయటికొచ్చాక.. మనం తిట్టినోళ్ల ఫ్యాన్సొచ్చి మనల్ని యిరగదియ్యరంటావా..’’
‘‘ఎందుకు యిరగదియ్యరు బావా.. ఖచ్చితంగా అది కూడా ఉండుద్ది. కాపోతే.. నాలికతో సెలబ్రిటీ అయిపోవాలనుకుంటే.. యీపు యిమానం మోత మోగించుకోడానిగ్గూడా సిద్దపడే ఉండాల.. ఏటంటావ్’’

– కిరణ్మయి క్రిష్ణ

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.