‘సవ్యసాచి’ మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌
నటీనటులు: నాగ‌చైత‌న్య‌, మాధ‌వ‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, భూమిక‌, భ‌ర‌త్ రెడ్డి, బ్ర‌హ్మాజీ, స‌త్య‌, వెన్నెల‌కిశోర్‌, ష‌క‌ల‌క శంక‌ర్ త‌దిత‌రులు
మ్యూజిక్: ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: యువ‌రాజ్‌
ఆర్ట్: రామ‌కృష్ణ‌
ఎడిటింగ్: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్‌(సి.వి.ఎం)
క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: చ‌ందు మొండేటి

అక్కినేని వారి వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసినా హీరోగా తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య. ఎప్పుడో వచ్చిన కొత్తలో ‘ఏమాయ చేశావే’, ‘100% లవ్’ వంటి సక్సెస్‌లు అందుకున్న చైతూ.. అప్పటి నుంచి ఆ రేంజ్ హిట్ పడక ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు చేయని ప్రయత్నం లేదు. తాజాగా తనకు ‘ప్రేమమ్’తో హిట్‌ను అందించిన చందు మొండేటితో చేసిన సినిమానే ‘సవ్యసాచి’. టీజర్, ట్రైలర్‌తో సినిమా అంచనాలు పెరిగిపోయాయి. వరుసగా లవ్ స్టోరీలు, యాక్షన్ సినిమాలు చేసినా మంచి ఫలితాలు రాకపోవడంతో ఈ సారి డిఫరెంట్ పాయింట్‌తో ముందుకొచ్చాడు చైతూ. అలాగే విభిన్న పాయింట్లతో సినిమాను తెరకెక్కించడంలో నేర్పరి అయిన దర్శకుడు ఈ సినిమా ద్వారా అయినా నాగ చైతన్యకు భారీ హిట్‌ను అందించాడా..?

కథ
విక్ర‌మ్ ఆదిత్య (నాగ‌చైత‌న్య‌) ఓ యాడ్ ఫిల్మ్ మేకర్. అతను వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌తో పుట్టిన వ్యక్తి. అంటే అతనిలో మరో మనిషి కూడా ఉంటాడు. సంతోషం అనిపించినా.. బాధ కలిగిన అతడి ఎడమ చేతిలో ఉండి స్పందిస్తుంటాడు రెండో వ్యక్తి. ఇలాంటి సమస్య ఉన్న ఆదిత్య చిత్ర( నిధి అగర్వాల్)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా విక్రమ్‌ను ఇష్టపడుతున్న క్రమంలో అనుకోని కారణాలతో దూరమవుతారు. ఆరేళ్ల తర్వాత మళ్లీ కలుసుకుంటారు. ఇద్దరూ ప్రేమలో పడతారు. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో విక్రమ్ అక్క శ్రీదేవి(భూమిక) ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుతుంది. ఈ ప్రమాదంలో తన బావ చనిపోతాడు. అంతేకాదు, తనకు ఎంతో ఇష్టమైన అక్క కూతురు మహాలక్ష్మి కూడా కనిపించదు. దీంతో అందరూ చిన్నారి చనిపోయిందని అనుకుంటారు. కానీ, ఆ పాప బతికే ఉంటుంది. ఆమెను ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఇంతకీ ఆ పాపను కిడ్నాప్ చేసింది ఎవరు..? ఆమెను విక్రమ్ ఎలా కాపాడాడు..? విక్రమ్‌లో ఉన్న రెండో మనిషి ఎవరు..? అసలు విక్రమ్ అక్క ఇంట్లో పేలింది గ్యాస్ సిలిండరా..? లేక బాంబా..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!

సినిమా ఎలా ఉందంటే
తెలుగులో ఇంతకు ముందెన్నడూ టచ్ చేయని కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ‘సవ్యసాచి’ ఊహించనంత ఆసక్తికరంగా సాగలేదు. మెయిన్ పాయింట్ విభిన్నంగా ఉన్నా.. దానిని తెరకెక్కించిన విధానం మాత్రం నిరుత్సాహపరిచింది. హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్.. కామెడీ ట్రాక్ కూడా ఆశించినంతగా ఉండవు. మాధవన్-నాగ చైతన్య మధ్య వచ్చే మైండ్ గేమ్, సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా లేవు. ఎమోషన్ సీన్స్ అంత బలంగా లేవు. కానీ, నాగ చైతన్య తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అలాగే మాధవన్ వైవిధ్యమైన నటన ఆకట్టుకుంటుంది. మొత్తంగా ‘సవ్యసాచి’ కూడా అక్కినేని అభిమానులకి నచ్చుతుంది. ఇక మిగతా ప్రేక్షకులైతే ఒకసారి చూడొచ్చు.

నటీ నటుల పనితీరు
ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా కనిపించిన నాగ చైతన్య ఈ సినిమాలో రెండు వైవిధ్యమైన యాంగిల్స్‌లో నటించాడు. కొత్త లుక్‌తో ఫ్రెష్‌గా కనిపించాడు. అలాగే కామెడీ చేయడానికి ట్రై చేయడంతో పాటు, కొన్ని ఎమోషన్ సీన్స్‌లో మెప్పించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాను తన భుజాలపై నడిపించే ప్రయత్నం చేశాడు. ఇక హీరోయిన్‌గా నటించిన నిధి అగర్వాల్ తన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు తన గ్లామర్‌తో పాటుగా తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కాలేజీ సన్నివేశాల్లో మరియు ప్రేమ సన్నివేశాల్లో ఆమె చాలా బాగా నటించింది. కానీ, మరీ అంత ప్రాముఖ్యం ఉన్న పాత్రలా అనిపించదు. ఈ సినిమాలో హైలైట్ అంటే మాధవన్ నటన అనే చెప్పాలి. గతంలో వచ్చిన ప్రేమకథల వల్ల తెలుగు ప్రేక్షకులకు లవర్ బాయ్‌గా పరిచయం ఉన్న మాధవన్.. తెలివి మరియు బలమైన పవర్ ఫుల్ విలన్ పాత్రలో తన గాంభీరమైన నటనతో మెప్పించాడు. అతను ఎంటరైన తర్వాత సినిమా హైరేంజ్‌కు వెళ్తుంది. మరో కీలక పాత్రలో నటించిన భూమిక కూడా ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంది. కమెడియన్లు వెన్నెల కిషోర్, సత్య, షకలక శంకర్ సహా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

టెక్నీషియన్ల పనితీరు
దర్శకుడు చందు మొండేటి మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ, ఆ పాయింట్‌ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. జే యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. చాలా రోజుల తర్వాత వచ్చిన కీరవాణి ఆయన రేంజ్ సాంగ్స్ ఇవ్వకపోయినా పర్వాలేదనిపించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అక్కడక్కడా మెప్పిస్తుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. కానీ, కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి. భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పాటించిన నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

బలాలు
* కథలోని మెయిన్ పాయింట్
* నాగ చైతన్య, మాధవన్ నటన

బలహీనతలు
* స్టోరీ నేరేషన్
* ఫస్టాఫ్
* నటీనటులను సరిగా వాడుకోలేదు

మొత్తంగా: పాపం చైతూ.. ‘సవ్యసాచి’ కూడా..

రేటింగ్: 2.25/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.