‘సర్కార్’ మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ‌: స‌న్ పిక్చ‌ర్స్‌
తారాగ‌ణం: విజ‌య్‌, కీర్తిసురేశ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, యోగిబాబు, రాధార‌వి త‌దిత‌రులు
మాట‌లు: శ్రీరామ‌కృష్ణ‌
పాటలు: చ‌ంద్ర‌బోస్‌, వ‌న‌మాలి
సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
ఛాయాగ్ర‌హ‌ణం: గిరీశ్ గంగాధ‌ర‌న్‌
కూర్పు: శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
నిర్మాత‌: క‌ళానిధి మార‌న్‌
ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్‌

తమిళ సినీ పరిశ్రమలోని టాప్ హీరోలలో ఒకడిగా పేరొందాడు ఇళయదళపతి విజయ్. తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మురుగదాస్‌తో కలిసి చేసిన సినిమానే ‘సర్కార్’. తుపాకీ, కత్తి వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఈ జోడి చేస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అందుకే ఈ సినిమా అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు, తన సహచర నటులు ఇక్కడ భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న సమయంలో విజయ్ కూడా టాలీవుడ్ మార్కెట్‌పై కన్నేశాడు. అయితే, తను ఆశించినంత ఫీడ్‌బ్యాక్ పొందలేకపోతున్నాడు. తుపాకీ, అదిరింది సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్ల పరంగా నిరాశపరిచాయనే చెప్పాలి. మరి క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘సర్కార్’ ఆ లోటును భర్తీ చేసిందా..? విజయ్-మురుగదాస్ హ్యాట్రిక్ నమోదు చేశారా..?

కథ
ఓ కార్పోరేట్ క్రిమినల్ సుందర్ రామస్వామి(విజయ్). సంవత్సరానికి 1800 కోట్లు సంపాదించే బడా బిజినెస్‌మేన్. తన పాపులారిటీతో ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతూ వ్యాపారం చేసే రామస్వామి.. తను ఏ దేశంలో వ్యాపారం చేయాలనుకున్నాడో అక్కడ మిగతా కంపెనీలను మూయించేస్తుంటాడు. ఈ క్రమంలోనే అతడు ఇండియాకు వస్తాడు. అయితే వ్యాపారం కోసం మాత్రం కాదు. ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోడానికి. ఆ సమయంలోనే తన ఓటును ఎవరో వేసేశారని తెలుస్తోంది. దీంతో తనకు ఓటు కల్పించాలని కోర్టుకు వెళ్తాడు. అంతేకాదు, తాను ఓటు వినియోగించుకునే వరకు కౌంటింగ్ ఆపేయాలని కోర్టును కోరి సక్సెస్ అవుతాడు. రామస్వామిని ఆదర్శంగా తీసుకుని కొన్ని లక్షల మంది అదే తరహా పిటిషన్లు వేస్తారు. దీంతో ఎలక్షన్‌లను రద్దు చేసి తిరిగి 15 రోజుల్లో ఎన్నికల నిర్వహించాలని కోర్టు తీర్పునిస్తుంది. తరువాత అధికారి పార్టీ నేతలతో గొడవల కారణంగా అతడు సంచలన నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకీ రామస్వామి తీసుకున్న ఈ నిర్ణయం ఏంటి..? అధికార పార్టీ నేతల వల్ల అతడికి ఏదైనా హాని జరిగిందా..? రామస్వామి మళ్లీ ఇండియాను వదిలి వెళ్లిపోయాడా.. లేదా..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
కత్తి, తుపాకి లాంటి బ్లాక్‌బస్టర్స్‌ అందించిన కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావటంతో సర్కార్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సారి మురుగదాస్‌, విజయ్‌లు ఆ స్థాయిలో అలరించలేకపోయారు. మంచి సామాజిక కథాంశం తీసుకున్నప్పటికీ, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు కొన్ని ఉన్నప్పటికీ సినిమా మాత్రం పూర్తీ ఆసక్తికరంగా సాగలేదు. విజయ్‌ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో అలాగే చూపించిన దర్శకుడు కథ, కథనంపై మరింత దృష్టి పెట్టుంటే బాగుండేది. అలాగే సినిమా నెమ్మదిగా సాగినట్లు అనిపించి బోర్ కొట్టిస్తోంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మరియు కొన్ని పొలిటికల్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ డైరెక్షన్‌తో ఆకట్టుకున్నప్పటికీ.. సెకెండాఫ్‌లో వచ్చే చాలా సన్నివేశాలు రియలిస్టిక్‌గా అనిపించవు. అంతేకాదు సినిమాలో చాల సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా ఉండి సినిమా ఫలితంపై ప్రభావం చూపించాయి. ఓవరాల్‌గా ఈ సినిమా విజయ్‌, మురుగదాస్‌ను అభిమానించేవారికి నచ్చుతుంది.

నటీనటుల పనితీరు
స్టార్ హీరో విజయ్ ఈ సినిమాలో ప్రపంచంలోనే ప్రఖ్యాత వ్యాపారవేత్తగా కనిపించాడు. మంచి ఫ్రెష్ లుక్‌తో చాలా స్టైలిష్‌గా పెర్ఫర్మ్ చేశాడు. తన టైమింగ్‌‌తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే.. ఇటు యాక్షన్ సన్నివేశాల్లోనూ ఇరగదీశాడు. ముఖ్యంగా కొన్ని ఏమోషనల్ సీన్స్‌తో పాటు, పొలిటికల్ సీన్స్‌లో చాలా బాగా నటించాడు. ఇక ఓ రాజకీయ నేత కూతురిగా కనిపించిన హీరోయిన్ కీర్తి సురేష్‌ సినిమాలో పెద్దగా కనిపించదు. కానీ, తనకు దక్కిన సన్నివేశాల్లో మాత్రం ఆకట్టుకుంది. ఇక, ఇందులో మరో పాత్రలో చేసిన వరలక్ష్మీ శరత్‌కుమార్ మరోసారి కట్టిపడేసింది. ఆమె నటన సినిమాకు ఒక హైలైట్ అయింది. ఇక ఎప్పటిలాగే రాధా రవి తన నటనతో మరియు తన మార్క్ హావభావాలతో ఆకట్టుకోగా… కమెడియన్ యోగి బాబు తాను ఉన్న రెండు మూడు సీన్స్‌లో నవ్వించే ప్రయత్నం చేశాడు. వీరితో పాటు సినిమాలో చేసిన ప్రతి ఒక్కరూ తమ పాత్రల పరిధి మేర నటించారు.

టెక్నీషియన్ల పనితీరు
ఈ విభాగంలో ముందుగా దర్శకుడు మురుగదాస్ గురించే చెప్పుకోవాలి. ఆయన రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ.. దాన్ని నడిపించే విధానంలో మాత్రం ఆకట్టుకోలేకపోయారు. కొన్ని సన్నివేశాలు ఆయనేనా రాసింది అనే అనుమానం కలిగించేలా ఉన్నాయి. ఇక మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రహమాన్ అందించిన సంగీతం ఆయన స్థాయికి తగ్గట్లు లేదనిపిస్తోంది. పాటలు సోసోగా నడిపించినా.. కొన్ని సీన్లకు ఆయన అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్‌గా చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ, ఆయన కత్తెరకు ఇంకా కొంచెం పని చెప్పి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

బలాలు
* విజయ్ నటన
* కథా నేపథ్యం
* యాక్షన్ సీన్స్

బలహీనతలు
* స్ర్కీన్‌ప్లే
* నెమ్మదిగా సాగడం
* లాజిక్ లేని సన్నివేశాలు
* సంగీతం

మొత్తంగా: ‘సర్కార్’ విజయ్ అభిమానులకే..

రేటింగ్: 2.25/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.