సమ్మోహనం మూవీ రివ్యూ

టైటిల్ : సమ్మోహనం
జానర్ : ఎమోషనల్‌ లవ్‌ డ్రామా
తారాగణం : సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, సీనియ‌ర్ న‌రేశ్‌, ప‌విత్రా లోకేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, హర్షిణి త‌దిత‌రులు
సంగీతం : వివేక్‌ సాగర్‌
దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ
నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్‌

సూపర్‌స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో ఓ వైపు.. స్టార్ ఇమేజ్‌తో సంబంధం లేకుండా కథను నమ్మి సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మరోవైపు.. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే.. ప్రేక్షకులు సమ్మోహనభరితులవుతారా? లేదా?.. విభిన్నమైన కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చినా.. తనలోని టాలెంట్‌తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో సుధీర్‌బాబు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘సమ్మోహనం’. ప్రతిసారీ తెలుగు ప్రేక్షకులకు ఏదో ఒక కొత్తదనాన్ని అందించే మోహనకృష్ణ.. ఈసారి ప్రేక్షకులను సమ్మోహనపరిచారా? లేదా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

కథ :
ఆర్‌.విజయ్‌ కుమార్‌ అలియాస్‌ విజ్జు (సుధీర్‌ బాబు) అందరు అబ్బాయిల్లా గర్ల్‌ ఫ్రెండ్స్‌‌తో తిరగాలి.. జల్సాలు చేయాలి అనే కోరికలు లేని కుర్రాడు. సినిమాలంటే ఆసక్తి ఉండదు.. సినిమావాళ్లంటే అసలు పడదు. వాళ్లు సాధారణ మనుషుల్లా ఉండరనేది విజ్జు ఫీలింగ్. కాస్త భిన్నంగా ఆలోచించే అలవాటున్న విజ్జు చిన్నపిల్లల కథలకు బొమ్మలకు గీస్తుంటాడు. తన బొమ్మలతో ఓ పుస్తకాన్ని విడుదల చేయాలని ప్రయత్నిస్తుంటాడు. విజ్జు తండ్రి సర్వేష్(సీనియర్‌ నరేష్‌) సినిమాల మీద ఇష్టంతో వాలెంటరీ రిటైర్మెంట్‌తీసుకొని మరీ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయాత్నాలు చేస్తుంటాడు. అలాంటి సమయంలో సర్వేష్ ఇంట్లో షూటింగ్ చేయడానికి ఓ చిత్ర యూనిట్ ముందుకొస్తుంది. మీ ఇంట్లో షూటింగ్ చేసుకోనిస్తే వేషం ఇస్తానని చెప్పటంతో సర్వేష్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా షూటింగ్‌కు ఇల్లు ఫ్రీగా ఇచ్చేస్తాడు. ఆ సినిమాలో హీరోయిన్‌ సమీరా రాథోడ్‌(అదితి రావు హైదరీ). హీరోయిన్ సమీరా నార్త్ ఆమె కావడంతో తెలుగు డైలాగులు చెప్పేందుకు ఇబ్బంది పడుతుంటుంది. సినిమా షూటింగ్‌ను తొలిసారి దగ్గరుండి చూస్తున్న సర్వేష్ ఫ్యామిలీ.. హీరోయిన్ డైలాగులు విని నవ్వుకుంటారు. అది గమనించిన సమీరా తాను త్వరగా తెలుగు నేర్చుకోవాలని, తనకు తెలుగు నేర్పించాలని విజ్జును అడుగుతుంది. విజ్జు కూడా సరేనంటూ కోచింగ్ ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఈ ప్రాసెస్‌లో ఒకరి మీద ఒకరికి ఇష్టం కలుగుతుంది. అప్పటివరకూ ఏ అమ్మాయితోనూ అంత క్లోజ్‌గా మాట్లాడని విజ్జు.. సమీరా పొగడ్తలకు పడిపోతాడు. సమీరాకు కూడా విజ్జు అంటే ఇష్టం ఉంటుంది కానీ ఆమె వ్యక్తం చేయదు. షూటింగ్ తరువాత కూడా సమీరాను మర్చిపోలేని విజ్జు ఆమెను కలిసేందుకు కులుమనాలీ వెళ్లి తన ప్రేమ విషయం చెపుతాడు. కానీ సమీరా తనకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పటంతో సమీరా మీద విజ్జు కోపం పెంచుకుంటాడు. అలా దూరమైన సమీరా, విజ్జులు తిరిగి ఎలా ఒక్కటయ్యారు..? విజ్జు అంటే ఇష్టం ఉన్నా.. ఆ సమయంలో సమీరా ఎందుకు ఎందుకు నో చెప్పింది..? దానివెనకున్న మిగతా కథేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!

 

విశ్లేషణ:
సినిమావాళ్లంటే జనాల్లో చాలా చులకన భావం ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంది. ఒక అమ్మాయి సినిమాల్లోకి వచ్చిందంటే.. అన్నింటికీ సిద్ధంగా ఉంటుందని గుడ్డిగా అనుకుంటారు. ఇలా అనుకునే జనాల మధ్య ఉన్న ఓ కుర్రాడికి, సినిమా ఇండస్ట్రీయే ప్రాణంగా భావించే ఓ హీరోయిన్‌కు మధ్య ప్రేమ కథను క్రియేట్ చేసి కాస్త వైవిధ్యంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు ఇంద్రగంటి కృష్ణమోహన్. ఆ ప్రేమకథకు బలమైన ఎమోషన్స్‌, కామెడీని జోడించి మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. తొలిభాగంలో వచ్చే కామెడీ బాగా పండింది. హీరో ఇంట్లో షూటింగ్ సమయంలో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. తెలుగు సినిమాల్లో తెలుగువాళ్లకు అవకాశాలు రాకపోవడంపై, తెలుగు వాళ్లు అయ్యుండి తెలుగు మాట్లాడడం సరిగ్గా రాని నటీనటులపై పేల్చే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఫస్ట్ ఆఫ్ వరకూ బాగానే అనిపించినా.. సెకెండాఫ్ మొదలయ్యాక సినిమా కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. అయితే సెకెండాఫ్‌లో వచ్చే పాటలు ఆలోటు తీర్చే ప్రయత్నం చేశాయి. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాల మూడ్‌కు తగ్గట్టు ఉంది. సినిమాటోగ్రఫి సినిమాకు మరింత గ్లామర్ తీసుకువచ్చింది. పాటల చిత్రీకరణ బాగుంది. లొకేషన్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు మరింత పనిచెప్పాల్సింది.

నటీనటులు:
మధ్యతరగతి కుర్రాడి పాత్రలో సుధీర్‌ బాబు నటన బాగుంది. గత చిత్రాలతో పోలిస్తే నటనలో మంచి పరిణతి కనబరిచాడు. ఎమోషనల్‌ సీన్స్‌ను కూడా అ‍ద్భుతంగా పండించాడు. తెలుగులో తొలిసినిమా అయినా సమీరా పాత్రలో అదితి రావు హైదరీ నటన ఆకట్టుకుంది. సినిమా హీరోయిన్ అయినా తాను కూడా అందరిలాంటి అమ్మాయినే అని చెప్పడానికి ప్రయత్నించే సందర్భాల్లో ఆమె ఎమోషన్స్‌ చాలా బాగా చూపించారు. హీరో తండ్రి పాత్రలో సీనియర్‌ నరేష్‌ సినిమాకు ప్లస్ అయ్యారు. కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. ఇక హీరో తల్లిగా నటించిన పవిత్రా లోకేష్‌, హీరో ఫ్రెండ్స్‌గా చేసిన రాహుల్‌ రామకృష్ణ, అభయ్‌, ఇతర పాత్రలో నటించిన తనికెళ్ల భరణి, హరితేజ, నందు తమ పాత్రలకు న్యాయం చేశారు.

చివరిగా.. ప్రేక్షకులను ‘సమ్మోహన’పరిచే చిత్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.