సాక్ష్యం మూవీ రివ్యూ

బ్యాన‌ర్‌: అభిషేక్ పిక్చ‌ర్స్‌
న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రానా, మధు గురు స్వామి, జయ ప్రకాష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
మ్యూజిక్ డైరెక్టర్ : హర్షవర్ధన్ రామేశ్వరన్
కెమెరామెన్: ఆర్థర్ ఏ విల్సన్
ఆర్ట్ : ఏఎస్. ప్రకాష్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావ్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
నిర్మాత: అబిషేక్ నామ
డైరెక్టర్: శ్రీవాసు

నిర్మాత కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసినా.. నటన మీద తపనతో ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తొలి చిత్రంతోనే మంచి వసూళ్లను సాధించిన శ్రీనివాస్.. ‘జయ జానకీ నాయక’తో మంచి హిట్ కొట్టాడు. నిర్మాత కొడుకు కావడంతో ఆయన ప్రతి సినిమాలో హైలెవెల్ మేకింగ్‌తో తన మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలకే పరిమితమైన బెల్లంకొండ వారి అబ్బాయి.. ఈ సారి ‘సాక్ష్యం’ వంటి కాన్సెప్ట్ మూవీతో వస్తున్నాడు. అతడి గత చిత్రాలతో పోలిస్తే ఇది భారీ బడ్జెట్ చిత్రం కావడం.. ‘ల‌క్ష్యం’, ‘లౌక్యం’, ‘డిక్టేట‌ర్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమాను తెరకెక్కించడం వంటి కారణాలతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం హిట్ అయిందా..? లేక ఫట్ అయిందా..?

కథ
స్వస్థిక్ పురం అనే గ్రామంలో రాజుగారి(శరత్ కుమార్) కుటుంబం పెద్ద దిక్కుగా ఉంటుంది. అదే గ్రామంలో మునుస్వామి(జగపతిబాబు), అతడి సోదరులతో కలిసి ఉంటాడు. ఒకానొక సందర్భంలో మునుస్వామి బృందం, సాక్ష్యం లేకుండా రాజుగారి కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తుంది. కానీ, ఎన్నో రోజుల తర్వాత పుట్టిన ఆయన కుమారుడు(బెల్లంకొండ సాయి శ్రీనివాస్) ఊహించని విధంగా తప్పించుని, కాశీ చేరుకుంటాడు. అక్కడ నివసించే శివ ప్ర‌కాశ్‌(జ‌య‌ప్ర‌కాశ్‌) వద్దకు చేరిన ఆ చిన్నారికి విశ్వ‌జ్ఞ అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తాడు. విశ్వ విదేశాల్లో పెరిగి పెద్దవాడవుతాడు. ఓ దశలో సౌంద‌ర్య‌ల‌హ‌రి(పూజా హెగ్డే)తో ప్రేమలో పడతాడు. ఆమె కోసం 20ఏళ్ల తర్వాత ఇండియాకు వస్తాడు. ఇక్కడికి వచ్చిన విశ్వకు ఊహించని సంగతులు ఎదురవుతుంటాయి. అసలు తను ఎంతగానో ప్రేమించిన సౌందర్యలహరి ఎవరు..? ఈ క్రమంలో తన కుటుంబాన్ని అంతం చేసిన మునుస్వామి గురించి తెలుసుకుంటాడా..? వారిపై ఎలా ప్రతికారం తీర్చుకుంటాడు..? ఈ విషయంలో ప్రక‌ృతి(నేచర్) విశ్వకు ఎలా సహాయపడింది..? అనే విషయాలు చూడాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
విలన్లు.. హీరో కుటుంబాన్ని చంపడం.. వారిపై హీరో పగ తీర్చుకోవడం వంటి కాన్సెప్ట్‌లో తెలుగు తెరపై కొన్ని వందల సినిమాలు వచ్చాయి. అయితే ఇందులో దర్శకుడు కొత్త కోణాన్ని తీసుకుని మొదట సఫలీకృతుడయ్యాడు. హీరో ప్రతీకారం తీర్చుకోడానికి పంచ భూతాలు సహకరించడం అనేది సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఈ విషయంలో డైరెక్టర్‌ను మెచ్చుకోవాలి. మొదటి ఇరవై నిమిషాలు సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది. హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత వాళ్లిద్దరి లవ్ ట్రాక్ కొంచెం బోర్ కొట్టించేదిగా ఉంటుంది. అయితే ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ సెకెండాఫ్‌పై అంచనాలు పెంచేస్తుంది. ఇక, మలి సగంలో విలన్లపై ప్రతీకారం తీర్చుకునే ఎపిసోడ్స్ ఒక్కోటి ఒక్కోరకంగా సాగడంతో క్లైమాక్స్‌పై అంచనాలు పెరిగిపోతాయి. అయితే, మధ్యలో ఇరికించిన సాంగ్స్ వల్ల ప్రేక్షకుడు ఇబ్బంది పడతాడు. అలాగే కొన్ని సీన్స్ ఊహించినట్లే ఉంటాయి. అక్కడక్కడా లాజిక్ లేని సీన్స్ వస్తాయి కానీ, కొత్త కథనంతో మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటికి వస్తాడు.

నటీనటులు, టెక్నీషియన్ల పనితీరు
ఇక హీరో గురించి చెప్తే.. అతడి మునుపటి సినిమాలకు ఈ సినిమాకు చాలా పరిణితి చెందాడు. అతడి మేకొవర్ నుంచి యాక్షన్, డైలాగ్ డెలివరీలో కొంచెం మెరుగయ్యాడు. కానీ డబ్బింగ్ అక్కడక్కడా సింక్ అవలేదు అనిపిస్తుంది. ఇక హీరోయిన్, కేవలం ప్రేమకు, పాటలకు పరిమితమైనా అక్కడక్కడా తన నటనతో మెప్పిస్తుంది. చాలా కాలం తర్వాత కనిపించిన మీనా, శరత్ కుమార్, జగపతిబాబు బ్రదర్స్ సహా మిగతా నటీ నటులందరూ తమ పాత్రకు న్యాయం చేశారు. దర్శకుడు శ్రీవాస్ ఈ తరహా సినిమాలు చేయకపోయినా, మొదటి ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. ఆయన సృషించిన కోణమే సినిమాను నిలబెట్టింది. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ అంటే పీటర్ హెయిన్స్ యాక్షన్ ఎపిసోడ్సే. ఇక సంగీతం విషయానికొస్తే సాంగ్స్ పర్వాలేదనిపించినా, రీరికార్డింగ్ మాత్రం చాలా బాగా చేశాడు సంగీత దర్శకుడు హర్షవర్ధన్. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు కంటికి కనిపించేలా సినిమాటోగ్రఫీ పని చేసింది. అయితే, ఎడిటర్ మాత్రం తన కత్తెరకు ఇంకొత పని చెప్పుంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్
* యాక్షన్ ఎపిసోడ్స్
* దర్శకుడు ఎంచుకున్న కోణం
* నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్
* హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్
* లాజిక్ లేని సీన్స్

మొత్తంగా: ‘సాక్ష్యం’.. లాజిక్ వెతుక్కోకుండా కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు నచ్చుతుంది

రేటింగ్: 2.5/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.