సాయిపల్లవి ఇంత మాటనేసిందేంటి..?

సినిమా సినిమాకు తనలోని టాలెంట్ రెట్టింపుగా ప్రదర్శిస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది సాయిపల్లవి. మేకప్ కి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకుండా తన పర్‌ఫార్మెన్స్‌ని మాత్రమే నమ్ముకుందీ చిన్నది. మళయాళ ‘ప్రేమమ్’ తో సినీ గడప తొక్కిన ఈ భామ తెలుగులో ‘ఫిదా’ ద్వారా అందరినీ బుట్టలో పడేసింది. ఆ తర్వాత తెలుగులో ‘ఎంసీఏ’, ‘కణం’, ‘పడి పడి లేచె మనసు’ సినిమాలతో మెప్పిస్తూ ఇతర బాషా చిత్రాల్లో బిజీ అయింది సాయి పల్లవి. ఇక ఇటీవలే వచ్చిన ‘మారి 2’ సినిమాలో ధనుష్ తో కలిసి ఇరగదీసింది.

ఇలా హీరోయిన్‌గా దూకుడు మీదున్న ఈ అమ్మాయిగారు.. ఇటీవల పెళ్ళిపై స్పందించిన తీరు మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది. తాను జీవితాంతం కన్యగానే ఉంటానని చెప్పటంతో అవాక్కయ్యారంతా. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విలేకరి ఆమెను వివాహం గురించి ప్రశ్నించారట. దీనికి ఆమె చెప్పిన ఈ సమాధానంతో అక్కడున్న వారి మతిపోయిందట. పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నా. నాకు తల్లిదండ్రులతోనే ఉంటూ వారి బాగోగులు చూసుకోవాలనుంది. పెళ్లి జరిగితే అది సాధ్యం కాకపోవచ్చు. అందుకే జీవితంలో వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నా” అని చెప్పిందట సాయి పల్లవి. దీంతో సాయిపల్లవి పెళ్లిచేసుకోదట అని కోడై కూస్తోంది సోషల్ మీడియా అంతా.

ఆ మధ్య సాయి పల్లవి షూటింగ్ కి లేటుగా వస్తోందని, ఆమె హీరోలతో వైరం పెట్టుకుంటోందని పలు రకాల వార్తలతో సెన్సేషన్ గా మారిన సాయి పల్లవి.. ఇప్పుడు పెళ్లి విషయంలో ముక్కు సూటిగా మాట్లాడి మరోసారి సెంటర్ అఫ్ అట్రాక్షన్ అయింది. అయితే సాయి పల్లవి ముక్కుసూటి తనాన్ని మెచ్చుకుంటూనే.. పెళ్లనేది జీవితంలో ఓ భాగం.. అదే వద్దంటే ఎలాగమ్మా? అని సాయి పల్లవి గురించి చర్చ మొదలైంది జనాల్లో. ఈ భామ అన్నంత పని చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు ఇంకొందరు.

ప్రస్తుతం ఈ భామ సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్జీకే’ సినిమాలో నటిస్తోంది. సూర్య హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మరో హీరోయిన్. ఫిబ్రవరి 14న ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. మరోవైపు మలయాళంలో ఫాహద్‌ ఫాసిల్‌ సినిమాలోనూ నటిస్తోంది. ఇక తెలుగులో వేణు ఉడుగుల దర్శకత్వంలో ఆమె కొత్త ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనుందని సమాచారం. వేగంగా సినిమాలు చేస్తున్న ఈ భామ మాటలు మాత్రం సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.