సాయి కుమార్ గెలుపు ఎత్తులు

కర్నాటక ఎన్నికల్లో బీజేపీ పక్షాన పోటీ చేస్తున్నారు ప్రముఖ నటుడు సాయి కుమార్. డైలాగ్ కింగ్ గా ప్రసిద్ది కెక్కిన సాయి కుమార్ తండ్రి పిజే శర్మ తెలుగువారే. తల్లి కృష్ణ జ్యోతి కన్నడ నటి. ఇటు తెలుగు, అటు కన్నడ కలిసిన కుటుంబం. సాయి కుమార్ కుమారుడు ఆది నటుడే. డబ్బింగ్ ఆర్టిస్టుగా అడుగు పెట్టి తనదైన శైలిలో సినిమాల్లో స్థానం సంపాదించాడు డైలాగ్ కింగ్. బీజేపీ నేత అయిన సాయి కుమార్… కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి నియోజకవర్గంలో పోటీ చేసాడు. అక్కడ తమదే గెలుపంటున్నాడు సినీ నటుడు, బీజేపీ అభ్యర్థి సాయికుమార్. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోవడంతో సాయికుమార్ తోను బీజేపీ ప్రచారం చేయిస్తోంది. కర్ణాటకలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. సభల మీద సభలు పెడుతున్నారు. రాహుల్ గాంధీ హిందీలో ఆపకుండా 15 నిమిషాలు మాట్లాడగలడా అని సవాల్ విసురుతున్నారు. మీ అమ్మ భాష (ఇటాలియన్)లోనైనా అలా చెబుతావా అంటూ చురకలంటించారు. ఫలితంగా కర్నాటక ఎన్నికలు వాడి వేడిని సంతరించుకున్నాయి. 
తెలుగు నటుడు సాయికుమార్‌పై అందరి దృష్టి నెలకొంది. బాగెపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సాయికుమార్ ను అక్కడ జనం ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నాడు. అమ్మమ్మగారి ఊరు తనను గౌరవిస్తుందని నమ్ముతున్నాడు. ఈ సారి విజయం తనదేనంటున్నారు. ఇక్కడ పోటీ చేయడం తనకు సెంటిమెంట్ అని, మోదీ నాయకత్వంలో కర్ణాటకలో బీజేపీ విజయం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లు జేడీఎస్ పక్షాన అక్కడ ప్రచారం చేస్తారనే వాదన వచ్చింది. అందుకే బాగెపల్లిలో పవన్ కల్యాన్ వచ్చి ప్రచారం చేసినా ప్రయోజనం లేదంటున్నారు సాయి కుమార్. అందుకు తన వద్ద కౌంటర్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఫలింతగా కర్నాటక ఎన్నికల్లో ఆసక్తికర పోరు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయనేది మెజార్టీ సర్వేలు చెప్పిన మాట. అయినా సరే బీజేపీ.. మిగతా పార్టీలతో కలిపి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని బలంగా చెబుతున్నారు. తెలుగువారు దాదాపుగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసే వీలుంది. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు.. విభజన హామీలను నెరవేర్చలేదు బీజేపీ. మరోవైపు కావేరి విషయంలో తమిళనాడుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది బీజేపీ. ఫలింతగా తమిళ తంబీలు కమలం పార్టీని కాదంటున్నారు. ఇక తెలంగాణ ప్రజలు తమకు బీజేపీ అన్యాయం చేసిందని చెబుతున్నారు. మొత్తంగా బీజేపీకి అక్కడ దబిడి దిబిడే అంటున్నారు. అవన్నీ ఒక ఎత్తయితే.. తనకు తెలుగు వారి మద్దతు బాగా ఉందని సాయి కుమార్ చెప్పడం ఆసక్తికరమే.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.