కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన సబిత కుమారుడు

మహాకూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్.. ఆ పార్టీ నేతలు చేస్తున్న పనికి చిన్నబోతోంది. నాలుగు పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసి టిఆర్ఎస్ ను ఓడించాలని అనుకుంది. అయితే, సీట్ల సర్దుబాటు విషయంలో ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. కూటమిలోని పార్టీలు ఎక్కువ సీట్లు అడిగినా కాంగ్రెస్ మాత్రం కొన్ని స్థానాలను కేటాయించింది. దీంతో ఆయా పార్టీలు కాంగ్రెస్ తీరుపై బహిరంగంగానే విమర్శలు చేశాయి. ఇక సీట్ల సర్దుబాటు పూర్తయిన తర్వాత సొంత పార్టీ నేతల నుంచి అదే రీతిలో వ్యతిరేకత వచ్చింది. టికెట్లు ఆశించిన చాలామంది నేతలకు అధిష్టానం మొండిచేయి చూపడంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. వారిని బుజ్జగించేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటున్నా.. కొందరు నేతలు మాత్రం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇంకొందరైతే కాంగ్రెస్ రెబల్స్ గా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది. తాజాగా మరో కీలక నేత ఇది రాజీనామా చేశాడు. దీంతో కాంగ్రెస్ లో కలవరం మొదలైంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టిక్కెట్ ఆశించి భంగపడిన ఆయన ఈ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయింది. ఆయనతో పాటు పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, డివిజన్ అధ్యక్షులుతో సహా మెజారిటీ నాయకులు కూడా అధిష్టానం తీరుపై ఆగ్రహంతో గుడ్బై చెప్పేశారు. పొత్తుల్లో భాగంగా రాజేంద్రనగర్ సీటును టీడీపీకి కేటాయించిన సంగతి తెలిసిందే. మహాకూటమి అభ్యర్థిగా రాజేంద్రనగర్ నుంచి గణేష్ గుప్తాకు టికెట్ లభించింది. అయితే తాను ఎప్పటి నుంచి రాజేంద్రనగర్ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నానని, తన అభ్యర్థిత్వం గురించి పరిశీలించాలని పార్టీకి కార్తీక్‌రెడ్డి పలుమార్లు విన్నవించుకున్నారు. అయినప్పటికీ టికెట్ దక్కకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి కొడుకు పి.కార్తీక్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి స్వర్గీయ పి.ఇంద్రారెడ్డి వారసత్వాన్ని కొనసాగింపజేయాలనే ఆశతో పి.సబితా ఇంద్రారెడ్డి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అందుకోసం ఆమె కొడుకును చాలా కాలం కిందటి నుంచే జనంలో ఉంచుతున్నారు. ప్రతి కార్యక్రమంలోనూ కార్తీక్‌రెడ్డి పాల్గొంటున్నారు. తనకున్న పరిచయాలను, ప్రజల్లో తన పట్ల ఉన్న ఆదరణను ఉపయోగించుకుని ఈసారి కొడుకును ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే పట్టుదలతో సబిత ఉన్నారు. ఇలాంటి సమయంలో తన కుమారుడికి టికెట్ దక్కకపోవడంతో సబిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.