రేవంత్ రెడ్డి దృష్టి అటు వైపు మళ్లిందట

తెలంగాణలో ఉన్న పవర్‌ఫుల్ లీడర్లలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఒకరు. ఆయన ప్రసంగాలకు, ఇతర పార్టీ నేతలకు ఇచ్చే కౌంటర్లకు చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. అంతేకాదు పార్టీలకతీతంగా ఆయనను అభిమానించేవారు చాలా మందే ఉన్నారు. తెలుగుదేశంలో అనతి కాలంలోనే కీలక నేతగా ఎదిగిన రేవంత్.. అధినేతకు నమ్మిన బంటులా ఉన్నారు. చాలా కాలం పార్టీలో చురుకైన పాత్రను పోషిస్తూ పవర్‌ఫుల్ లీడర్‌గా ఎదిగారు. పార్టీ అధినేత చంద్రబాబు కూడా రేవంత్‌ను నమ్మినట్లు ఎవరినీ నమ్మేవారు కాదనే టాక్ కూడా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే తన సత్తా చూపించిన రేవంత్‌ రెడ్డి.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఆ పార్టీకి పెద్ద దిక్కు అయ్యారు. చాలా కాలం పార్టీని తన భుజస్కందాలపై మోసిన ఆయన.. వ్యక్తిగత కారణాలు చెప్పి, కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అప్పటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా ఆయన దృష్టి తన నియోజకవర్గం వైపు మళ్లిందనే వార్తలు వస్తున్నాయి.

ఇటీవల తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డికి అక్కడి ఓటర్లు షాక్ ఇచ్చారట. ప్రసంగాలకు, చర్చలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజాసమస్యల పరిష్కారానికి ఎందుకు ఇవ్వడం లేదని మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నించారని, నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలపై దృష్టి పెట్టిన తర్వాతే రాష్ట్ర సమస్యలపై గళం విప్పాలంటూ కొడంగల్‌ నియోజకవర్గ ప్రజలు తమ శాసన సభ్యుడు రేవంత్‌రెడ్డిని కోరారని ప్రచారం జరిగింది. దీంతో ఆయన తన దృష్టిని నియోజకవర్గం వైపు మళ్లించారని తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను ఓడించాలని చూస్తున్న ఆయన ముందు తన నియోజకవర్గ ప్రజల నుంచి మంచి పేరు సంపాదించాలని చూస్తున్నాడని, అందుకోసం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.